- చెన్నై క్లైమేట్ యాక్షన్ ప్లాన్ మార్గదర్శి
- అన్ని ప్రధాన నగరాలు అటువంటి ప్లాన్ సిద్ధం చేసుకోవాలి
వాన కురిస్తే వరదలొస్తే నగరాలు నరక కూపాలుగా మారిపోతాయి. హైదరాబాద్, ముంబయి, చెన్నై వంటి నగరాల్లో ఆ దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. పెరుగుతున్న నగరాలకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పన జరగకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం, ప్రకృతిని గౌరవించి నడక సాగించకపోవడం, అభివృద్ధి మాటున ఆర్ధిక స్వార్థ చింతన మొదలైనవి ఈ దుస్థితిని తెచ్చిపెట్టాయి. ప్రకృతి వైపరీత్యాలు చేసిన అలజడుల నుంచి గుణపాఠాలు నేర్చుకోక పోవడం, ఆచరణలో అనాసక్తి కొంపలు ముంచుతున్నాయి. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు చర్చించుకోవడం తప్ప ప్రకటనలో ప్రవర్తనలో ప్రభుత్వాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దాదాపు అన్ని ప్రభుత్వాలదీ అదే తీరు. ఈ పాపంలో ప్రభుత్వాలతో పాటు అందరికీ వాటా ఉంది. పారిశ్రామికవేత్తల నుంచి సామాన్య ప్రజల వరకూ అందరూ కలిసి సాగితేనే వైపరీత్యాల దుష్ప్రభావాల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. ఆ అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైంది.
Also read: పుతిన్ పైన మరోసారి హత్యాయత్నం
దారి చూపిన తమిళ తంబి
ఈ దిశగా తమిళనాడు ప్రభుత్వం తొలి అడుగు వేసింది. అందుకు ఆ ఏలికలను, పాలకులను తొలిగా అభినందిద్దాం. మిగిలిన రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడవడమే తక్షణ కర్తవ్యం. గత కన్నీటి చరిత్ర అటుంచగా ఈ ఏడేళ్ల కాలంలో చెన్నై ఎంత వణికిపోయిందో కళ్ళారా చూశాం. 2015, 2021లో వచ్చిన వరదలకు చెన్నపట్నం చెల్లాచెదురై పోయింది. జన జీవనం నెలల తరబడి స్థంభించిపోయింది. వీటన్నిటిని గమనించిన తమిళనాడు ప్రభుత్వం పరిష్కారాల దిశగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా చెన్నై నగరాన్ని దక్కించుకోనేందుకు లోతైన పరిశోధనలు చేయించింది. భవిష్యత్తులో ఎంతటి ముప్పులు రాబోతున్నాయో తెలుసుకుంది. నివారణలకు తరుణోపాయలు వెతుక్కుంటోంది. ఇప్పటికే కొన్ని కనిపెట్టింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంది. కృత్రిమ మేధను సద్వినియోగం చేసుకుంది. భవిష్యత్తులో రాబోయే ముప్పులను తప్పించుకొనే మార్గదర్శకాలతో కూడిన పకడ్బందీ నివేదికను రచించుకుంది. దాని పేరు సీ సీ ఏ పీ (చెన్నై క్లైమేట్ యాక్షన్ ప్లాన్). ప్రభుత్వానికి చేరిన ఈ నివేదికపై పాలకులు, అధికారులు కసరత్తులు ప్రారంభించారు. ప్రభుత్వం, కార్పొరేషన్ తో పాటు ప్రజలు అప్రమత్తం కావడం బహు కీలకమని నిపుణులు నివేదికలో వెల్లడించారు. నివేదికల అంచనాలు భయకంపితంగా ఉన్నాయి. రాబోయే వందేళ్లలో సగానికి పైగా నగరం వరదల ముంపునకు గురయ్యే శకునాలు కనిపిస్తున్నాయి. మురికివాడలు, మెట్రో స్టేషన్లు,బస్ స్టాండులు, రైల్వే స్టేషన్లు, సామాజిక భవనాలు, ప్రైవేట్ ఆస్తులు తీవ్ర ప్రభావానికి లోనయ్యే పరిస్థితులు దర్శనమవుతున్నాయి. పునరావాసం కోసం కట్టిన భవనాలు, గృహాలు కూడా కొట్టుకుపోనున్నాయి. నగరం దశలవారీగా జలమయమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వెరసి లక్షల జనాభా అష్టకష్టాలు పడనున్నారు.
Also read: త్రిభాషాసూత్రమే భారతీయులకు భూషణం
వాతావరణంలో మార్పుల వల్ల అనర్థాలు
వాతావరణంలో వచ్చే తీవ్రమైన మార్పుల వల్ల నగర పరిధిలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు తీక్షణంగా మారనున్నాయి. తాగునీటి కొరత ఇబ్బడిముబ్బడిగా పెరుగనుంది. అగ్నిప్రమాదాలు, అనారోగ్యం ప్రబలుతాయి. ఇదంతా ‘బ్రహ్మంగారి కాలజ్ఞానం’ లాగా కనిపించినా ఆధునిక శాస్త్రీయ నివేదికలు చెప్పే చేదునిజాలు. రోజురోజుకూ పెరుగుతున్న కర్బన ఉద్గారాలు వాతావరణం భస్మీపటలం కావడానికి ప్రధాన కారణాలు. ఇందులో ఎక్కువ శాతం భవనాలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలదే 70శాతం పైగా భాగస్వామ్యం.వీటిని ఎదుర్కొనే దిశగా దశల వారీ పరిష్కార పథకాలను తమిళనాడు ప్రభుత్వం నిర్మించుకుంటోంది. ముందుగా 2050 వరకూ ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకున్నారు. వీలైన ప్రతి చోటా సౌరవిద్యుత్తును పెంచుకోవడం, వేడిని తగ్గించుకొనేలా గృహనిర్మాణాల్లో మార్పులు తేవడం, పచ్చదనాన్ని పెంచుకోవడం, డాబాపై తోటలను విస్తరించడం, పర్యావరణ హితంగా లైటింగ్, కూలింగ్ పరికరాలను వాడుకోవడం, ఆ పరికరాలు తయారీపై రాయితీలు ప్రకటించడం మొదలైన వాటిపై దృష్టి సారించనున్నారు. ప్రజారవాణా వ్యవస్థలోనూ పెను మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. విద్యుత్ బస్సులను వందశాతం వాడడం అందులో మొదటిది. ఒకప్పటి వలె నడక,సైకిల్ పై 80శాతం ప్రజలు ఆధారపడాలని ప్రధానంగా సూచిస్తున్నారు.
Also read: గంగానది ప్రక్షాళన
విపత్తు నిర్వహణ సామర్థ్యం పెంచుకోవాలి
వరద ముప్పులను అధిగమించే దిశగా వనరుల్ని పెంచుకోవడం, విపత్తు నిర్వహణా సామర్ధ్యాన్ని మరిన్ని రెట్లు మెరుగుపరుచుకోవడం, లోతట్టు ప్రాంతాల వారిని ప్రత్యామ్నాయ ప్రాంతాలకు తరలించడం మొదలైన చర్యలు చేపట్టనున్నారు. 2050 నాటికి కర్బన ఉద్ఘారాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, నీటి సమతుల్యతను సాధించడం మరికొన్ని లక్ష్యాలుగా పెట్టుకున్నారు. వ్యర్ధాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించే కార్యాచరణ క్షేత్రస్థాయిలో నిర్మించడం వంటి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సముద్ర జలాలు మరింత ముందుకు వచ్చే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఇవన్నీ కేవలం చెన్నై నగరాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించినా, దేశంలోని అనేక నగరాలకు ఇవన్నీ వర్తిస్తాయి. తమిళనాడు ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకు సాగాల్సి ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం పెద్ద నగరాలు. విశాఖపట్నం సముద్రప్రాంతం. ఆంధ్రప్రదేశ్ లో సముద్ర తీర ప్రాంతం కూడా చాలా ఎక్కువ. నదీ పరీవాహక ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి. ముంబయి వంటి మహా నగర కార్పొరేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన మాజీ ఐ ఏ ఎస్ అధికారి, కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మన మధ్యనే ఉన్నారు. అనుభవజ్నులైన అధికారులు, నిపుణులు చాలా మంది ఉన్నారు. వారందరి మేధ, అనుభవాలు, ఆలోచనలను మన ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోవాలి. మన ప్రభుత్వాల ప్రతినిధులు చెన్నై వెళ్లి, వారి నివేదికలు, ప్రణాళికలను గమనించి, అధ్యయనం చెయ్యాలి. పర్యటనలకు పరిమితం కాకుండా ఆచరణలో పెట్టాలి. ఈ ప్రయాణంలో ప్రభుత్వాలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపార వర్గాలు, ప్రజలు కలిసి సాగాలి. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాలకు హృదయపూర్వకంగా సంపూర్ణ సహకారాన్ని అందించాలి. అప్పుడు మాత్రమే మనం గట్టెక్కగలుగుతాం.
Also read: నిద్ర ఒక యోగం, విజయానికి సోపానం