తిరుపతివేంకటకవులుగా పేరుమోసిన జంటలో ఒక కవి చెళ్ళపిళ్ల వేంకటశాస్త్రి. అంతేనా? కాదు.. కాదు.. మరి? ఆధునిక మహాకవులలో పరమ ఆకర్షణాస్వరూపులు. ఆయనేమీ ఆజానుబాహుడు కాడు, అరవింద దళాయతాక్షుడు కాడు. బక్కపలచని శరీరం, అతి సాధారణమైన ఎత్తు. చామనఛాయ రంగు. మరి! అంతటి ప్రభావశీలత ఎక్కడ దాగి ఉన్నదంటే? ఆయన పలుకులో ఉంది, పద్యపు నడకలో ఉంది, వచనంలో ఉంది, ప్రవచనంలో ఉంది. చమత్కార భాషణం, రసవత్ కవితా పోషణం, అసాధారణమైన ధారణాబలం, సాధారణ ప్రజలకూ అర్ధమయ్యేట్టు సాగే ప్రసంగవైనం ఆయనను అయస్కాంతశక్తిగా మార్చాయి. బందరులో ఉపాధ్యాయుడుగా ఉన్న సమయం ఆయనకు బాగా కలిసివచ్చిన కాలం. విశ్వనాథ,వేటూరి,పింగళి,కాటూరి,త్రిపురనేని వంటి మహాప్రతిభావంతులైన విద్యార్థులు ఆయనకు ప్రత్యక్ష శిష్యులయ్యారు. ఆయన దగ్గర వాళ్లు ఏమి నేర్చుకున్నారో ఏమో తెలియదు కానీ, కవిత్వం వైపు ప్రభావం పొందారు.వీరందరి సారస్వత మార్గానికి అపురూపమైన ప్రేరణ కలిగించినవారు నిస్సందేహంగా చెళ్ళపిళ్ళవారే. వారి ‘గురు’త్వాకర్షణశక్తి
అంత గొప్పది. ఈ విషయాన్ని విశ్వనాథ పద్యరూపంలో బొమ్మకట్టించారు.
“వానలో తడియనివారు,
మద్ గురు వధాన మరందధారలో గడుగనివారు లేరు”
అంటూ ఒకచోట, “తన యెదయెల్ల మెత్తన…” అంటూ మరోచోట విశ్వనాథ తన ఎదపరచి గురువును తలుచుకున్నారు. ఇక పింగళికాటూరివారు చాటుకున్న గురుభక్తి అంతాఇంతా కాదు. తిరుపతి వేంకటకవులుగా ఇరువురు కవులు తెలుగునాట సందడి చేసినా,కీర్తికాంత చెళ్ళపిళ్ళకే ఒకింత ఎక్కువ దగ్గరైంది. పాపం! దివాకర్ల తిరుపతి శాస్త్రి 48ఏళ్లకే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోవడం పెద్ద విషాదం. చెళ్ళపిళ్ళవారు 80ఏళ్ళ వయస్సువరకూ జీవించి ప్రభవించారు. తన శిష్యులు,విద్యార్థులు లబ్ధప్రతిష్ఠులై, ‘గురు’కీర్తిని మరింత ఇనుమడింపజేశారు.
పాండవోద్యోగ విజయాలు
తిరుపతి కవిజంట కలివిడిగానూ,విడివిడిగానూ చేసిన అవధాన,ఆశు కవితా సభలు, రచనలు ఇద్దరికీ పెద్దపేరునే తెచ్చిపెట్టాయి. ప్రధానంగా, “పాండవ ఉద్యోగ విజయాలు” ఈ జంట కీర్తిని మిన్నంటేలా చేశాయి. మహానటులెందరో తమ నట, గాయక ప్రతిభతో ఈ నాటకాలను అద్భుతంగా పోషించడం వల్ల, పసిడికి తావి అబ్బినట్లు,వారి కవిత్వ ప్రతిభకు, ప్రచండ ప్రభ తోడయ్యింది.చెళ్ళపిళ్ళవారిలో ఎంతటి కవిత్వ ప్రతిభ,పాండితీ ప్రకర్ష ఉన్నాయో, అంతకు మించిన లౌక్యప్రతిభ, ఆయనను అగ్రేసర కీర్తికాయుడిగా ఆధునిక ఆంధ్రసాహిత్య జగతిలో నిలబెట్టింది. ఏ గతి రచియించినా, ఏ కీర్తి కుసుమించినా, అది ‘తిరుపతివేంకటీయమే’. ఎందరిరెందరితో తగాదాలు వచ్చినా, కొప్పరపు సోదరకవులతో సల్పిన వివాదాలు మిన్నుముట్టాయి. నాటి పత్రికలకు ప్రధాన శీర్షికలై సంచలన శిఖరాలయ్యాయి.ఈ ప్రభావంతో ఎందరో పద్యకర్తలు తెలుగునాట పుట్టుకొచ్చారు.వీరి వివాదాల వల్ల తెలుగుభాషకు ఎంతో మేలు జరిగింది.ఈ ఇద్దరి పక్షాన నిలిచిన వారు కుప్పలుతెప్పలుగా పద్యాలను పండించారు. నువ్వా? నేనా? అంటూ ఈ రెండు జంటలు యుద్ధాలు చేసుకుంటూవుంటే, పద్యసరస్వతి లోలోపల మురిసివిరిసింది. ఏతావాతా తేలిందేంటంటే, పద్యం రాజ్యమేలింది.
———-
———-
ఎక్కడ చూచినన్ కవులె…
వేలూరి శివరామశాస్త్రి అన్నట్లు ఎక్కడ చూచినన్ కవులు, ఎక్కడ చూడ శతావధానులు, ఎక్కడ చూడ ప్రబంధకర్తలు, మరెక్కడ చూచినా జంట కవులు పుట్టుకొచ్చి తెలుగుతల్లి కడుపు పండించారు. తిరుపతివేంకటకవులు, కొప్పరపు కవుల తొలి పరిచయం పరమాద్భుతంగా ప్రారంభమైంది.కానుకొలను త్రివిక్రమరావు (కుర్తాళ పీఠాధిపతి శ్రీ విమలానంద భారతీస్వామి), వేటూరి ప్రభాకరశాస్త్రి ఈ పరిచయ పుణ్యం మూట గట్టుకున్నారు. ఒకరినొకరు చూసుకోకుండానే,ఉత్తరప్రత్యుత్తరాలలో ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. ఇరువురు ఒకరిపైనొకరు పద్య నవరత్నములు పంచుకున్నారు. తిరుపతి వేంకటకవుల పేరుతో కొప్పరపు కవులపై నవరత్నాలు రాసింది చెళ్ళపిళ్ళవారే. గుంటూరులో తిరుపతి వేంకటకవుల శతావధానం సందర్బంగా, కుర్చీ విషయంలో మొదలైన చర్చ,రచ్చ చాలా దూరం తీసుకెళ్లాయి.నాటి ఆంధ్రదేశంలోని కవులు,పండితులు, పద్యాభిమానులు,పత్రికలు రెండు ‘శాఖ’లుగా విడిపొయ్యారు.కొన్నాళ్లపాటు సాగిన ఈ వివాదాలు, లక్కవరం జమిందార్రాజా మంత్రిప్రగడ భుజంగరావు బహుద్దర్ హితోపదేశంతో సద్దుమణిగాయి. తెరవెనుక ఎలా ఉన్నా,కొప్పరపు కవులు ఎదురైతే, చెళ్ళపిళ్ళవారు చాలా ఆప్యాయంగా పలకరించేవారు. ఒక తల్లి పిల్లల వలె హృదయాలు పంచుకునేవారు.
కొప్పరపు సుతులపై పుత్రవాత్సల్యం
కొప్పరపు సోదర కవులు మరణించిన తర్వాత, సోదర కవుల కుమారులైన సీతారామప్రసాదరాయకవి, దుర్గామల్లికార్జునరాయకవి (కుమార సోదర కవులు) పట్ల చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి పుత్రవాత్సల్యంతో ఉండేవారు. ఈ కుమారుల అనేక అవధాన సభలకు అధ్యక్షుడుగా ఉండి,ఆశీస్సులు అందించి, సభలు నడిపించారు. కుమారకవులపై చెళ్ళపిళ్ళ చెప్పిన ప్రశంసాపూర్వక పద్యరూప ఆశీస్సులు చెళ్ళపిళ్ళ రచనల్లోనూ, డాక్టర్ ప్రసాదరాయ కులపతి రాసిన “కవితా మహేంద్రజాలం” పుస్తకంలోనూ ముద్రితమై భద్రంగా ఉన్నాయి.తిరుపతి వేంకటకవులు, కొప్పరపు సోదరకవులు అనేక సారస్వత సత్కార సభల్లో కలుసుకున్నారు. కలిసి భోజనాలు చేశారు.ముఖ్యంగా ఇక్కడ కూడా తిరుపతికవులలో చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి మాత్రమే ముందుండేవారు. ఒకసారి, గుంటూరులో ఈ రెండు జంటలు మందపాటి వారింట్లో భోజనానికి వెళ్లారు. ఎదురెదురు వరుసలో కూర్చున్నారు. కొప్పరపు సోదరులలో పెద్దవారైన వేంకటసుబ్బరాయకవి చాలా అందగాడు. పచ్చని శరీరం, పెద్ద కళ్ళు,కోటేరువంటి ముక్కుతో చాలా ఆకర్షణగా ఉండేవారు.పైన పట్టు ఉత్తరీయం కప్పుకొని భోజనం చేస్తున్న వేంకటసుబ్బరాయకవిని చూచి, చెళ్ళపిళ్ళ ఇలా పద్యం అందుకున్నారు.
పద్యం:- పట్టు రుమాల్ భుజమ్ముపయి బాలరవిప్రభలీన పంక్తికిన్// రాట్టయి యగ్రపీఠమున రాజిలె కొప్రపు సుబ్బరావు,బల్ // దట్టులు మందపాటి కులధన్యుడు లోనగువార లాతనిం// పట్టి క్రమమ్ముగా నతనిపంక్తి నెసంగి రభంగుర స్థితిన్ – ఈ ఇరుజంటల మధ్య ఇలాంటి సరదా సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి.
శాంతిప్రబోధము
దివాకర్ల తిరుపతిశాస్త్రి మరణించినప్పుడు “శాంతి ప్రబోధము” పేరుతో “తిర్పతీ”అనే మకుటంతో కొప్పరపు కవులు ఎన్నో పద్యాలు చెప్పారు. అందులో మకుటాయమానమైన పద్యంఒకదానిని తలుచుకుందాం.
పద్యం: – కరము ప్రపంచ నాటకము కల్పనచేసి సమర్హ పాత్రలన్// వరువడి దిద్ది,చిత్రముల నంతములున్ జరిపించి, పిమ్మటన్ // తెరలను డింపి,స్వప్నపు విధిం తలపింపగ జేయుదేవ,మా // తిరుపతిశాస్త్రి యాత్మకు తితిక్షయు శాంతి యనుగ్రహింపవే- ఇది,తిరుపతిశాస్త్రి అకాల మరణానికి అమితంగా ఆవేదన చెంది, కొప్పరపు కవులు చెప్పిన పద్యం. “మా తిరుపతి శాస్త్రి” అన్నారు. అదీ! వారి ఆత్మీయ అనురాగబంధం. ఏదో కాలవశాత్తున,రెండు జంటల మధ్య కొంతకాలం వివాదం నడచినా,అదంతా సరస్వతీదేవి ఆడిన సారస్వత వినోదక్రీడగానే భావించాలి. “తిరుపతి వేంకటకవులు,కొప్పరపు కవులు అభేద్య కవితా స్వరూపలు, ఆ వీరకవులు ఆంధ్ర సాహితీ క్షేత్రం లో చేసిన స్వైరవిహారం ఒక సువర్ణాధ్యాయం”, అని వేటూరి సుందరరామ్మూర్తి అనిన మాటలు కమనీయ రమణీయ స్మరణీయాలు.
(ఈరోజు, ఆగస్టు 8, చెళ్ళపిళ్ళవారి జయంతి)