- పొరుగు దేశంలో అడ్డా జమాయిస్తున్న చైనా
- చైనా నౌకను నిలువరించడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలం
- అదిలించో, బెదిరించో పొరుగు రాజ్యాలను స్వాహా చేస్తున్న చైనా
శ్రీలంక దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళడానికి, ఇప్పుడప్పుడే కోలుకోలేనంతగా దెబ్బతగలడానికి మూల కారణల్లో చైనా ప్రభావం ప్రధానమైంది. ఘోరమైన దుస్థితిలో ఉన్న లంకకు అండగా నిలిచిన దేశాలలో మొట్టమొదటిది, అగ్రస్థానీయమైంది భారతదేశం. ఈ విషయాలను ఇంత తొందరగా శ్రీలంక మరచిపోవడమే అత్యంత హేయం. తాజా పరిణామాలు ఆ తీరుకు అద్దం పడుతున్నాయి. చైనా నిఘా నౌక ‘యువాన్ వాంగ్-5’ హంబన్ టొట రేవుకు చేరనే చేరింది. ఇలా జరుగుతుందని ముందే పసిగట్టిన భారత్ అనుమతులు ఇవ్వకుండా ఆ దేశాన్ని వారించింది. దీనిపై ప్రతిస్పందనగా వాయిదా వేయాలని చైనాకు చెప్పినట్లుగా శ్రీలంక అధికారులు చెబుతున్నారు. కానీ జరగాల్సిన పని జరిగిపోయింది. చైనా ఒత్తిడిని తట్టుకోలేక అనుమతి ఇచ్చినట్లుగా అర్ధమవుతోంది. సముద్ర జలాల్లో సర్వేల పేరుతో చేపట్టే చర్యలన్నీ మన దేశానికి క్షేమదాయకం కాదు.
Also read: స్వాతంత్ర్య సమర వీరులకు వందనాలు
లంక హార్బర్ వందేళ్ళు చైనా హక్కుభుక్తం
మనకు సరిహద్దు దేశంగా ఉన్న శ్రీలంక జలాల్లో చైనా నిఘా నౌక ఉండడం వల్ల మన కదలికలు, ఇరు దేశాల పరిణామాలు, రవణా పరిణామాలన్నింటినీ చైనా పసిగట్టే అవకాశం ఉంది. ఇప్పటికే లడాఖ్ తదితర సరిహద్దుల్లో చైనా అలజడి సృష్టిస్తోంది. ఏ సమయంలో ఎటువంటి యుద్ధ వాతావరణం వస్తుందో చెప్పలేం. మన వాణిజ్యానికి కూడా లాభదాయకం కాదు. జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమెటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సహజ సిద్ధంగానే అన్నింటినీ రికార్డు చేస్తుంది. దానిని ఆపు చేయాలనే నిబంధనతోనే వారికి అనుమతి ఇచ్చామని కొలంబో అధికారులు చెబుతున్నప్పటికీ ఆ మాటలను నమ్మలేం. హంబన్ టొట అభివృద్ధి కోసం చైనా నుంచి శ్రీలంక సుమారు 1.2బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది. అసలు కాదు కదా, వడ్డీలు కూడా కట్టలేని దుస్థితిలోకి ఆ దేశం వెళ్లిపోయింది. ఈ బలహీనతను అడ్డంపెట్టుకొని ఈ పోర్టును చైనా 99ఏళ్ళ లీజుతో తన అధీనంలోకి తెచ్చుకుంది. దాదాపు వందేళ్ల వరకూ ఈ పోర్టుఫై శ్రీలంక హక్కులను కోల్పోయినట్లే. నిన్నటి దాకా రాజపక్సాల ఏలుబడిలో ఇటువంటి దుశ్చర్యలే జరిగాయి. చైనాకు శ్రీలంక అధిపతులు వ్యక్తిగత స్వార్థంతో అమ్ముడుపోయి సొమ్ములు సంపాయించి ప్రజలను వీధుల పాలు చేశారు. దేశాన్ని తాకట్టులో పెట్టి,పరపతి పోగొట్టి,ఇక్కట్ల పాలు చేశారు. చైనా వల్ల శ్రీలంకకు అష్టకష్టాలు వచ్చాయి. ఇటీవలే కొత్త ప్రభుత్వం వచ్చింది. ఐనప్పటికీ గత ఏలికులు చేసిన తప్పులు బలంగా ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చైనా కనుసన్నల్లోనే ఆ దేశం ఉందని చెప్పడానికి హంబన్ టొటలోనే తాజా పరిణామాలే ఉదాహరణ.
Also read: గజం మిధ్య, పలాయనం మిధ్య
చైనాది ధృతరాష్ట్ర కౌగిలని లంక గ్రహించాలి
పొరుగు దేశాల భద్రత, సహకారం, సార్వభౌమత్వం ప్రశ్నార్ధకంగానే మిగిలిపోతున్నాయి. సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు చెక్ పెట్టే దిశగా ప్రతి క్షణం సరికొత్తగా సిద్ధమవుతున్నామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అంటున్నారు. దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యం అమ్ములపొదిలో మరిన్ని ఆయుధాలను తాజాగా చేర్చామని ఆయన గుర్తు చేస్తున్నారు. వాస్తవాధీన రేఖ వెంట చైనా కవ్వింపు చర్యలు పెరుగుతున్నాయి తప్ప తరగడం లేదు. యుద్ధ విమానాలను భారత సరిహద్దులకు పంపుతూ రెచ్చగొట్టే చర్యలకు చైనా పాల్పడుతోంది. అనేక రకాల తాయిలాలు చూపెట్టి, ఎన్నో రకాలుగా భయపెట్టి సరిహద్దు దేశాలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకోవడంలో చైనా విజయం సాధించింది. తనకు ఎప్పటికీ పోటీగా నిలిచే భారత్ ను దెబ్బతీయాలన్నదే చైనా కుట్ర. శ్రీలంక వంటి దేశాలు ఆ మాయలో పడిపోయాయి. ఇంకా పడిపోతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ భారత వైపు చూస్తున్న వేళ శ్రీలంక పూర్తిగా మనవైపే నిల్చోవడం వివేకం.
Also read: బాబోయ్ బీహార్!
మన ద్వారా పొందిన మేళ్లను గుర్తుపెట్టుకొని కృతజ్ఞతగా మెలగడం నైతికం. చైనాను దూరంగా పెట్టడం శ్రేయస్కరం. కొత్త ఏలికలైనా ఆ దేశాన్ని సన్మార్గంలో నడుపుతారని ఆశిద్దాం.