సీనియర్ బఘేల్, జూనియర్ బఘేల్
- బ్రాహ్మణులపైన అనుచిత వ్యాఖ్య
- సర్వబ్రాహ్మణ సమాజం ఫిర్యాదు
- 15 రోజుల రిమాండ్ కు పంపిన రాయపూర్ కోర్టు
- చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదన్న ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్
బ్రాహ్మణ సామాజికవర్గంపైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు రాయపూర్ న్యాయస్థానం చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తండ్రి నంద్ కుమార్ బఘేల్ ను 15 రోజుల రిమాండ్ క పంపింది. ఆయనను జైలుకు తరలించారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సమయంలో ముఖ్యమంత్రి భూపేష్ చట్టం ముందు అందరూ సమానమేనంటూ వ్యాఖ్యానించారు. ‘‘నా ప్రభుత్వంలో ఎవ్వరూ చట్టానికి అతీతులు కారు. ముఖ్యమంత్రి తండ్రి అయినప్పటికీ, ఆయనకు 86 ఏళ్ళ వయస్సు ఉన్నప్పటికీ ఏమీ చేయజాలము. ఒక ముఖ్యమంత్రిగా వివిధ సామాజికవర్గాల మధ్య సామరస్యాన్ని కాపాడవలసిన బాధ్యత నాపైన ఉన్నది. ఏదైనా సామాజికవర్గానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడి ఉంటే అందుకు నేను చింతిస్తున్నాను. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం,’’అని ఆదివారంనాడు భూపేష్ బఘేల్ విలేఖరులతో చెప్పారు.
‘‘నాకూ, నా తండ్రికీ మధ్య సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని అందరికీ తెలుసు. మా రాజకీయపుటాలోచనలూ, విశ్వాసాలు వేర్వేరు. కుమారుడిగా తండ్రి అంటే గౌరవం ఉంది. శాంతిభద్రతలకు భంగం కలిగించే అటువంటి వ్యాఖ్యలు చేసిన ఆయనను నేను క్షమించజాలను,’’ అని స్పష్టం చేశారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అన్ని మతాలనూ, అన్నికులాలనూ, వారి విశ్వాసాలనూ గౌరవిస్తుందని అన్నారు.
ఇటీవల ఉత్తరప్రదేశ్ లో పర్యటించిన బఘేల్ తండ్రి బ్రాహ్మణులను సాంఘిక బహిష్కరణకు గురిచేయాలంటూ వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులను విదేశీయులుగా అభివర్ణించారు. గ్రామాలలోకి వారిని రానివ్వవద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘బ్రాహ్మణులను గంగా నది నుంచి ఓల్గా నదికి పంపుతాం. వారు విదేశీయులు. మనల్ని అంటరానివారుగా చూస్తారు. మన హక్కులన్నింటినీ గుంజుకుంటున్నారు. గ్రామాలలో బ్రాహ్మణులను రానివ్వరాదని గ్రామీణులను నేను కోరుతున్నాను,’’ అంటూ నందకుమార్ బఘేల్ చెప్పారు.
సర్వబ్రాహ్మిణ్ సమాజ్ సీనియర్ బఘేల్ పైన ఫిర్యాదు చేయగా రాయపూర్ లో కేసు పెట్టారు. సామాజికవర్గాల మద్య చిచ్చు పెడుతున్నారన్నది ఆయనపైన చేసిన అభియోగాలలో ఒకటి. కోర్టు రిమాండ్ కు పంపింది.