- భూటాన్ లోకి చొచ్చుకొచ్చిన చైనా
- డోక్లాం సమీపంలో గ్రామం ఏర్పాటు
- అభ్యంతరం వ్యక్తం చేసిన భారత్, భూటాన్ లు
విస్తరణ కాంక్షతో చైనా చెలరేగిపోతోంది. సరిహద్దు దేశాల్లో భూభాగాన్ని కబళిస్తూ ఆయా దేశాల సార్వభౌమత్వానికి సవాలు విసురుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ ను కవ్విస్తూ కయ్యానికి కాలుదువ్వుతోంది. సరిహద్దుల్లో నిత్యం సమస్యలు సృష్టిస్తున్న చైనా ఇపుడు మరో అడుగు ముందుకు వేసింది. తాజాగా భూటాన్ లోకి ప్రవేశించి కిలో మీటర్ల మేర భూభాగాన్ని ఆక్రమించింది. అక్కడ కొత్తగా ఓ గ్రామాన్ని కూడా నిర్మించింది.
2017లో భారత్, చైనా సైన్యాల మధ్య డోక్లాం సమీపంలో ఏర్పడిన ప్రతిష్టంభన ప్రాంతానికి ఈ గ్రామం 9 కిలో మీటర్ల దూరంలో ఉంది. కొత్తగా నిర్మించిన గ్రామాన్ని చైనా పంగ్డా అని పిలుస్తోంది. చైనా అధికార మీడియాకు చెందిన సీనియర్ పాత్రికేయుడు పెట్టిన చిత్రాలు, ట్వీట్ లతో ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియడంతో వాటిని తొలగించారు.
కవ్వింపులతో లబ్ధిపొందేందుకు చైనా కుట్ర
2017లో భూటాన్ కు చెందిన డోక్లాం ప్రాంతంలో 72 రోజుల పాటు భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. చైనా సైన్యం వెనక్కి తగ్గడంతో సమస్య సద్దుమణిగింది. అయితే ఇపుడు లద్దాఖ్ ప్రాంతంలో చైనా సైన్యం కవ్వింపులకు పాల్పడుతోంది. మరోవైపు భూటాన్ లో ఆక్రమణలకు పాల్పడుతోంది.
ఆందోళనలో భారత్, భూటాన్ లు
భారత్, భూటాన్ ల భూభాగాలను ఆక్రమించుకునేందుకు చైనా సలామీ స్లైసింగ్ కు పాల్పడుతోందనడానికి తాజా పరిణామం ఉదాహరణగా నిలుస్తోంది. భారత్, భూటాన్ భూభాగాలను ఆక్రమించేందుకుక చైనా వ్యూహరచన చేస్తోందన్న వాదనలకు ఇది మరింత బలం చేకూర్చుతోంది.
భారత్ చేతిలో భూటాన్ రక్షణ
చిన్న దేశం, పెద్దగా ఆయుధ సంపత్తి లేని భూటాన్ సార్వభౌమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత భారత్ పైనే ఉంది. ఈశాన్య రాష్ట్రాలను భారత్ తో కలిపే సిలిగురి కారిడార్ భూటాన్ కు అత్యంత సమీపంలో ఉంది. భూటాన్ రక్షణ బాధ్యతలు చూస్తున్న భారత్ కు చైనా దూకుడు పెను సవాలుగా మారనుంది.