లంగా లుంగీ పక్కపక్కన ఆరేస్తే
మధ్యలో బుల్లి నిక్కరో, గౌనో
పుట్టేసేది ఆరోజుల్లో.
పుట్టిన బిడ్డ అపురూపం
అందరి ముద్దు తనకే,
తమ్ముడో చెల్లో వచ్చేదాకా.
తగ్గిన ప్రాధాన్యంతో ఈర్ష్య
అలిగితే బుజ్జగింపు మాత్రమే
కాదని మొండికేస్తే లెంపకాయ.
బడికెళ్తే ఎన్నో ఆకర్షణలు
అందరిదగ్గర ఎవేవో ఎన్నెన్నో.
లాక్కుంటే పడుతుంది మొట్టికాయ
ఇంటా బయటా కావాలి సహనం
చెయ్యాల్సిందే సహజీవనం
అలాగే పెరుగుతాడు మనిషిగా
ఇది గతం.
ప్రస్తుతం బిడ్డ పుట్టడమే గొప్ప
తల్లిదండ్రులకు పరమానందం
బిడ్డ ఏడిస్తే తట్టుకోలేనంత ప్రేమ
మరో బిడ్డ వద్దనుకుంటారు
ఉన్నది పంచుకుని
తక్కువ కాకూడదనుకుంటారు
ప్రేమతో అతిగా తినిపిస్తారు.
ఆకాశం తుంచైనా తెచ్చేస్తారు
అడిగినవన్నీ ఇచ్చేస్తారు
బిడ్డ ఏంచేసినా ఊరుకుంటారు
పెద్దైతే నేర్చుకుంటాడంటారు.
బడిలో టీచర్లు గదమాయిస్తే
వాళ్ళపై భీకర యుద్దం చేస్తారు
అదుపులేని నడత సమర్ధిస్తారు.
ర్యాంకులు ట్యూషన్ల చదువుతో
నలుగురితో కలవడం,
ఆడుకోవడం మరచి పోతారు.
కొంగుచాటున ఉన్నంత కాలం
అడ్డు ఆపు లేకుండా గడచిపోతుంది.
ఉద్యోగానికో వ్యాపారానికో
తయారై బయటికొస్తే
సాటి మనుషులతో మెలగడం చేతకాక
అలవాటైన స్వార్ధం వదల్లేక
సామరస్యం కుదరక
అంతా గందరగోళం.
ఇంతలో పెళ్ళి జరిగి పోతుంది
కొత్త మనిషితో అన్నీ పంచుకోవాలి
ఇద్దరికీ అది అలవాటు లేని విషయం
ఎవరు మారాలి
ఎలా సర్దుకు పోవాలి
సర్దుకోలేకపొతే విడిపోవడమేనా
కాకపోతే మరోమార్గం
పెళ్ళిని పక్కన పెట్టి
ఆది మానవుల్లా, జంతువుల్లా
సహజీవనం చేయడమా?
పిల్లలకు కష్టం సుఖం తెలిసేలా
ఓపిగ్గా మంచి చెడ్డ చెబుతూ
అదుపులో ఉంచుతూ
ఎంతగా ప్రేమించినా
చెడుచేసినపుడు
తగిన విధంగా దండిస్తూ
సాటివారితో కలవడం
ఎదుటి మనిషి గురించి
ఆలోచించడం నేర్పిస్తే
అందరితో సఖ్యంగా
సంతోషంగా బతగ్గలుగుతారు.
అదీ సరైన పెంపకం.
Also read: చూపు
Also read: భావదాస్యం
Also read: స్వేచ్చాజీవి
Also read: నేనెవరు?
Also read: స్వచ్ఛభారత్