- క్రమంగా పెరుగుతున్న కేసులు
- లాక్ డౌన్ విధిస్తున్న ప్రభుత్వం
- చైనా చేరుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు
చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. కొద్ది రోజులుగా హెబీ సహా కొన్ని ప్రావిన్సులలో కేసుల పెరుగుతున్నందున లాక్ డౌన్ ను పొడిగిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. బీజింగ్ కు సమీపంలోని గ్వాన్ నగరంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని అధికారులు జారీ చేశారు. సుమారు 5 నెలల తర్వాత అత్యధికంగా ఒకే రోజు 110 కేసులు నమోదయినట్లు అధికారులు తెలిపారు. హెబీ ప్రావిన్స్ లో పరిస్థితి చేజారకుండా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తూ భారీగా కరోనా టెస్టులు చేస్తోంది. బీజింగ్ లోనూ ఒక కరోనా కేసు నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్నంతా లాక్ డౌన్ లో విధించారు. ప్రజలు మరో ఏడు రోజులపాటు అనవసర ప్రయాణాలు మానుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాలు వాయిదా
గత సంవత్సరం మార్చిలో జరగాల్సిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్ని వాయిదా వేశారు. ఆ సమావేశాలు ఫిబ్రవరి నెలలో హెబీ ప్రావిన్స్ లో జరగాల్సి ఉంది. ఇపుడు మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో మరోసారి సమావేశాలను ప్రావిన్షియల్ అధికారులు వాయిదా వేశారు. కానీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించనున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
మరోవైపు కరోనా పుట్టుకపై విచారణ జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం గత వారం చైనా చేరుకుంది. కొవిడ్ తొలుత మనుషులకు ఎలా సోకిందనే విషయంపై నిపుణులు దృష్టి సారించనున్నారు. చైనాలో ఇప్పటివరకు దాదాపు 88 వేల కేసులు నమోదు కాగా 4634 మంది కరోనా సోకి మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కార్గో విమానాల్లో దేశవ్యాప్తంగా కొవిషీల్డ్ వాక్సిన్ సరఫరా