Thursday, November 21, 2024

ఏల ప్రేమింతును

నండూరి సుబ్బారావు ఎంకిపాటల పుస్తకం ముఖచిత్రం

సౌరభము లేల జిమ్ము పుష్పవ్రజంబు

చంద్రికల నేల వెదజల్లు చందమామ

ఏల సలిలంబు పాడు గాడ్పేల విసరు

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

మావిగున్న కొమ్మను మధుమాసవేళ

పల్లవము మెక్కి కోయిల పాడుటేల

పరుల దనియించుటకొ, తన బాగు కొరకొ

గాన మొనరింపక బ్రతుకు గడువబోకొ

దేవులపల్లి కృష్ణశాస్త్రి

Poetically yours, Devulapalli Krishna Sastry
దేవులపల్లి కృష్ణశాస్త్రి

పుప్పొడి దుమారం సువాసన లెందుకు విరజిమ్ముతుంది? చందమామ వెన్నెలల నెందుకు వెదజల్లుతాడు? ప్రవహించే సెలయేరెందుకు పాడుతుంది? మలయ సమీరమెందుకు చల్లగా వీస్తుంది? నా హృదయం నిన్నెందుకు ప్రేమిస్తుంది?

మామిడి కోమ్మపై మధుమాస వేళ, చిగురాకులు మెక్కి ఎందుకోసం కోయిల పాడుతుంది? పరులను తృప్తి పరచడం కోసమా? తన బాగు కోసమా? గానమొనరింపక బ్రతుకు గడువబోకనా?

Also read: భ గ్న మా లి క

ప్రకృతి నైజం, సృష్టిధర్మం

స్త్రీపురుషులు ప్రేమతో పడడం, ప్రకృతి నైజమూ, సృష్టిధర్మమూ. “ఏల ప్రేమింతును?” అన్న నేటి కవితలో కవికుమారుని హృదయంలో అప్పుడప్పుడే ప్రేమ మొగ్గ తొడగడాన్ని పఠిత  దర్శిస్తాడు.

Romantic Era: Percy Bysshe Shelley
ఇంగ్లీషు రొమాంటిక్ కవి షెల్లీ

నేటి కృష్ణశాస్త్రి కవితకు, మహాకవి షెల్లీ  “లవ్స్ ఫిలాసఫీ” అనే క్రింది ఖండికకు  మధ్యగల గాఢమైన సారూప్యాలు గమనింపగలరు.

“The fountains mingle with the river

And the rivers with the ocean

The winds of heaven mix with a sweet emotion

Nothing in the world is single

All things by law divine

In one spirit meet and mingle

Why not I with thine?”

“See the mountains kiss high heaven

And the waves clasp one another

No sister flower would be forgiven

If it disdained its brother

And the sunlight clasps the earth

And the moonbeams kiss the sea

What is all this sweet work worth

If thou kiss not me?

పాపం కృష్ణశాస్త్రి గారి కవికుమారుని ప్రేమ అనేక మలుపులు తిరిగి, వియోగక్లేశాన్నే మిగిల్చింది.

నా మరణశయ్య పరచుకొన్నాను నేనె

నేనె నాకు వీడ్కోల్పు విన్పించినాను”

ఆ వీడ్కొల్పు లోనూ ఒక ఆక్రోశం:

ఎవరోహో ఈ నిశీధినెగసి నీడవోలె నిలిచి పిలుతురెవరో

మూగకనులు మోయలేని చూపులతో

ఇపుడా నను పలకరింతురు?”

చివరకు ఊర్వశినే తన ఊహాప్రేయసిగా చిత్రించుకొని సాంత్వన గడిస్తాడు కవి:

నీవు తొలిప్రొద్దు నునుమంచు తీవెసొనవు

నీవు వర్షాశరత్తుల నిబిడ సంగ

మమున పొడమిన సంధ్యా కుమారి నీవు

తిమిర నిశ్వాసములు మాసి కుములు శర్వ

రీ వియోగ కపోల పాళికవు నిజము

నే గళమ్మార పాడుకొనిన అఖాత

శోక గీతాల యందీవె శోకగీతివి

ఊర్వశీ!ప్రేయసీ!”

Also read: నా గు ల చ వి తి

గాఢంగగా ప్రేమించుకొనే అవివాహితులే గాక, పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమికులై జీవించే దంపతులు కూడా వియోగదుఃఖాన్ని ప్రగాఢంగా అనుభవిస్తారు. ఆదికవి రామాయణగాథయే ఇందుకు సాక్ష్యం  సీతాదేవిని పరిత్యజించిన పిమ్మట రామచంద్రుడు అనుభవించిన వియోగ దుఃఖాన్ని అబ్బూరి వారు ఎత్తిచూపిన వైనం చూడండి.

లక్ష్మణా చూడుము ఏలకి లతలు పూసె

వాసనలు నిండుకొను మాధవీ కుసుమములు

సీత కన్నులు వోలె విచ్చె నొక కొంత

వేదనలు విచ్చె నా మనోవీధి యందు”

లేత సూర్యుని చిరుత చీలికల బోలు

పంకజమ్ముల వెలుగు పంపాసరస్సు

మోహన వసంతు కేళీప్రమోదమునకు

పూల నవ్వులు కురియు భూపుత్రి నేడు”

అడవి ఱానేలలందు నెన్నడును తిరిగి

అలసి యెఱగని అతి వినయార్ద్ర చిత్త

జానకి యొనర్చు సాంగత్య సౌఖ్యమునకు

తలపు లేకాగ్రతావృత్తి కలసిపోయె”

బహుభార్యాత్వం కలిగిన దశరథ మహారాజు కాలంలో ఏకపత్నీ వ్రతుడైన ఆదర్శజీవి శ్రీరాముడు. భారతదేశంలో, బహుభార్యాత్వం, సతీసహ గమనం వంటి  తరతరాల దురాచారాలను  అంతం చేయడానికి రెండు శతాబ్దాల క్రిందట రాజారామ్ మోహన్ రాయ్ నడుం బిగించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. తత్ఫలితంగా సతీసహగమనానికి పంతొమ్మిదవ శతాబ్దం లోనే వలస రాజ్యం స్వస్తి పలికింది.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – పరీక్షిత్తు దుర్మరణం చెందడానికి నేపధ్యం

ప్రజాస్వామ్య సమాజపు మూలసూత్రాలు

ఇరవయ్యవ శతాబ్దపు యాభయ్యవ దశకంలో స్వతంత్ర భారతదేశం, హిందూ కోడ్ చట్టం సవరించి బహుభార్యాత్వాన్ని నిషేధించింది. పాశ్చాత్య దేశాల్లో ఎప్పటినుండో బహుభార్యాత్వంపై నిషేధం వున్నది.

“స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము” ఆధునిక ప్రజాస్వామ్య సమాజపు మూలసూత్రాలు. 1949 నవంబరులో స్వతంత్ర భారత దేశపు రాజ్యాంగం ముసాయిదా బిల్లును రాజ్యాంగసభలో ప్రవేశపెడుతూ, డా. అంబేడ్కర్ ఇట్లా అన్నారు:”వ్యక్తి స్వాతంత్ర్యం లేనిది,  సామాజిక సమానత్వం లేదు. వ్యక్తుల మధ్య సమానత్వం లేనిది, సామాజికంగా సౌభ్రాతృత్వం లేదు. వ్యక్తుల మధ్య సౌభ్రాతృత్వం లేనిది సమాజంలో స్వేచ్ఛ, సమానత్వమూ, రెండూ శూన్యమే.”

ఈ మూడు సూత్రాలు సమాజంలోని వ్యక్తులకే గాక, ప్రతి కుటుంబానికీ మూల స్తంభాలైన దంపతులకు కూడా వర్తిస్తాయి. పరస్పర ప్రేమ, పరస్పర స్వేచ్ఛ, పరస్పర సమానత్వం లేని దాంపత్యజీవనం మృతప్రాయమైనది.

Also read: మహాభారతం – ఆదిపర్వం: ద్వితీయాశ్వాసం – వాసుకి తల్లి శాపానికి వెరచుట

“నిన్ను ప్రేమింతును” అని ప్రకటించే ప్రతి ప్రేమికునిలోనూ ఈ నిబద్ధత పొడసూపనిదే, నిజమైన ప్రేమ పుష్పింపదు. బహుభార్యాత్వాన్ని కోరే మానవుని బుద్ధి చంచలమైనది. ఏకపత్నీవ్రతం  బుద్ధి చాంచల్యాన్ని జయించమని ఆదేశిస్తుంది.

తెలుగు నాట భావ కవిత్వం ఈ అభ్యుదయ భావానికి ప్రాణం పోసింది. మహిళను ఉన్నతోన్నతంగా భావించింది. వేదుల వారి  ఖండిక గమనించండి:

ఆమె నవనీత హృదయ, నా అంగరంగ

శాంతి దేవత, ఆశాపథాంత రాళ

పారిజాతమ్ము, ప్రేమ జీవన విభాత

కైశికీ గీతి, నా తపః కల్పవల్లి”

ఆమె జగదీశ మకుటాగ్ర సీమనుండి

ఉర్విపై వ్రాలిన సుధా మయూఖ రేఖ

ఆమె మూడు లోకాల కల్యాణమునకు

అవతరించిన యొక పవిత్రానుభావము”

ఆమె నా జన్మ జన్మ పుణ్యములు పండి

ప్రాప్తమైన కేళీ పరిత్యాగ లీల

ఆమె పద సన్నిధాన దివ్యస్థలాన

భక్తి నమ్రుడనై నిలంబడిన యపుడు

తలపునకు వచ్చు నా పేదతనము నాకు”

దాదాపు ఇరవై ఏండ్ల క్రిందట ఒక పాకిస్తానీ మహిళ రచించిన మై ఫ్యూడల్ లార్డ్  అనే ఆత్మకథ వెలువడింది. ఆ ఆత్మకథను లిఖించిన రచయిత్రి ఒక అద్వితీయ సౌందర్యవతి. అమెనొక సంపన్న భూస్వామి ప్రేమిస్తాడు. అతనికి అప్పటికే ఇద్దరు భార్యలుంటారు. ఆమెను వదలకుండా ప్రేమించి, వెంబడి పడతాడు. చివరకామె అతణ్ఢి నమ్మి లొంగి పోయి, పెళ్ళి చేసుకొని, భర్తకొక భోగ వస్తువుగా మారిపోతుంది కానీ,  ప్రేమికురాలు, ఏకైక జీవనసహచరీ కాలేక శాశ్వత విషాదాన్ని అనుభవిస్తుంది.

Also read: వంతెనపై పొద్దుపొడుపు

Love One Another - Kahlil Gibran (Powerful Life Poetry) - YouTube
ప్రేమ మీద ఖలీల్ జిబ్రా్న్ కవిత

వివాహ బంధంపై ఖలీల్ జిబ్రాన్

వివాహ బంధం గూర్చి ప్రసిద్ధ లెబనీస్ కవి, చిత్రకారుడు, తాత్వికుడు, మానవతావాది ఖలీల్ జీబ్రాన్  తన “ప్రాఫెట్” పుస్తకంలో ఆల్ ముష్తఫా నోట  పలికించిన పంక్తులివి:

“Love one another, but make not a bond of love

Let it rather be a moving sea between the shores of your souls

Fill each other’s cup but drink not from one cup

Give one another of your bread but eat not from the same loaf

Sing and dance together and be joyous but let each one of you be alone

Even as the strings of a lute are alone though they quiver with the same music!”

“Give your hearts, but not into each other’s keeping

For only the hand of life can contain your hearts

Stand together yet not too near together,

For, the pillars of the temple stand apart,

And the oak tree and the cypress grow not in each other’s shadow.”

నిష్కల్మషం, అమాయకం, యెంకి, నాయుడు బావల ప్రేమజీవనం. ఈ యెంకిపాట చూడండి!

ఎనక జల్మములోన

 ఎవరమో నంటి!

సిగ్గొచ్చి నవ్వింది

సిలక నా యెంకి!”

ముందు మనకే జల్మ

ముందోలెయంటి

తెల్లతెలవోయింది

పిల్ల నా యెంకి”

ఎన్నాళ్లు మన కోలె

ఈ సుకము లంటి

కంట నీరెట్టింది

 జంట నా యెంకి!”

ప్రణయ జీవనయాత్ర సుఖాంతం చేసుకొన్న ఆదర్శప్రేమికుడు నాయని సుబ్బారావు గారు. ఫలశృతి కావ్యంలో ఆయన కవిత గమనించండి:

ప్రేమ మధుపూర్ణమైన నా హృదయ పాత్ర

నీ దినము నీ పెదవుల కందింతుననెడు

నాసలో కన్ను విచ్చితి నమృత సరసి

ప్రాతరున్మిషితమ్మైన పద్యమట్లు”

అత్రి లోకైక జనని పదాబ్జ సవిధ

భూమి మీలిత నేత్రవై మోకరిల్లి పూజా సుమమ్ము వైనావు, హృదయ

కర్ణికా మూలమున భక్తి కందళించి

అడరు పారవశ్యమ్మున తొడిమ యూడి

నేను పూవునై పడితిని నీదు చెంత”

జంట పూవుల అమృత నిశ్వాస సౌర

భమున, రోదసి శుక్ర వారము నదించె”

వామపక్ష కవులూ నిష్కల్మష ప్రేమ ఔన్నత్యాన్ని చాటి చెప్పినవారే

వామపక్ష రచయితలు, బూర్జువా పోకడలు లేని ప్రేమనూ, వివాహబంధాన్నీ, కోరుకుంటారు. ఫైజ్, కిషన్ చందర్, సజ్జద్ జాహీర్, కైఫీ ఆజ్మీ, మగ్దూమ్ వంటి మహామహుల రచనలు ఒకవంక విప్లవకాహళి మ్రోగిస్తూనే, మరొక వంక పవిత్ర, నిష్కల్మష ప్రేమయొక్క ఔన్నత్యాన్ని సదా చాటి చెబుతాయి.

Also read: నీ పదములు

కిషన్ చందర్ “పేపర్ బోట్” అనే నవల ఒక పది రూపాయల నోటు యొక్క ఆత్మకథ. ఆ పదిరూపాయల నోటు అనేక చేతులు మారుతుంది. ఉద్యోగుల చేత, వ్యాపారస్తుల చేత, దొంగల చేత, అమాయకుల చేత, ఖూనీకోరుల చేతబడి, తన యజమానులందరి కథలూ చెప్పుకుంటూ పోతుంది. చివరకది ఒక ప్రేమికుల జంట చేత పడుతుంది. “ఈ ప్రపంచంలోని అసమానతలకు, అనర్థాలకు, ఈ కరెన్సీ నోటే కారణం. ఇది లేని నిష్కల్మష జీవితం గడుపుదాం” అని వారిద్దరూ ఆ నోటును దూరంగా గాలిలోకి గిరవాటు వేయడంతో నవల సమాప్తి చెందుతుంది.

సుదీర్ఘ వియోగం తర్వాత కలుసుకున్న ప్రేమికుల ఆనందాతిశయాన్ని ప్రియురాలి మాటల్లో గమనించండి. మగ్దూమ్ మొహియుద్దీన్ ఉరుదూ కవిత యిది:

ఎండు మ్రోడుల వంటి

ఎన్నెన్ని రాత్రిళ్లు

గడచి ఈ శుభరాత్రి

కదలి వచ్చిందోయి

ఈ రేయి ననువీడి

వెళ్ళబోకుము సఖా!”

అతిదూర తీరాల

అధిగమించిన రేయి

చల్లగా మెల్లగా

సాగి వచ్చిందోయి!”

లతికాంత శశికాంత

సితకాంతి హస్తాల

పానపాత్రిక ఉషోబాల

కానుక యిచ్చి

కరగిపోయే నిశికి

కైమోడ్పు లర్పించు!

ఈ రేయి నను వీడి

వెళ్ళబోకుము సఖా!”

కష్టసుఖముల జమిలి

కాపురము జీవితము

హాలాహలాభీల

కీలావృతము జీవితము”

రాసిక్య మొలికించి

రవళించునది జీవితము

ఉరిత్రాడు వలె బిగిసి వెరపించునది జీవితము”

అధరాధర కపోల

మధురామృతము జీవితము!

ఈ రేయి ననువీడి

వెళ్ళబోకుము సఖా!

(తెలుగుసేత: గజ్జల మల్లారెడ్డి)

Also read: మా ఊరు ఓరుగల్లు

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles