- అశ్విన్, విరాట్ మాస్టర్ క్లాస్ బ్యాటింగ్
- ఇంగ్లండ్ విజయలక్ష్యం 482 పరుగులు
- రెండోఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 53/3
ఐసీసీ టెస్ట్ లీగ్ లో భాగంగా భారత్-ఇంగ్లండ్ జట్ల నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని రెండోటెస్టు మూడోరోజుఆట ముగిసే సమయానికే విరాట్ సేన భారీ విజయానికి రంగం సిద్ధం చేసుకొంది.చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ నెగ్గలాంటే రెండో ఇన్నింగ్స్ లో 482 పరుగుల భారీలక్ష్యం సాధించాల్సిన ఇంగ్లండ్ 3 వికెట్లకు 53 పరుగుల స్కోరుతో ఎదురీదుతోంది.
అశ్విన్- విరాట్ షో:
అంతకుముందు రెండోరోజుఆట ముగిసే సమయానికి సాధించిన స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఒకదశలో 106 పరుగులకే ఆరు టాపార్డర్ వికెట్లు నష్టపోయింది. ఓపెనర్ రోహిత్ 26, వన్ డౌన్ పూజారా 7, పంత్ 8, వైస్ కెప్టెన్ రహానే 10, అక్షర్ 7 పరుగుల స్కోర్లకు ఒకరి వెనుక ఒకరుగా అవుటయ్యారు. దీంతో దారి తప్పిన జట్టును గాడిలో పెట్టాల్సిన బాధ్యత కెప్టెన్ కొహ్లీ, ఆల్ రౌండర్ అశ్విన్ లపైన పడింది.ఈ ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, అలవోకగా పరుగులు సాధిస్తూ 7వ వికెట్ కు 96 పరుగుల కీలక భాగస్వామ్యంతో ఊపిరి పోశారు.
Also Read: చెపాక్ లో ఇంగ్లండ్ కు అశ్విన్ డబుల్ షాక్
కొహ్లీ స్ట్రోక్ ఫుల్ హాఫ్ సెంచరీ:
తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా విఫలమైన కెప్టెన్ కొహ్లీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తనదైన శైలిలో అలవోకగా ఆడుతూ నాన్ స్ట్రయికర్ అశ్విన్ లో ఆత్మవిశ్వాసం పెంచాడు.కొహ్లీ 149 బాల్స్ ఎదుర్కొని 7 బౌండ్రీలతో 62 పరుగుల స్కోరుకు ఆఫ్ స్పిన్నర్ మోయిన్ అలీకి వికెట్ల ముందు దొరికిపోడంతో భారత్ 7వ వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత నుంచి అశ్విన్ బ్యాటింగ్ జోరు పెంచాడు. చూడముచ్చటైన షాట్లతో చెలరేగిపోయాడు. తన లోని బ్యాటింగ్ ప్రతిభను బయటపెట్టాడు. 148 బాల్స్ ఎదుర్కొని 14 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో టెస్టు క్రికెట్లో తన ఐదోశతకం సాధించాడు. హోంగ్రౌండ్ చెపాక్ వేదికగా అశ్విన్ కు ఇదే తొలిశతకం కావడం విశేషం. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా కూడా అశ్విన్ కు ఇదే తొలి మూడంకెల స్కోరు.అశ్విన్ ఆఖరి వికెట్ గా అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 85.5 ఓవర్లలో 286 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్లు లీచ్, మోయిన్ అలీ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
Also Read: భారత్ -ఇంగ్లండ్ బంధం ఏనాటిదో!
అక్షర్ దెబ్బ మీద దెబ్బ:
మ్యాచ్ నెగ్గాలంటే తన రెండో ఇన్నింగ్స్ లో 482 పరుగుల భారీలక్ష్యాన్ని సాధించాల్సిన ఇంగ్లండ్ మూడోరోజుఆట ముగిసే సమయానికి..19 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 53 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్లు డోమనిక్ సిబ్లే 3, రోరీ బర్న్స్ 25, నైట్ వాచ్ మన్ గా వచ్చిన జాక్ లీచ్ డకౌట్ గా వెనుదిరిగారు. వన్ డౌన్ లారెన్స్ 19, కెప్టెన్ రూట్ 2 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. చివరి రెండురోజుల ఆటలో ఇంగ్లండ్ మరో 429 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు మాత్రమే ఉన్నాయి. తొలిఇన్నింగ్స్ లో 134 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ నాలుగోరోజు పిచ్ పైన నాలుగో ఇన్నింగ్స్ లో భారత స్పిన్ ధాటికి ఎంతవరకూ నిలబడగలదన్నది అనుమానమే.