Thursday, November 21, 2024

చైనా బెదరదు, బెదిరించదు: సీ జిన్ పింగ్

  • సీపీసీ వందేళ్ళ పండుగ సందర్భంగా చారిత్రక ప్రసంగం
  • సీపీసీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే వైరస్ ను ఏరివేస్తాం
  • ఎవరో చెప్పే సుద్దులను చైనా వినదు
  • ఏకీకృత ఆర్థిక వ్యవస్థ నుంచి సోషలిస్టు మార్కెట్ ఎకానమీకి ఎదిగాం
  • తైవాన్ ను చైనాలో విలీనం చేసి తీరుతాం
  • హాంగ్ కాంగ్ లో పాలన చైనా నుంచీ

బీజింగ్ : చైనా విమోచన, నవచైనా నిర్మాణ యజ్ఞం ఆరంభించి గురువారంతో నూరేళ్ళు. 01 జులై 1921న విప్లవనాయకుడు మవో జెడాంగ్ షాంఘైలో స్థాపించిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా జనయాత్ర ప్రారంభించింది. వందేళ్ళ ఉత్సవాన్ని తియానన్మెన్ స్క్వేర్ లో గురువారంనాడు ఘనంగా జరుపుకున్నారు. దేశాధ్యక్షుడూ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ప్రధానకార్యదర్శి సీ జిన్ పింగ్ దేశవాసులను ఉద్దేశించి చారిత్రక ప్రసంగం చేశారు. చైనా వైపు తేరిపార చూడడానికి కూడా ఏ దేశాన్నీ అనుమతించేది లేదనీ, చైనాతో పెట్టుకోవడం అంటే 140 మంది ప్రజలతోనూ, బలమైన చైనీస్ లిబరేషన్ ఆర్మీతోనూ కలసి పటిష్టమైన ఉక్కు వంటి గ్రేట్ వాల్ ఆఫ్ చైనాతో తలబడటమేననీ గుర్తుపెట్టుకోవాలంటూ ఇతర దేశాలను, పరోక్షంగా అమెరికాను, హెచ్చరించారు. తైవాన్ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేననీ, ఆ ద్వీపాన్ని చైనాలో విలీనం చేయవలసిన చారిత్రక బాద్యత నిర్వర్తించవలసి ఉన్నదనీ చెప్పారు.

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా పోరాట సమయంలోనే నేషనలిస్ట్ పార్టీతో (కుమింగ్టాన్-కెఎంటీ)తో కలసి యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినా విభేదాలూ, ఘర్షణలూ యథావిధిగా సాగేవి. 1926-27లో చైనా కమ్యూనిస్టు శ్రేణులు నేషనలిస్ట్ ఆర్మీతో భుజం కలిపాయి. వార్ లార్డ్స్ చేతుల నుంచి చైనాకు విముక్తి కలిగించడం ఉమ్మడి ధ్యేయం. అయితే, రెండు శ్రేణుల మధ్యా విభేదాలు పెరిగాయి. నేషనలిస్ట్ సేనలు కమ్యూనిస్టులను ఊచకోత కోశాయి. 1931లో మంచూరియాపైన జాపనీయులు దాడి చేయడంతో రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్ ఓ సీ)కి ముప్పేట దాడి ఎదుర్కోవలసి వచ్చింది. ఒక వైపు కమ్యూనిస్టుల దండయాత్ర. మరోవైపు వార్ లార్డ్ ల సైన్యం. ఇంకోవైపు జాపనీస్ దాడి. నేషనలిస్ట్ లీడర్ చాంగై షేక్ ను 1937 కొందరు అపహరించి కమ్యూనిస్టులతో సహకరించేందుకు ఒప్పించారు. రెండో యునైటెడ్ ఫ్రంట్ ను నిర్మించారు. కానీ ఇది కూడా మొదటి యునైటెడ్ ఫ్రంట్ మాదిరే చీలిపోయింది. కమ్యూనిస్టు పార్టీ గ్రామీణ ప్రాంతాలలో బలం పుంజుకుంటుంటే నేషనలిస్టు ప్రభుత్వం కమ్యూనిస్టులను అణచివేయడంపైన దృష్టి పెట్టి జాపనీస్ దురాక్రమణదారులను ఉపేక్షించింది.

భూసంస్కరణల కారణంగా కమ్యూనిస్టులకు ఆదరణ

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చైనాలో కమ్యూనిస్టులకు ఆదరణ పెరిగింది. నేషనలిస్ట్ ప్రభుత్వం మానవహక్కులను కాలరాస్తూ కమ్యూనిస్టులను రాచిరంపాన పెట్టడాన్ని చైనాలో ఉన్న అమెరికా అధికారులు సైతం వ్యతిరేకించారు. వార్ లార్డ్ ల అవినీతి, నేషనలిస్ట్ ప్రభుత్వం అణచివేత కారణంగా ప్రభుత్వంపట్ల వ్యతరేకత ప్రబలింది. కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో భూసంస్కరణలను విజయవంతంగా అమలు చేసి గ్రామీణుల మన్ననలు పొందింది. జాపనీస్ దురాక్రమణదారులపైన పోరాడుతున్న కమ్యూనిస్టులకు ప్రజల మద్దతు లభించింది.

జాపనీస్ సైన్యం లొంగిపోవడంతో చైనాలో అంతర్యుద్ధం జోరందుకున్నది. చాంకైషేక్ కు అమెరికా మద్దతు దండిగా ఉంది. చాంగైషేక్ నాయకత్వంలోని నేషనలిస్టు పార్టీ పేరుకు ప్రజాస్వామ్య పక్షమైనప్పటికీ ఏకపక్ష ధోరణిలో వ్యవహరించేది. ప్రజాస్వామ్య పద్ధతులలో వ్యవహరించేది కాదు. నిరంకుశ పోకడలే ఎక్కువ. కానీ కమ్యూనిస్టుల కంటే, మావో కంటే నేషనలిస్ట్ పార్టీ, చాంగైషేక్ నయమనుకొని అమెరికా ఆయనను బలపరిచింది. నేషనలిస్ట్ సైన్యాలను వేల సంఖ్యలో అమెరికా హెలికాప్టర్లు జాపనీస్ అధీనంలో ఉన్న చైనీస్ ప్రాంతాలకు తరలించింది. జాపనీస్ చాంగైషేక్ కు లొంగిపోయినట్టు చేసింది. జాపనీస్ అధీనంలో ఉన్న ప్రాంతమంతా చాంగైషేక్ కు దక్కింది. ఈ లోగా మంచూరియాను సోవియెట్ యూనియన్ ఆక్రమించి ఆ భూభాగాన్ని చైనీస్ కమ్యూనిస్టు పార్టీకి అప్పగించి వైదొలిగింది.

మావో, చాంగైషేక్ మధ్య చర్చలూ, స్పర్థలూ

హింసాత్మకమైన పోరాటం ముగిసి కొంత ప్రాంతంలో సీపీసీ విజేతగా ప్రకటించుకుంది. యుద్ధానంతరం జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపైన 1945లో నేషనలిస్ట్ పార్టీ అధినేత చాంగైషేక్, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు మావో జెడాంగ్ చర్చలు ప్రారంభించారు. అవి సుదీర్ఘంగా సాగాయి. ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలనీ, చైనాలోని అన్ని రాజకీయ పార్టీలకూ సమానమైన గౌరవం ఉండాలనీ, అన్ని ప్రాంతాల ప్రజలను సమదృష్టితో చూడాలనీ అంగీకరించారు. అమెరికా జనరల్ జార్జి మార్షల్ మధ్యవర్తిగా ఉంటూ రెండు పక్షాల మధ్య సఖ్యత సాధించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. మరుసటి సంవత్సరం రెండు సైన్యాలు భీకరంగా అంతర్యుద్ధం సాగించాయి. కమ్యూనిస్టు యోధులకు నైతిక బలం ఉంది. మంచూరియాలో జాపనీస్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధ సంపత్తి ఉంది. 1947కల్లా కమ్యూనిస్టు యోధుల ఆధిక్యం స్పష్టంగా తెలిసిపోయింది. కమ్యూనిస్టు శ్రేణులు ముందుకు సాగాయి.  01 అక్టోబర్ 1949నాడు మావో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అవతరించినట్టు ప్రకటించడంతో నేషనల్ లిబరేషన్ ఆర్మీ జైత్రయాత్ర ముగిసింది. అప్పుడే ప్రగతి ప్రస్థానం మొదలయింది. అమెరికా దౌత్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంది.

చాంగైషేక్ తైవాన్ తో తలదాచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అవతరించినట్టు ప్రకటించిన వెంటనే చాంగైషేక్ తైవాన్ ద్వీపానికి పలాయనం చిత్తగించాడు.  ఎప్పటికైనా మెయిన్ లాండ్ చైనాను ఆక్రమించుకోవాలనే సంకల్పంతో తైవాన్ లో చాంగైషేక్ నేషనలిస్ట్ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. చైనాలో ఎవరు పరిపాలించాలో అంతర్యుద్ధంలో పాల్గొన్న సైనికులే నిర్ణయించాలంటూ అమెరికాలోని ట్ర్రూమన్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. ఆ విధానం విఫలమైంది. కమ్యూనిస్టు చైనాను గుర్తించకుండా తైవాన్ ను గుర్తించింది అమెరికా.

మావో సేటుంగ్ నెలకొల్పిన పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకీ, చాంగైషేక్ నాయకత్వంలోని రిపబ్లిక్ ఆఫ్ చైనాకీ మధ్య రెండు దశాబ్దాలపాటు సంబంధాలు ఉన్నాయి. 1970లో అమెరికా తైవాన్ ను మాత్రమే చైనా రిపబ్లిక్ గా గుర్తించింది. ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తైవాన్ ను మెయిన్ లాండ్ చైనాలో విలీనం చేసుకోవడం చైనా లక్ష్యమనీ, ఈ లక్ష్య సాధనకు చైనాలోని 140 కోట్ల మంది ప్రజలు అంకితభావంతో పోరాటం చేస్తారనీ చైనా అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రధాన కార్యదర్శి సీ జిన్ పింగ్ గురువారంనాడు ప్రకటించారు.

నూరేళ్ళ పండుగ

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాను నెలకొల్పి నూరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తియానన్మెన్ స్క్వేర్ లో పెద్ద సభను ఉద్దేశించి సీ గంటసేపు ప్రసంగించారు. పార్టీనీ, సమాజాన్ని పునరుజ్జీవింపజేయాలనీ, అదొక్కటే చైనాను విజయపథంలో నిలబెడుతుందనీ సీ ఉద్బోధించారు. తియానన్మెన్ స్క్వేర్ చరిత్రాత్మకమైనది. డెంగ్ నాయకత్వంలో ఆర్థిక సంస్కరణలను 1978లో ప్రారంభించి అద్భుతమైన ప్రగతి సాగిస్తున్న సందర్భంలో 1989లో చైనాలో  ప్రజాస్వామ్యం కోరుతూ యువజనుల ఉద్యమం ప్రారంభించారు. తియానన్మెన్ స్క్వేర్ లో వేలాదిమంది గుమికూడా ఉద్యమాన్ని నిరవధికంగా కొనసాగిస్తున్న సందర్భంలో చైనా సైన్యం ఉద్యమకారులపైన విరుచుకుపడింది. హూయావో అనే నాయకుడు చైనా కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ ప్రజాస్వామ్య ఉద్యమాన్ని సమర్థించాడు. పరిమితులు లేని లిబరల్ విధానాలు అనుసరించాలని వాదించారు. అది తప్పని పొలిట్ బ్యూరో తీర్మానించిన తర్వాత ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. పొలిట్ బ్యూరోలో కొనసాగారు. 15 ఏప్రియల్ 1989న హూయావో మరణించారు. ఈ మృతి పట్ల విషాదం దేశవ్యాప్తంగా వ్యక్తమైంది.  కమ్యూనిస్టు పార్టీలోని అసమ్మతివాదుల ప్రోత్సాహంతో విద్యార్థులు విజృంభించారు. స్టాట్యూ ఆఫ్ లబర్టీ ని పోలిన ప్రతిమలతో 50 రోజులపాటు ప్రదర్శనలు చేశారు. అప్పటికే చైనా తరహా సోషలిజం ఫలితాలు ప్రజలు అనుభవిస్తున్నారు. బూర్జువా లిబరలైజేషన్ కు వ్యతిరేకండా చైనా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం మొదలు పెట్టింది.  1987 అక్టోబర్ లో జరిగిన పార్టీ మహాసభలో ఆదేశిక సూత్రాలను కమ్యూనిస్టుపార్టీ, ప్రభుత్వం ప్రకటించాయి. సోషలిస్టు పథం వీడకూడదనీ, జనతా ప్రజాతంత్ర నియంతృత్వం కొనసాగాలనీ, మార్క్సిస్టు – లెనినిస్ట్- మావోయిస్టు సిద్ధాంతం రాజ్యం చేయాలనీ, పార్టీ నాయకత్వం ఆదేశాలు ప్రజలందరికీ శిరోధార్యమనీ ప్రకటించాయి. ఈ సూత్రాలను వ్యతిరేకిస్తూ, బూర్జువా లిబరలైజేషన్ విధానాలను బలపర్చుతూ కొంతమంది కమ్యూనిస్టు పార్టీ అసమ్మతి నాయకులూ, తిరుగుబాటుదారులూ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 3 జూన్ 1989న చైనా ప్రభుత్వం ఆదేశం మేరకు చైనా సైన్యం తియానన్మెన్ స్క్వేర్ లో ఉద్యమకారులపైన కాల్పులు జరిపింది. పదివేల మంది చనిపోయారంటూ వదంతులు వ్యాప్తిలో ఉన్నా అంతమందిని సైన్యం బలితీసుకోలేదని చైనా ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. చైనా ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం తియానన్మెన్ స్క్వేర్ లో రక్తపాతం జరగలేదనీ, ఇతర ప్రాంతాలలో జరిగిన ఘర్షణలలో మొత్తం మృతుల సంఖ్య మూడు వందలకు మించదనీ, ఇందులో మరణించిన సైనికులూ ఉన్నారనీ స్పష్టం చేసింది. అమెరికా గూఢచారి సంస్థ అంచనా 500 మంది చనిపోయి ఉంటారని. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్క వెయ్యి.

పెరిగిన ఆత్మవిశ్వాసం

మొత్తంమీద తియానన్మెన్ స్క్వేర్ లో ఉద్యమాన్ని అణచివేసిన తర్వాత మళ్ళీ అంత ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమం చైనాలో ఎగిసిపడలేదు. ఆర్థికరంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన చైనా అమెరికాకు సమానంగా అభివృద్ధి చెందింది. తనను మించి పోతుందేమోనని అమెరికా భయపడుతున్న పరిస్థితి.  ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారయింది. ఈ క్రమంలో పెరిగిన ఆత్మవిశ్వాసం, గుండెధైర్యం సీ జిన్ పింగ్ మాటల్లో ప్రతిధ్వనించాయి. చైనాను బెదిరించాలని అనుకునే విదేశాలు చైనాలో 140 కోట్ల మంది ప్రజలూ, బలమైన సైన్యంతో కూడిన, ఇనుముతో తయారైన గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను ఎదుర్కోవాలని అన్నారు. సీ జిన్ పింగ్ ప్రసంగం చేసిన దృశ్యంలో మావో జెడాంగ్ ఫొటో ప్రముఖంగా కనిపించింది. చైనాను బెదిరించే అవకాశం ప్రపంచంలో ఏ దేశానికీ ఇవ్వబోమని సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధ్యక్షుడు కూడా అయిన సీ జిన్ పింగ్ స్పష్టం చేశారు. టెలివిజన్ లో ప్రత్యక్ష ప్రసారమైన ఈ కార్యక్రమంలో 70 వేల మంది విద్యార్థులూ, కమ్యూనిస్టు పార్టీ సభ్యులూ పాల్గొన్నారు. అత్యాధునిక యుద్ధవిమానాలైన జే-20 జెట్ ఫైటర్స్ తో సహా 71 యుద్ధ విమానాలు సాహసోపేతమైన ఆకాశ విన్యాసాలు చేశాయి.

కిసింజర్ దౌత్యం

చైనా ఎదుగుదలను గమనించిన అమెరికా ప్రెసిడెంట్ నిక్సన్ బీజింగ్ కు కిసింజర్ ను దూతగా పంపించారు. తర్వాత నిక్సన్ స్వయంగా బీజింగ్ సందర్శించారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన చైనాతో ఆర్థిక, వ్యాపార లావాదేవీలు పెట్టుకోవాలనే సంకల్పం కిసింజర్ దౌత్యం వెనుక ఉన్న లక్ష్యాలలో ప్రధానమైనది. చైనా తో అమెరికా దౌత్య సంబంధాలు నెలకొల్పుకోవడానికి కిసింజర్ పర్యటన దోహదం చేసింది. కానీ ఆ తర్వాత చైనా కనులు మిరుమిట్లు గొలిపే విధంగా ఆర్థికాభివృద్ది సాధించింది. చుట్టుపక్కల దేశాలను నయానో,భయానో తన వెనుక నిలబెట్టుకున్నది. ఇండియాను ఎప్పుడు కావాలంటే అప్పుడు దెబ్బతీసే శక్తి తనకు ఉన్నదని నిరూపించుకున్నది.  తూర్పు ఐరోపాలో స్నేహితులు పెరిగారు. చైనా సముద్రంలో చైనా నావికాబలం ఉనికి పెరిగింది. చైనా అగ్రరాజ్యంగా వేగంగా  ఎదుగుతున్నదని గ్రహించిన అమెరికా చైనాతో శత్రుత్వంవైపే తిరిగి మొగ్గు చూపింది. భాతర్, జపాన్, ఆస్ట్రేలియాలతో కలసి ఒక ‘క్వాడ్’ కూటమిని తయారు చేసింది. భారతపైన చైనా కయ్యానికి కాలుదువ్వుతున్న కారణంగా భారత్ కు అండగా నిలబడేందుకు అమెరికా సిద్ధంగా ఉంది.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాను ప్రజల నుంచి దూరం చేయడానికి జరిగే ప్రయత్నాలన్నీ విఫలం కావడం ఖాయమని, సీపీసీని దెబ్బతీసే వైరస్ లను ఏరివేస్తామనీ పార్టీలో అసమ్మతివాదులను పరోక్షంగా సీ హెచ్చరించారు. హాంగ్ కాంగ్ లో చైనా ప్రభుత్వం అభీష్టం మేరకు బీజింగ్ నుంచే పరిపాలన సాగుతుందనీ, మనకు నీతులు చెప్పే అర్హత ఎవ్వరికీ లేదనీ స్పష్టం చేశారు. మైలురాళ్ళ వంటి ఆర్థిక సంస్కరణలతో కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీగా తీర్చిదిద్దామని చెప్పారు. దీనిని ఘనవిజయంగా సీ జిన్ పింగ్ అభివర్ణించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles