Sunday, December 22, 2024

వక్రబుద్ధి చైనా

  • చైనా, పాకిస్తాన్, ఆఫ్టనిస్తాన్ నుంచి ప్రమాదం
  • పొరుగున్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లను కట్టివేస్తున్న చైనా
  • చైనాతో వైరం పెంచుకోవడం నష్టదాయకం
  • అన్ని రకాలా అభివృద్ధి చెందడం ఒక్కటే మార్గం

చైనా బుధ్ధి మారదని చెప్పడానికి తాజా పరిణామాలు ఉదాహరణగా నిలుస్తాయి. భారత సరిహద్దుల్లో ఏదో విధంగా అలజడి సృష్టించడం, తన ఉనికిని కాపాడుకోవడం ఆ దేశపు కుటిల విదేశాంగ విధానంలో భాగమేనని చెప్పాలి. ఇరు దేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలను పదే పదే అతిక్రమించడం చైనాకు నిరంతర అభ్యాసంగా మారింది. గత ఆరు నెలల నుంచి పెద్ద ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొనకపోయినా, ఉపక్రమించాల్సిన బలగాలను క్రమంగా పెంచుకుంటూ పోవడం ఆందోళన కలిగించే అంశమే. ఈపాటికే అదనపు బలగాలను ఉపసంహరించుకొని ఉండాలి. ఈ ప్రక్రియ కొంతకాలం సజావుగానే సాగింది. సరిహద్దుల్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడింది. మళ్ళీ కొన్నాళ్ల నుంచి చాపకింద నీరులా, మౌలిక సదుపాయాలను పెంచుకుంటూ, మెరుగుపరుచుకుంటూ వెళ్తోంది. గాంధీ జయంతి సందర్భంగా,మువ్వన్నెల జెండా ఆవిష్కరణలో భాగంగా  మన సైనిక దళాధిపతి జనరల్ ఎంఎం నరవణే… లద్దాఖ్ పర్వతశ్రేణుల్లో పర్యటించారు. ఈ క్రమంలో  చైనా దుందుడుకుతనాన్ని మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోడానికి మనసైన్యం సిద్ధంగా ఉందని వివరించారు. చైనా – భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకోవడం అత్యంత కీలకం. సమస్యల పరిష్కారం  కొలిక్కి రావడం లేదు. దశాబ్దాల నుంచి ఆ రావణకాష్టం కాలుతూనే వుంది. గతంలో యుద్ధాలు జరిగాయి, ఇరువర్గాలు ఎంతో నష్టపోయాయి కూడా. తొలియుద్ధంలో మనం ఎక్కువ నష్టపోయాం, మలి యుద్ధంలో మనదే పైచేయి అయ్యింది. సుమారు ఒక సంవత్సరం క్రితం, రెండు దేశాల సరిహద్దుల్లో మళ్ళీ పెద్దయుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో  ఉభయ దేశాలు పలు తఫాల్లో శాంతిచర్చలు జరిపాయి. ఆ నేపథ్యంలో  కొంత సాధారణ పరిస్థితి రావడంతో ఊపిరి పీల్చుకున్నాం. రెండు దేశాల ప్రగతి ప్రయాణాన్ని పరిశీలిస్తే, మనకంటే ఆ దేశమే అత్యంత బలమైనదిగా అవతరించింది. త్వరలో చైనా చేతిలో అమెరికా అగ్రాసనాధిపత్యానికి కాలం చెల్లేలా ఉందని పలు వార్తలు వస్తున్నాయి. రక్షణ రంగంలో విశిష్టమైన స్థానంలో ఉన్న రష్యా కూడా చైనాకు బాగా దగ్గరయ్యింది.

చైనా అధినేత షీపింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ

Also read: ‘మా’ ఎన్నికలలో బాహాబాహీ

బలోపేతం కావలసిన ఆవశ్యకత

అన్ని రంగాలతో పాటు రక్షణ వ్యవస్థలోనూ మనం ఇంకా గణనీయంగా అభివృద్ధి చెంది  స్వయంశక్తిమంతం కావాల్సిన అవసరం ఉంది. మనం ఎంత శాంతికాముకులమైనా, యుద్ధవీరులుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ రంగానికి ఇంకా బడ్జెట్ పెంచాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రస్తుత ప్రపంచ పరిణామాల దృష్ట్యా, రక్షణ రంగంపై ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అది మనకు భారమవుతోంది. తాజాగా అఫ్ఘానిస్థాన్ లో తాలిబాన్ రాజ్యం వచ్చేసింది. పాకిస్తాన్ – చైనా కలిసి మనల్ని మరింత ఇబ్బందులకు గురిచెయ్యాలని చూస్తున్నాయి. జమ్మూలో ఇటీవల జరిగిన డ్రోన్ల ఉదంతం కలవర పెట్టింది. కశ్మీర్ లోనూ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. చైనా -పాకిస్తాన్ రెండు దేశాలు మన భూభాగాలను ఆక్రమించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. తాలిబాన్ తో దౌత్య సంబంధాలను నెరపడానికి మనం సిద్ధంగా ఉన్నా, వారి నుంచి స్వాగతం లభిస్తున్నా, వారిని నమ్మడం తెలివైన పని కాదు. వారు అదనుచూసి దెబ్బవేసే రకం. రాజనీతిని పాటిస్తూనే  మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండాలి. చైనా విషయంలోనూ అంతే జాగురూకతతో నడవాలి. ఆ దేశం నుంచి దొంగదెబ్బలు తిన్న అనుభవం మనకు ఉండనే ఉంది. ఏది ఏమైనా అది మన సరిహద్దు దేశం. సరిహద్దు దేశాలతోటి, బలమైన రాజ్యాలతోటి మైత్రీబంధాలను నిలుపుకోవడమే చాణుక్యుడు సూచించిన రాజనీతి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకోడానికి రెండు దేశాల మధ్య ఇప్పటి వరకూ 12సార్లు ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిగాయి. త్వరలోనే 13వ సమావేశం జరుగనుందని సమాచారం. ఈ మధ్య కాలంలో లద్దాఖ్,ఉత్తర ఫ్రంట్ ప్రాంతాల్లో చైనా పెద్దఎత్తున సైన్యాన్ని మోహరించింది.

Also read: కాంగ్రెస్ లో కార్చిచ్చు

మోదీ అమెరికా పర్యటన

ఇటీవలే మన ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన చేసివచ్చారు. అటు అగ్రరాజ్య అధినేత జో బైడెన్ తోనూ,ఇటు ‘క్వాడ్’ సభ్యత్వ దేశాధినేతలతోనూ సమావేశమయ్యారు. చైనా దుందుడుకు చర్యలు, తాలిబాన్ వీరంగం, ఉగ్రవాద భవితవ్యం, రక్షణ, ఆర్ధిక, వాణిజ్య అంశాలు చర్చలోకి వచ్చాయి. క్వాడ్ రూపకల్పనను చైనా పూర్తిగా వ్యతిరేకిస్తోంది. తనని అణచివేయడానికి ఈ దేశాలన్నీ పన్నాగం పన్నుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికాకు భారత్ దగ్గరవ్వడం, క్వాడ్ లో భారత్ సభ్యురాలుగా ఉండడం చైనాకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. సామ్రాజ్యకాంక్షతో పాటు వీటన్నిటిని మనసులో పెట్టుకున్న చైనా మనల్ని ఇబ్బందులకు గురిచేసి కట్టడి చేయాలని చూస్తోంది. మన సరిహద్దు దేశాలైన నేపాల్, శ్రీలంకను ఇప్పటికే తన దొడ్లో కట్టేసుకున్నది. పాకిస్తాన్ ఎలాగూ తనతోనే నడుస్తోంది. బంగ్లాదేశ్ కు భారత్ తో పెద్దగా శతృత్వం లేకపోయినా, తనపైన ఆధారపడేట్లు ఆర్ధిక,వ్యాపార, వాణిజ్యపరమైన పాచికలు వేసి, చైనా మచ్చిక  చేసుకున్నది. భారత్ కంటే చైనాతోనే తనకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు బంగ్లాదేశ్ సైతం భావిస్తోంది. ఈ అంశాలన్నీ భారత్ కు హానిచేసేవే. చైనాతో మిత్రత్వం పెద్దగా పెరగకపోయినా, శతృత్వం పెరగకుండా చూసుకోవడం కీలకమైన అంశం.

Also read: మోదీ అమెరికా పర్యటనలో మోదం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles