- 33పడిలో భారత క్రికెట్ నయావాల్
- జిడ్డాటలో మేటి…డిఫెన్స్ లో ఘనాపాటి
- చతేశ్వర్ పూజారాకు శుభాకాంక్షల వెల్లువ
భారత క్రికెట్ నయావాల్ ఛతేశ్వర్ పూజారా 33వ పడిలో ప్రవేశించాడు. భారత క్రికెట్ గోడ రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ తర్వాత నుంచి జాతీయజట్టుకు వన్ డౌన్ లో అసమాన సేవలు అందిస్తూ వస్తున్న 32 సంవత్సరాల వయసుకే 81 టెస్టు మ్యాచ్ లు ఆడి వారేవ్వా అనిపించుకొన్నాడు. జూనియర్ స్థాయి నుంచే భారత క్రికెటర్లలో మేటిగా గుర్తింపు సంపాదించిన పూజారా …దేశవాళీ క్రికెట్లో సౌరాష్ట్ర్ర కు ప్రాతినిథ్యం వహిస్తూ…అలవోకగా డబుల్, ట్రిపుల్ సెంచరీలు బాదేస్తూ జాతీయ సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు.
2010 లో టెస్ట్ అరంగేట్రం….
2010 క్రికెట్ సీజన్లో ఆస్ట్ర్రేలియా ప్రత్యర్థిగా బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా తన తొలిటెస్ట్ మ్యాచ్ ఆడిన పూజారా ఆ తర్వాత మరివెనుదిరిగి చూసింది లేదు.2010 ఆస్ట్ర్రేలియా సిరీస్ నుంచి 2021 ఆస్ట్ర్రేలియా సిరీస్ వరకూ గత దశాబ్దకాలంలో మొత్తం 81 టెస్టులు ఆడి 18 శతకాలతో సహా 6 వేల 111 పరుగులు సాధించాడు.అంతేకాదు…భారత టెస్టు చరిత్రలోనే మరే ఆటగాడు ఎదుర్కోని విధంగా 13వేల 572 బంతులు ఎదుర్కొని తనకుతానే సాటిగా నిలిచాడు.
ఇది చదవండి: భారత్ తో సిరీస్ బంపర్ హిట్
అంకితభావానికి మరో పేరు…
జట్టు ప్రయోజనాల కోసమే ఎక్కడలేని ఓర్పు, నేర్పులతో బ్యాటింగ్ చేయడంలో పూజారాకు పూజారా మాత్రమే సాటి. ఓపెనర్లలో ఏ ఒక్కరు అవుటైనా…జట్టు భారాన్ని భుజంపైనే వేసుకొని ఆడటానికి ఆత్మవిశ్వాసంతో క్రీజులోకి అడుగుపెట్టే పూజారాకు ఎనలేని ఏకాగ్రతతో …గంటల తరబడి క్రీజునే అంటిపెట్టుకొని ఆడగల నేర్పు సొంతం. స్వింగైనా…పేసైనా…గిరికీలు తిరుగుతూ వచ్చే స్పిన్ బంతులైనా సరే…కచ్చితమైన డిఫెన్స్ తో ఎదుర్కొనడం పూజారాకు బ్యాటింగ్ తోనే అబ్బిన విద్య. ప్రత్యర్థి బౌలర్లతో పాటు…కెప్టెన్, ఫీల్డర్ల సహనానికి పరీక్ష పెట్టడంలో పూజారానే ముందుగా చెప్పుకోవాలి.
ద్రావిడ్ కు సరైనా వారసుడు:
వన్ డౌన్ స్థానంలో భారత క్రికెట్ కు అసమానసేవలు అందించిన రాహుల్ ద్రావిడ్ రిటైర్మెంట్ ప్రకటించడంతోనే…నేనున్నానంటూ చతేశ్వర్ పూజారా ముందుకు వచ్చాడు.నిలకడగా రాణిస్తూ జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకొంటూ వచ్చాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్ స్వింగ్ పిచ్ లపైన…సౌతాఫ్రికా, ఆస్ట్ర్రేలియా ఫాస్ట్ బౌన్సీ పిచ్ లపైనా…భారత ఉపఖండ దేశాల స్పిన్ పిచ్ లపైనా ఒకేరీతిలో రాణించడంలో తన సత్తా ఏపాటిదో పూజారా చాటుకొన్నాడు. భారతజట్టుకు వన్ డౌన్ ఆటగాడంటే …కేవలం తానుమాత్రమేనని, ద్రావిడ్ కు అసలు సిసలు వారసుడుతానేనని తన ఆటతీరుతో నిరూపించుకొన్నాడు.
జిడ్డాటలో రికార్డుల మోత…
ఐదురోజుల సాంప్రదాయ టెస్టు క్రికెట్లో పరుగులు సాధించడం ఎంత ప్రధానమో…వన్ డౌన్ స్థానంలోవచ్చిన ఆటగాడు క్రీజునే అంటిపెట్టుకు పోయి గంటలతరబడి ఆడటమూ అంతే ప్రధానం.
ఇది చదవండి: ఇదీ.. సిరాజ్ సక్సెస్ సీక్రెట్
ఒకే ఇన్నింగ్స్ – 525 బంతులు:
క్రీజులో గంటల తరబడి పాతుకుపోయి బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లను నిలువరించడంలో పూజారా ప్రతిభకారణంగానే ఇటీవలి ఆస్ట్రేలియా సిరీస్ లో భారత్ అపూర్వ విజయం సాధించ గలిగింది. ఆసీస్ గడ్డపై కంగారూ పేస్ బ్యాటరీని ఎదుర్కొని.. వరుసగా రెండో టెస్ట్ సిరీస్‌లో సైతం వెయ్యికిపైగా బంతులు పూజారా ఎదుర్కొన్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన రికార్డు సైతం పుజారా పేరిటే ఉంది. 2017లో రాంచీలో జరిగిన టెస్ట్‌లో పుజారా ఒక ఇన్నింగ్స్‌లో ఏకంగా 525 బంతులు ఆడి 202 పరుగులు చేశాడు. ఇప్పటి వరకూ ఒక భారత ఆటగాడు.. ఒక ఇన్నింగ్స్‌లో ఆడిన అత్యధిక బంతుల రికార్డు ఇదే కావడం విశేషం.
ఐదు రోజులూ బ్యాటింగ్ ఘనత:
ఒక టెస్ట్ మ్యాచ్ లో ఓ ఆటగాడికి మొత్తం ఐదు రోజులూ బ్యాటింగ్ చేసే అవకాశం చాలా అరుదుగా దక్కుతుంది. ఈ ఘనతను పుజారా సొంతం చేసుకొన్నాడు.2017లో శ్రీలంకతో కోల్‌కతాలో జరిగిన టెస్ట్‌లో పుజారా ఈ రికార్డును తన పేరిట లిఖించుకొన్నాడు. అతని కంటే ముందే కేవలం ఇద్దరే భారత బ్యాట్స్‌మెన్ ఈ గౌరవాన్ని సంపాదించారు. వారిలో హైదరాబాదీ గ్రేట్ ఎంఎల్ జయసింహ, భారత ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాత్రమే ఈ ఘనత సాధించారు.
ఇది చదవండి: భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్
సఫారీ గడ్డపై రెండో ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు:
సౌతాఫ్రికా గడ్డపై రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ బ్యాట్స్‌మన్ పుజారానే. కపిల్ దేవ్ పేరిట 129 పరుగులతో ఉన్న రికార్డును చెరిపేస్తూ.. పుజారా 153 పరుగులు చేశాడు.టెస్టుల్లో భారత్ తరఫున వేగంగా 1000 పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో ఉన్నాడు పుజారా. 2013లో హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పుజారా ఈ ఘనత సాధించాడు. 18వ ఇన్నింగ్స్‌లోనే పుజారా ఈ మైలురాయిని చేరాడు. ఈ రికార్డు ఇప్పటికీ వినోద్ కాంబ్లి (14 ఇన్నింగ్స్) పేరిటే ఉంది.పూజారా మరో 19 టెస్టు మ్యాచ్ లు ఆడితే వందటెస్టుల క్లబ్ లో చోటు సంపాదించగలుగుతాడు.టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ గా లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకొన్నపూజారా 33వ జన్మదినం రోజున బీసీసీఐతో పాటు కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఇతర సహఆటగాళ్లు,మాజీ క్రికెటర్లు శుభాకాంక్షల వర్షం కురిపించారు.
ఇది చదవండి: భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర
టెస్టు క్రికెట్ కు, వన్ డౌన్ స్థానానికి ఎనలేని గౌరవం తెచ్చిన భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారాకు దేశంలోని కోట్లాదిమంది అభిమానులతో పాటు…సకలం.. సైతం జన్మదినశుభాకాంక్షలు చెబుతోంది.