Sunday, December 22, 2024

భారత్ పై చైనా గూఢచర్యం

  • గూఢచర్యం రాకెట్‌లో విస్తుగొలిపే నిజాలు
  • అమ్మాయిని ఎరవేసి రహస్యాలను రాబట్టిన చైనా

చైనా గూఢచర్యం రాకెట్‌పై కొనసాగుతున్న దర్యాప్తులో కొత్త విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భారత్ కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ రాజీవ్ శర్మ, చైనా మహిళ క్విన్ షి, ఆమె నేపాల్ సహచరుడు షేర్‌సింగ్ అలియాస్ రాజ్ బోహ్రాలపైన దర్యాప్తు చేస్తున్న అధికారులకు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. ప్రధానమంత్రి కార్యాలయంతోపాటు పలు కీలక మంత్రిత్వ శాఖలలో పనిచేస్తున్న ఉన్నతాధికారుల వివరాలను సేకరించేందుకు క్విన్‌ షిని ఆదేశించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.

జర్నలిస్ట్ రాజీవ్ శర్మకు నిధులను బదిలీ చేయడానికి షెల్ కంపెనీలను కూడా విదేశీ ఇంటెలిజెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. నేపాల్ సహచరుడు షేర్ సింగ్ అలియాస్ రాజ్ బొహ్రా. దర్యాప్తులో రాబట్టిన సమాచారం మేరకు పీఎంవో తో పాటు కేంద్ర ప్రభుత్వంలోని పలు కీలక మంత్రిత్వ శాఖలు, అందులోని ఉన్నతాధికారుల వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, బౌద్ధ మతగురువు దలైలామాకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా సేకరించినట్లు తెలుస్తోంది.

దలైలామా పై చైనా గురి

క్విన్ షి బౌద్ధ గురువు దలైలామా గురించిన సమాచారాన్ని కూడా సేకరించినట్లు తెలుస్తోంది. దలైలామా చికిత్స పొందుతున్నఆసుపత్రి వివరాలు, ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఏయే మందులు వాడుతున్నారనే విషయాలు సేకరించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.   మహాబోధి ఆలయంలోని ఒక సన్యాసి 2019  లో కోల్‌కతాలోని ఒక మహిళకు క్విన్‌ షిని పరిచయం చేశారు. ఆ మహిళ తన పత్రాలను ఆంగ్లంలో ఇస్తుందని … వాటిని క్విన్ షి మాండరిన్‌ భాషలోకి అనువదించి చైనా భద్రతా సంస్థలోని సీనియర్ అధికారులకు పంపుతారని తెలిపారు. క్విన్‌ షితో సన్నిహితంగా ఉన్న వారిని ప్రశ్నించడానికి దర్యాప్తు బృందాలను కోల్‌కతా తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపారు.

నిధుల మళ్లింపుకు డొల్ల కంపెనీలు

దర్యాప్తులో భాగంగా పలు ఆసక్తి కర విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ రాజీవ్ శర్మకు నిధులు అందించేందుకు గాను  డొల్ల కంపెనీలను స్థాపించినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు చైనా జాతీయులు జాంగ్ చాంగ్ అతని భార్య చాంగ్ లి లియా డొల్ల కంపెనీలను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.  చైనాలో ఉంటూ సూరజ్ ఉష పేర్లతో ఈ డొల్లకంపెనీలను నిర్వహిస్తున్నట్లు తేలింది. వీరి తరపున మహిపాల్ పూర్ లో క్విన్ షి, తన నేపాలీ సహచరుడు రాజ్ బోహ్రా ఎంజడ్ ఫార్మసీ డైరెక్టర్లుగా చలమణీ అవుతూ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతున్నట్లు  దర్యాప్తు అధికారులు వెల్లడించారు.

అమ్మాయిని ఎర వేసిన చైనా

భారత జర్నలిస్టు రాజీవ్ శర్మ క్విన్ షితో తరచూ ఫోన్ లో సంభాషిస్తూ ఉండేవాడని తేలింది. అంతేకాదు క్విన్ షి తో రాజీవ్ శర్మకు సన్నిహితం సంబంధాలు ఉన్నట్లు  దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. వసంత్ కుంజ్ లోని క్విన్ షి నివాసం నుంచి  పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, లాప్ టాప్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2010-2014 మధ్య కాలంలో జర్నలిస్ట్ రాజీవ్ శర్మ చైనా ప్రభుత్వ అనుంగు పత్రిక గ్లోబల్ టైమ్స్ కు వారాంతపు శీర్షికలు రాసేవారు. కున్ మింగ్ నగరానికి చెందిన చైనా ఇంటెలిజెన్స్ అధికారి మైఖేల్ తన లింక్ డిన్ అకౌంట్ ద్వారా రాజీవ్ శర్మను చైనా మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వాలని చైనా రావాలని  ఆహ్వానించినట్లు పోలీసులు తెలిపారు. చైనా వచ్చి వెళ్లేందుకు అవసరమైన నిధులను  మైఖేల్, ఆయన సహచరుడు జూలే సమకూర్చినట్లు తేలింది.

చైనా గుప్పిట్లో కీలక సమాచారం

2016-2018 మధ్య కాలంలో జర్నలిస్ట్ రాజీవ్ శర్మ మైఖేల్ తో పాటు అతని అసిస్టెంట్ జూ లకు ఇండియా, చైనా సంబంధాలపై కీలక సమాచారాన్ని రహస్యంగా చేరవేసినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. జర్నలిస్టుగా తనకున్న పలుకుబడిని ఉపయోగించి రాజీవ్ శర్మ  కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులనుంచి రక్షణ రంగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, భూటాన్ సిక్కిం, చైనా ట్రై జంక్షన్, డోక్లాంలో ఇండియా చైనా ల మధ్య ప్రతిష్టంభన, ఇండియా-మయన్మార్ మిలటరీ సహకారం, ఇండియా-చైనా సరిహద్దుకు సంబంధించిన రహస్యాలను చైనాకు అందించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. చైనా ఇంటెలిజెన్స్ అధికారి మైఖైల్, అతని అసిస్టెంట్ జూ లను లావోస్ మాల్దీవులలో రాజీవ్ శర్మ కలుసుకుని భారత్ రక్షణ రంగానికి చెందిన కీలక దస్త్రాలను అందించడమే కాకుండా వీరితో ఈ-మెయిల్ సోషల్ మీడియాలో రాజీవ్ శర్మ తరచూ సమాచారాన్ని అందిపుచ్చుకున్నట్లు అధికారులు ఆధారాలు సంపాదించారు.   ఇలాఉండగా, రాజీవ్ శర్మ బెయిల్ దరఖాస్తును ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది. క్విన్ షి, రాజ్‌ బోహ్రా ఇంకా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Paladugu Ramu
Paladugu Ramu
సీనియర్ సబ్ ఎడిటర్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles