Tuesday, January 21, 2025

కరోనా చైనా చేతబడేనా?

మొత్తం ప్రపంచ మానవాళిని కరోనా వైరస్ తో తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది చైనా… అని బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ కష్టాలు లోకాన్ని చుట్టుముట్టిన కొన్నిరోజులలోనే  ఈ మాటలు ప్రపంచమంతా వినిపించాయి. తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఆ వార్తలు చక్కర్లు కొట్టాయి. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ అంశం తెరపైకి వచ్చింది. చైనాలోని వూహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ ను చైనా శాస్త్రవేత్తలు సృష్టించారనే కథనం బ్రిటన్ కు చెందిన ‘డైలీ మెయిల్ ‘లో ప్రచురించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను మరికొన్ని రోజుల్లోనే ‘సైంటిఫిక్ జర్నల్ ‘లో ప్రచురిస్తారని సమాచారం.

Also read: కరోనా కష్టాల మధ్య కర్ణపేయమైన వార్తలు

ల్యాబ్ లో మానవసృష్టే

ఈ వైరస్  సృష్టి ల్యాబ్ లో జరిగినట్లు కాక, గబ్బిలాల ద్వారా సహజంగా ఉద్భవించినట్లు అనిపించేలా రివర్స్ ఇంజనీరింగ్ చేసినట్లుగా బ్రిటన్, నార్వే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వైరస్, చైనా ల్యాబ్ లోనే జరిగిన మానవ సృష్టిగా చెప్పడానికి తమ దగ్గర కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని బ్రిటిష్ ప్రొఫెసర్ అంగూన్ డాల్ గ్లిష్, నార్వే శాస్త్రవేత్త డాక్టర్ బిర్గర్ సొరెన్ సెన్ వారు రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. వీరిద్దరూ వ్యాక్సిన్ల రూపకల్పనలో సిద్ధహస్తులుగా ప్రసిద్ధి చెందినవారు. వీరి మాటలను తేలికగా కొట్టేయ్యకూడదని, వీరి నివేదికలను కీలకమైన సాక్ష్యాలుగా భావించాలని వివిధ దేశాలకు చెందిన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కచ్చితంగా ప్రపంచం పైన చైనా వదిలిన వైరస్ రూప మారణాయుధంగా పలు దేశాలు భావిస్తున్నాయి. ఇదే అంశాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతంలో పదే పదే ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు ఆ మాటలకు మళ్ళీ ప్రాముఖ్యత సంతరించుకుంటోంది.

Also read: కన్నీళ్ళు కాదు, కార్యాచరణ కావాలి!

గబ్బిలాలనుంచి సహజసిద్ధం కాదు

కరోనా వ్యాక్సిన్ ను రూపొందించే క్రమంలో, పరిశోధనలో, శాస్త్రవేత్తలకు ఈ అంశం అవగతమైంది. వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషించే దశలో, చైనా శాస్త్రవేత్తల కుట్ర బయటపడింది. ఇది గబ్బిలాల  నుంచి సహజసిద్ధంగా ఉద్భవించింది కాదని చెప్పడానికి, వీరికి దొరికిన ప్రత్యేకమైన వేలిముద్రలను ప్రధాన సాక్ష్యంగా భావిస్తున్నారు. ఈ వైరస్ కృత్రిమంగా తయారైందని చెప్పడానికి పలు అంశాలు బలాన్నిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ శాస్త్రవేత్తల తాజా నివేదికల నేపథ్యంలో, వూహన్ ల్యాబ్ పై అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. చైనా  సృష్టిగా భావిస్తున్న ఈ అంశంపై త్వరలో నివేదిక ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికా ఇంటలిజెన్స్ విభాగాన్ని ఆదేశించారు. చైనా శాస్త్రవేత్తల జీవాయుధాల విషయంలో వివిధ దేశాల మీడియా ఇప్పటికే పలు కథనాలను ప్రచురించింది, ప్రసారం చేసింది. ఇప్పుడు మరింతగా దృష్టి సారించింది.

Also read: కరోణా కట్టడికి విశ్వప్రయత్నం

వైరస్ రూపకల్పనలోనే శాస్త్రజ్ఞులకు సుస్తీ

వైరస్ బయటకు రాక ముందే, దీని రూపకల్పన దశలోనే చాలామంది శాస్త్రవేత్తలు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గతంలో ‘వాల్ స్ట్రీట్ జర్నల్ ‘ ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఇదే అంశంలో, దర్యాప్తులో భాగంగా వెళ్లిన బృందానికి చైనా అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదనే వార్తలు వచ్చాయి. కరోనా మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ ) బృందం జరిపిన అధ్యయన నివేదికలు అసలు నిజాలను వెల్లడించడలేదని పలువురు నిపుణులు వ్యాఖ్యానించారు. డబ్ల్యూ హెచ్ ఓ అధిపతి టెడ్రోస్ అథనామ్ గేబ్రియేసస్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనేకమార్లు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మద్దతుతోనే టెడ్రోస్  ఎంపిక జరిగిందని, అతను పూర్తిగా చైనా చేతిలో కీలుబొమ్మని, ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వివిధ దేశాల అధినేతలు మరోమారు గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, టెడ్రోస్ సారథ్యంలో చైనాకు వ్యతిరేకంగా డబ్ల్యూ హెచ్ ఓ నుంచి నివేదికలను ఆశించడం హాస్యాస్పదమని నిపుణులు భావిస్తున్నారు. ఈ యావత్తు సంక్షోభానికి చైనా జవాబుదారీగా ఉండాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం.

Also read: తాత్పర్యం లేని టీకాలు

చైనాలో పెరిగిన సామ్రాజ్య విస్తరణ కాంక్ష

అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు అంథోని పౌచీ కూడా సార్స్ కోవ్ -2 వైరస్, కరోనా వైరస్ సహజంగా వృద్ధి చెందినవి కాదనే అనుమానిస్తున్నారు. మొత్తంమీద, అమెరికాతో పాటు, పలు దేశాలు చైనానే అనుమానిస్తున్నాయి. భవిష్యత్తులో నిజానిజాలు తప్పకుండా బయటపడతాయని ఆశిద్దాం. దీనిని కేవలం అమెరికా-చైనా మధ్య పోరుగా భావించకూడదు. మితిమీరిన సామ్రాజ్య కాంక్షతో రగిలిపోతున్న చైనా ఇటువంటి మహాపాపానికి ఒడికట్టి ఉంటుందని విశ్వసించవచ్చు. చైనాకు అమెరికాతో పాటు భారత్ కూడా శత్రుదేశమే.తనకు అనుకూలంగా లేని, అడ్డువచ్చే దేశాలన్నింటినీ అణగదొక్కాలనే పథకాలను ఆ దేశం ఎప్పటి నుంచో పన్నుతోంది. మొదటి శత్రువు అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికా కాగా , రెండవ శత్రువు అభివృద్ధి చెందుతున్న భారతదేశం. ఈ రెండు దేశాలతో ఎప్పటికైనా ప్రమాదమనే భయాలు చైనాకు ఉన్నాయి.

Also read: అనివార్యమైన లాక్ డౌన్

అమెరికా, ఇండియాపైన అక్కసు

ఆర్ధికంగా అమెరికా, జనాభా, మార్కెట్ పరంగా భారత్ పెద్ద దేశాలు. ఈ రెండు దేశాల మధ్య బంధాలు ఈ మధ్య మరింతగా బలపడుతున్నాయి. ఈ రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వాములుగా మారిపోయాయనే ఆక్రోశం కూడా చైనాకు ఉంది. అందుకే, కరోనా వైరస్ వంటి జీవాయుధాలను సృష్టించాలని పథకం వేసిందని పరిశీలకులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో, ప్రపంచ దేశాలు చైనాను దోషిగానే భావిస్తున్నాయి. నేడు, చైనాను చాలా దేశాలు నమ్మడం లేదు. అదే సమయంలో భారత్ పట్ల ప్రత్యేకమైన అభిమానం, విశ్వాసాలను పెంచుకుంటున్నాయి. ఇదే అదనుగా, ప్రపంచ దేశాలను భారత్ మరింతగా తనవైపు తిప్పుకోవాలి. వాణిజ్య, వ్యాపార, పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు భారత్ అత్యంత అనుకూలమైన దేశమనే సంకేతాన్ని బలంగా పంపించాలి. కరోనా వైరస్ ను కట్టడి చేస్తూ, సమాంతరంగా, ఆకర్ష మంత్రాన్ని ఆచరిస్తే, త్వరలో చైనాను భారత్ అన్ని రకాలుగానూ మించిపోతుంది. చైనా చేసిన మహాపాపం రుజువైన నాడు, ఆ దేశం కోలుకోలేనంతగా భారీ మూల్యాన్ని చెల్లించక తప్పదని చెప్పవచ్చు.

Also read: అంతా ఆరంభశూరత్వమేనా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles