భారత్ పై చైనా దూకుడును మళ్ళీ పెంచింది. హిందూ మహాసముద్రం సాక్షిగా కలకలం రేపే చర్యలను వేగవంతం చేస్తోంది. చిన్న చిన్న విరామాలు ఇస్తూ అలజడి సృష్టించడం, నిశ్శబ్దంగా తన వ్యూహాలను అమలుచేయడంలో ఆ దేశం ఆరితేరిపోయింది.
తన సరిహద్దు దేశాలను, భారత్ సరిహద్దు దేశాలను ఇప్పటికే తన గుప్పిట్లో పెట్టుకుంది. రుణాలు ఇచ్చి, తాయిలాలు సమర్పించి, ఆశలు రేపి శ్రీలంక, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, నేపాల్ వంటి దేశాలను తన దొడ్లో కట్టేసుకుంది. భారత్ ను కూడా నియంత్రించాలని శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది.
కానీ భారత్ ఏ దశలోనూ లొంగలేదు. దానితో ప్రతీకార చర్యల్లో వేగం పెంచుతోంది. కొన్ని మాసాల క్రితం రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యం అనే వాతావరణం నెలకొంది. శాంతి చర్చలు, ఒప్పందాలపై సమీక్షలు పేరుతో చైనా కాలయాపన చేసింది తప్ప ఒప్పందాలకు అనుగుణంగా ప్రవర్తించిన దాఖలాలు లేవు.
నిండా మునిగిన లంక
ఆ దేశాన్ని నమ్ముకొని శ్రీలంక పూర్తిగా మునిగిపోయింది. పాకిస్థాన్ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నేపాల్ కు కొంత బుధ్ధి వచ్చినట్లు కనిపిస్తోంది. ఐనప్పటికీ ఆ దేశాలకు చైనాతో ఉన్న రుణానుబంధం వల్ల పూర్తిగా తెంచుకొని బయటపడడం కష్టం.
హిందూ మహాసముద్రంపై భారత్ హక్కులను చైనా ప్రశ్నిస్తోంది. తనకు చాలా హక్కులు ఉన్నట్లుగా నోరేసుకొని పడిపోతూ సముద్రభాగాన్ని దురాక్రమించడానికి అన్ని యత్నాలు చేపట్టింది.
సముద్రంలో యుద్ధ నౌకలను దింపడం, అక్రమ రవాణా చేయడం, నిఘాను పెంచడం మొదలైన దుష్టకృత్యాలకు పాల్పడుతోంది. హిందూ సముద్రంపై పూర్తి పట్టును సాధించడమే లక్ష్యంగా కుట్రలు చేస్తోంది. కుయుక్తులు పన్నుతోంది. తన భూభాగాన ఆవలవైపు నౌకా స్థావరంలో సైనిక కార్యక్రమాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. హార్న్ అఫ్ ఆఫ్రికాలో 2016లో సుమారు 590 మిలియన్ డాలర్లతో ఒక నౌకా స్థావరాన్ని నిర్మించింది. ఇప్పుడు అదే ప్రాంతంలో యుజావో యుద్ధనౌకను మొహరించినట్లు స్పష్టమైన సమాచారం ఉన్నట్లు మన అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు ప్రసార మధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి.
ఈ నౌక అత్యంత సామర్ధ్యం కలిగివున్నది. జెట్ ఫైటర్స్, ట్యాంకులు, ట్రక్కులు, హోవర్ క్రాఫ్టలను మోయగలిగిన శక్తి ఈ నౌకకు వుంది. ఈ నౌక ద్వారా మన దేశానికి సంబంధించిన కీలకమైన ఉపగ్రహ సమాచారాన్ని సేకరించే ప్రమాదముంది.
రక్షణ పరంగా భారత్ చేపట్టే అనేక చర్యలకు దీని ద్వారా ముప్పు కలిగే ప్రమాదాలు పొంచి వున్నాయి. సరిహద్దుల్లో నిఘా, ఉగ్రవాదుల చొరబాట్ల గుర్తింపు మొదలైన చర్యలను ఈ నౌక ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పరిస్థితులు ఏర్పడతాయని రక్షణ రంగ నిపుణులు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్ననే శ్రీలంకలోని హంబన్ టొటా ఓడరేవులో యువాన్ వాంగ్ యుద్ధ నౌకను చైనా మోహరించింది.
ఇప్పుడు హార్న్ అఫ్ ఆఫ్రికాలో యుజావో యుద్ధ నౌకను నిలబెట్టింది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఇప్పుడే వచ్చే అవకాశం లేకపోయినా చైనా తనను తాను అన్నిరకాలుగా సిద్ధం చేసుకుంటోంది. భారత రణతంత్రాన్ని నిర్వీర్యం చేసే చర్యలను వేగిరపరుస్తోంది. దొంగదెబ్బ కొట్టడానికి సన్నాహాలు చేసుకుంటోంది. హిందూ మహా సముద్రంపై పట్టు సాధిస్తూ వాణిజ్య, ఆర్ధిక, రక్షణా ప్రయోజనాలను పెద్దఎత్తున సాధించాలని కుటిలనీతిని ప్రదర్శిస్తోంది. మనం ప్రతి క్షణం అత్యంత అప్రమత్తంగా ఉండడం, చైనాకు దీటుగా యుద్ధవ్యూహాలను అల్లుకోవడం అవశ్యం.
ఆయుధ ఉత్పత్తిలో స్వావలంబన
రక్షణ రంగాలకు సంబంధించిన ఆయుధాల కొనుగోళ్ళలో మనం ఇంకా రష్యా వంటి తరదేశాలపైనే ఎక్కువగా ఆధారపడ్డాం.
చైనా – రష్యా మధ్య మైత్రి ద్విగుణీకృతమై సాగుతున్న వేళ, మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. రక్షణ రంగ ఆయుధాల నిర్మాణంలో స్వయంసమృద్ధిని సాధించాలి. ఆర్ధికంగా బలపడాలి.
‘ఆత్మనిర్భర్ భారత్’ అన్ని రంగాల్లో వికసించినప్పుడే మనం శక్తిమంతులమవుతాం. అప్పటి వరకూ పెద్దదేశాల బెదిరింపులను ఎదుర్కోక తప్పదు.