బాల్యం అపురూపం.
చిన్నారి చిరునవ్వులు
తల్లిదండ్రుల వెలుగు దివ్వెలు.
బుడిబుడి అడుగులు
కల్పిస్తాయి ప్రకంపనలు
ముద్దుముద్దు మాటలు
మురిపిస్తాయి మనందరినీ
అమాయకపు చూపులు
భగవంతుని ప్రతిరూపాలు.
ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో
ఊపిరి సలపని ప్రశ్నల పరంపర
అదే వికాసానికి మూలం
సమాధానాలు చెప్పే ఓపిక, శక్తి ఉన్న
తల్లిదండ్రలు, ఉపాధ్యాయులే
వారికి వెలుగు చూపే మార్గదర్శకులు.
ఆటపాటలతో మైమరచి
ఆనందంగా నర్తించాల్సిన బాల్యం
గాడిద బరువు మోస్తూ
హోంవర్కు, ట్యూషన్లనే చాకిరితో
వేసారి వడలి పోతూంది.
టీవీలు, మొబైళ్ళు, విడియో గేములు
ఉన్న కొద్దీ ఖాళీ సమయాన్ని ఆక్రమిస్తున్నాయి
ప్రశ్నలకు జవాబులు బట్టీ పట్టడం తప్ప
పుస్తకంలోని పాఠాన్ని చదివి అర్థం చేసుకోవడం లేదు.
మార్కులు, సర్టిఫికేట్లు వస్తున్నాయి
కాని ఆలోచన చేయగలిగిన శక్తిరావడం లేదు.
ఆలోచనను ప్రేరేపించేదే విద్య
ఆలోచనకు సమయమివ్వని విద్యా విధానం వ్యర్థం
విద్యలేనివాడు వింతపశువు అన్నారు
ఆలోచన చేయలేని విద్యార్థులు వింత జంతువులే
మరి ఈ విధానాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వాలను,
టీచర్లను ఏమనాలో.
మరో వైపు బాల్య, యవ్వనాలనే తేడా లేకుండా
ఎవ్వరినైనా తమ రాక్షష కామానికి
క్రూరత్వానికి బలి చేస్తున్న వ్యవస్థలో ఉన్నాం.
ఆ నరరూప పిశాచాలకు బలి కాకుండా
పిల్లలను పెద్దలను కాపాడే ప్రయత్నం చేద్దాం
వికసించి పరిమళాలు వెదజల్లాల్సిన పూలను
నిప్పుల గుండంలో పడకుండా చూద్దాం
ఇది మనమందరం కలిసికట్టుగానే కాక
విడిగా, స్వయంగా, స్వతహాగా చేయాల్సిన బాధ్యత
జాతి భవిష్యత్తును కాపాడే మన పవిత్ర కర్తవ్యం.
Also read: భూత దయ
Also read: “దీపావళి”
Also read: “సింధువు”
Also read: “హంతకులు”
Also read: నా మాట