ఆయనది వైద్యవృత్తి. మనుషులకి వచ్చే రోగాలతో పాటు సమాజంలోని జాఢ్యాలకి కూడా వైద్యం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజాతంత్ర ఉద్యమాలకి చిరపరిచితులు. వామపక్ష అభ్యుదయ సంఘాలకి పెద్దదిక్కు. ఎక్కడే మంచి పని జరిగినా నిస్సంకోచంగా చేయూత నిచ్చే గొప్ప అండ. ఆయనే డాక్టర్ చెలికాని స్టాలిన్. డాక్టర్ చెలికాని రామారావు , కమలమ్మల దార్శనిక వారసత్వానికి ఒక చింతనాత్మక ప్రతీక. సమాజం కోసం ఎందుకు ఆలోచించాలనే వారికి తిరుగులేని సమాధానం ఆయన జీవితం. జూన్ 25, 1944 లో జన్మించిన స్టాలిన్ గారి చదువు కాకినాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాలలో సాగింది. విద్యార్థి దశలోనే ప్రగతిశీల భావాలతో మమేకం ఐన ఆయన తెలుగునాట అనేకమంది ప్రజా నాయకులతో సన్నిహితంగా మెలిగారు. కంభంపాటి సత్యనారాయణ మొదలుకొని ఏటుకూరి బలరామమూర్తి గారి వరకూ, వావిలాల గోపాలకృష్ణయ్య నుండి పుచ్చలపల్లి సుందరయ్య గారి వరకూ, చండ్ర రాజేశ్వరరావు గారితో ప్రారంభిస్తే, మోహిత్సేన్ గారి దాకా మనం కదిలించాలే కానీ ఎన్నో అపురూప అనుభవాలు ఆయనవి. మానవ జీవన విధానాన్ని సుసంపన్నం చేసే మార్గంగా మార్క్సిజాన్ని ఆచరణాత్మకం చేయాలనేదే ఆయన నిరంతర తపన!
Also read: మహోన్నత నవబౌద్ధుడు భదంత డాక్టర్ ఆనంద కౌసల్యాయన్
ఆ రచనాత్మక ప్రేరణతోనే ఎన్నో బృహత్తర కార్యక్రమాలు రూపొందించారు. ఎందరో రచయితలు, బుద్ధిజీవుల రచనలు బయటకు రావడానికి సహకరించారు. ఎన్నో విలువైన ప్రజాహిత సిద్ధాంత గ్రంథాల్ని ప్రచురించారు. అనేక సభలు, సదస్సులు, సమావేశాలు, చర్చా వేదికలు నిర్వహించారు. మౌన సంస్కృతికి భిన్నంగా ప్రజల్లో ప్రశ్నించే చైతన్యం పెంపొందిం చడానికి సైన్స్ ప్రచారాన్ని ఉద్యమంగా చేపట్టారు. కార్మికసంఘాలకి ప్రాతినిధ్యం వహించారు. శ్రమదోపిడీ నుండి పరాయీకరణ వరకూ, క్రోనీ కేప్టిలిజం మొదలు కల్చరల్ హెజిమొనీ దాకా అనేక అంశాల్లో వినూత్న కార్యక్రమాలు రూపొందించారు. ఇవన్నీ కాకుండా, కీ. శే. డాక్టర్ చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ స్థాపించారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ప్రతీ ఏటా ప్రముఖుల్ని ఆహ్వానించీ, సమకాలీన సామాజిక రాజకీయ సాంస్కృతిక సమస్యల పై బహిరంగ సభలు ఏర్పాటు చేసి, విశిష్ట ఉపన్యాసాలను ఇప్పిస్తున్నారు. వీటన్నింటి వెనుకా బలమైన ఆయన భావజాల ప్రభావం ఉంది. నిర్మాణా త్మకమైన తాత్విక దృక్పథం ఉంది. అణగారిన వర్గాల ప్రజలకి న్యాయం జరగాలనే ప్రగాఢమైన ఆకాంక్ష ఉంది. అన్నింటికంటే ప్రధానంగా
స్వతంత్రాలోచనా శైలి ఉంది!
Also read: నిఖార్సయిన విశ్వకళాతపస్వి నికోలస్ రోరిక్
అదే ఆయన వ్యక్తిత్వానికి విస్తృతి చేకూర్చింది. విశాల దృష్టిని కల్పించింది. సాహిత్య అధ్యయనం, కళాత్మక అభినివేశం, క్రీడల పట్ల ఆసక్తి, సైద్ధాంతిక నిబద్ధత వంటివి తాత్కాలిక రాజకీయ నిర్మాణచట్రంలో నుంచి ఒక రకంగా ఆయన్ని కాపాడాయి. దాంతో అన్ని ప్రగతిశీల శక్తుల్లోని మంచినీ స్వేచ్ఛగా స్వాగతించేందుకు అవకాశం వచ్చింది. పార్టీలకి అతీతంగా హృదయంతో స్పందించి నిర్ణయాలు తీసుకోగల పంథా అలవడింది. ఎవరొప్పుకున్నా లేకున్నా డా. స్టాలిన్ గారికి ప్రజా క్షేత్రంలో విలక్షణ స్థానం కల్పించింది ఈ లక్షణమే. సాయంకోరి వచ్చే వారికి భరోసాను ప్రసాదించే ఆ వైఖరే బహుశా ఆయన బలమూ,బలహీనత. ఒక దశలో కావాలను కుంటే ఏ వామపక్ష పార్టీలోకూడా అత్యున్నత పదివికి తీసిపోని విధంగా దక్కే స్థానాన్ని కూడా కాదనుకుని దాదాపు ఆరు దశాబ్దాలుగా సాధారణ కార్యకర్తలతోనే తన పయనాన్ని నిర్ణయించుకోవడం కార్యాచరణ పట్ల ఆయనకి ఉన్న స్పష్టతకి చిహ్నం!
Also read: చరిత్ర కలిగిన చరిత్రకారుడు!
అందుకనే స్మారక కమిటీ ఆద్వర్యంలో ప్రచురించే ఏ గ్రంథమైనా ఉచితంగానే అందించాలనే నియమాన్ని అనుసరించి, డా.చెలికాని రామారావు గారి పార్లమెంటు ప్రసంగాల్ని తెలుగు చేయించి గ్రంథంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు, స్మారక కమిటీ ద్వారా నిర్వహిస్తోన్న సమావేశ ఉపన్యాసాల్ని వ్యాసాల రూపంలో ముద్రించారు. ప్రముఖ ప్రగతిశీల రచయిత రావు కృష్ణారావు గారు రచించిన సైద్ధాంతిక గ్రంథాలెన్నింటినో ప్రచురించారు. ఆకార్ పటేల్ ‘హిందూ రాష్ట్ర’ ఉద్గ్రంథాన్ని తెలుగులోకి ప్రత్యేకంగా అనువదింపజేసి విస్తృతంగా పంపిణీ చేసారు. ప్రముఖ అమెరికన్ రచయిత జాక్ లండన్ కథలు ప్రచురించారు. డాక్టర్ కవితా రావు గారి “లేడీ డాక్టర్స్” పుస్తకాన్ని అద్భుతంగా తెలుగు వారికి పరిచయం చేశారు . మద్యపాన నిషేధం కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసమూ ఎన్నో సదస్సులు ఏర్పాటు చేశారు. పిల్లల్ని అలరించే మ్యాజిక్ షో లు, ఉపాధ్యాయులు,మహిళలు, యువత కోసం ఆకర్షణీయమైన కార్యశాలల్ని నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారిగా సమాంతర సినిమాలతో, ప్రత్యామ్నాయ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఇలా చెప్పుకుంటే పోతే అనేకం ఉన్నాయి!
Also read: భారతీయ విశిష్ట తాత్విక నిలయం చార్వాకాశ్రమం!
చార్వాకలోకాయతాలు మొదలు నాస్తిక హేతువాద ఉద్యమాల వరకూ, మహాత్మాగాంధీ నుండి మహాకవి శ్రీశ్రీ వరకూ, బౌద్ధం నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వరకూ విభిన్న మార్గాల పట్ల ఆయనకి ఉన్న అవగాహనే ఇంత వైవిధ్యమైన కార్యాచరణకి బలాన్ని చేకూర్చింది. భారతీయ తాత్విక చింతనను విమర్శనా త్మకంగా పరిశీలించే తర్కబద్ద ధోరణే, మార్క్సిజాన్ని కేవలం ఆర్ధికతకే పరిమితం చేయకుండా, సాంస్కృతిక వికాసోద్యమానికి దోహదం కాగలిగే దృక్పథాన్ని ఆయనకి కలిగించింది. సకల మానవ జీవనరంగాల్ని సుసంపన్నం చేసే మహోన్నతమైన సిద్ధాంతాన్ని మూస పద్దతిలో కాకుండా విశాల కోణంతో చూసినప్పుడు మాత్రమే అసలైన సారం అర్ధమవుతుందనేది ఆయన వాదంలోని బలం. అందుకే, రాజకీయ వివాదాల కంటే కూడా సైద్ధాంతిక సంవాదాలే ఎక్కువ జరగాలంటారు. నిజమైన సామాజిక పురోగతి నిష్కామ కర్మ వంటిదనీ, దాంతోనే పురోగతి సాధ్యమని ఆయన భావిస్తారు. భావితరాలకు పటిష్ఠమైన భావజాల నిబద్దతను అందించడమే భావోద్యమాల లక్ష్యమంటూ ముక్కుసూటిగా చెబుతారు!
ఎల్లప్పుడూ శ్రమజీవుల పక్షం వహిస్తూ కుల, మత, వర్గ, లింగ అసమానతల్ని నిరసిస్తూ ఎలుగెత్తే గొంతులకి భరోసా కల్పిస్తారు. ఈ వయసులో కూడా అలుపెరుగకుండా సుదూర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకి హాజరవుతారు. రేపటి తరాలైన పిల్లలు, యువతరం, మహిళల్లో కొరవడుతున్న సామాజిక స్పృహ పట్ల శ్రద్ధ పెట్టాలంటారు. చాప కింద నీరులా వ్యాపిస్తున్న పేద, ధనిక వ్యత్యాసాలు, మతోన్మాద అసహన రూపాలు, పౌర సమాజంలో నెలకొన్న నిర్లిప్తత గురించి అవకాశమున్న ప్రతీ వేదిక మీద ఆందోళన వ్యక్తం చేస్తారు.
ప్రతీ ప్రత్యామ్నాయ ప్రయత్నాన్నీ తనవంతు ప్రోత్సహిస్తారు. అలా ఆశనే ఆయుధంగా చేసుకుని ముందుకు సాగిపోయే ఆయన ఎందరికో ఉత్తేజాన్నిచ్చే ఒక ప్రవాహ స్పూర్తి. మరి అలాంటి ప్రజాతంత్ర స్రవంతుల్ని కాపాడుకోవడం, కొనసాగించడం ఈ రోజు ప్రగతిశీల ప్రజా ఉద్యమ అభ్యుదయ శ్రేణులు అన్నింటి కర్తవ్యం. అందులో భాగమే ఆయన విశిష్ట వ్యక్తిత్వం గురించిన ఈ చిరు పరిచయం!
(చిన్నపాటి కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేశాను కానీ భార్య కీ. శే. రేణుక గారి జ్ఞాపకాలు చుట్టుముడతాయని, ఫ్యూడల్ సంస్కృతనీ, ఆయన ససేమిరా అనడంతో అది విరమించుకుని మాటన్నా పడడానికి సిద్దపడి ఇదిలా రాసాను. వివిధ కార్యక్ర మాలలో వామపక్ష మేధావులు కోబాడ్ గాంధీ, ఇంకా ప్రముఖ గాంధేయవాది కోడూరు శ్రీరామమూర్తి, తదితరులతో ఆయన చిత్రాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిన్న రైటప్.)
Also read: ‘చౌరీచౌరా’ ఘటనకి వందేళ్ళ సందర్భం!
– గౌరవ్
(డా. చెలికాని స్టాలిన్ 80వ పుట్టినరోజు)