బాల్యం అపురూపం
చిన్నారి చిరునవ్వులు
తల్లిదండ్రుల వెలుగుదివ్వెలు.
బుడిబుడి అడుగులు
కల్పిస్తాయి ప్రకంపనలు.
ముద్దుముద్దు మాటలు
మురిపిస్తాయి మనందరినీ.
అమాయకపు చూపులు
భగవంతుని ప్రతి రూపాలు.
ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో
ఊపిరి సలపని ప్రశ్నల పరంపర
అదే వికాసానికి మూలం
సమాధానాలు చెప్పే ఓపిక, శక్తి ఉన్న
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే
వారికి వెలుగు చూపే మార్గదర్శకులు.
ఆటపాటలతో మైమరచి
ఆనందంగా నర్తించాల్సిన బాల్యం
గాడిద బరువు మోస్తూ
హోంవర్కు, ట్యూషన్లనే చాకిరితో
వేసారి వడలి పోతూంది.
టీవీలు, మొబైళ్ళు, విడియో గేములు
ఉన్న కొద్ది ఖాళీ సమయాన్ని ఆక్రమిస్తున్నాయి
ప్రశ్నలకు జవాబులు బట్టీపట్టడం తప్ప
పుస్తకంలోని పాఠాన్ని చదివి అర్థం చేసుకోవడం లేదు.
మార్కులు, సర్టిపికేట్ల వస్తున్నాయి
కాని ఆలోచన చేయగలిగిన శక్తి రావడం లేదు.
ఆలోచనను ప్రేరేపించేదే విద్య.
ఆలోచనకు సమయమివ్వని విద్యావిధానం వ్యర్థం
విద్యలేనివాడు వింత పశువు అన్నారు
ఆలోచన చేయలేని విద్యార్థులు వింత జంతువులే
మరి ఈ విధానాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వాలను
టీచర్లను ఏమనాలో!
మరోవైపు బాల్య, యవ్వనాలనే తేడా లేకుండా
ఎవ్వరినైనా తమ రాక్షస కామానికి
క్రూరత్వానికి బలిచేస్తున్న వ్యవస్థలో ఉన్నాం
ఈ నరరూప పిశాచాలకు బలికాకుండా
పిల్లలను పెద్దలను కాపాడే ప్రయత్నం చేద్దాం
వికసించి పరిమళాలు వెదజల్లాల్సిన పూలను
నిప్పుల గుండంలో పడకుండా చూద్దాం
ఇది మనమందరం కలిసికట్టుగానే కాక
విడిగా, స్వయంగా, స్వతహాగా చేయాల్సిన బాధ్యత
జాతి భవిష్యత్తును కాపాడే మన పవిత్ర కర్తవ్యం.
Also read: న స్వాతంత్ర్య మర్హతి
Also read: పండగచేస్కో
Also read: ఓట్ల పండగ
Also read: గుడి – బడి
Also read: ప్రియురాలికి ప్రేమలేఖ