పేరు కొత్తగా అనిపించే ఈ గీతాలు 10-12 శతాబ్దాల మద్య కొంతమంది బౌద్ధ సిద్ధ ఆచార్యులు మహాయాన తాంత్రిక పూజల్లో పాడడానికి రాసినవి. 1907 లొ నేపాల్ రాజ గ్రంధాలయంలోని ఈ తాళపత్ర గ్రంధాన్ని పండిత హరిప్రసాద శాస్త్రి వెలికి తీశారు. ముకుంద రామారావుగారు తెలుగులోకి అనువదించారు. రామారావుగారు వృత్తిరీత్యా ఇంజనీర్ అయినా ప్రవృత్తిరీత్యా కవి, అనువాదకుడు, పరిశోధకుడు. వీరికి కవిత్వం మీద ఎంత ప్రేమంటే తెలుగులో రాయడంతో తృప్తిపడక అనేక భారతీయ, విదేశీ భాషలలోని కవిత్వాలను అనువాదం చేయడం మొదలు పెట్టారు. చైనా, జపాన్, కొరియా, హీబ్రూ, అరబ్బీ లాంటి అనేక భాషలనుండి సేకరించిన కవిత్వాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. “దేశం నుండి దేహం దాకా” అంతా వీరి ఇష్ట వస్తువులే. అనేకమంది నోబెల్ గ్రహీతల రచనలను అనువదించారు. ఎంతో క్లిష్టమైన బౌద్ధ ఆచార్యుల రచనలను అర్దం చేసుకుని అనువదించే సాహసోపేతమైన ప్రయత్నం చేసారు.
Also read: ఆధునిక తెలుగు కవిత్వ పోకడలు
భావ గాంభీర్యంతో కూడిన ఈ గీతాలు పైకి మామూలుగా కనిపిస్తూనే ఆధ్యాత్మిక అగాధాలను తరచి చూస్తాయి. పాటక జనం నృత్యం చెయ్యడానికి అనువుగా వుండే ఈ సంగీతాలు సాధకులకు తత్వబోధ చేసే సద్గురు ప్రవచనాలు. మంత్రం, ధ్యానం వల్ల కాక సంయమనంతో, గురు ఉపదేశంతో నిర్వాణాన్ని పొందవచ్చంటాయి.
చర్యా గీతం –1
కేవలం అయిదు కొమ్మలున్న శ్రేష్టమైన చెట్టు ఈ దేహం
చంచల మనస్సులోకి కాలం ప్రవేశిస్తుంది.
మహా సుఖ పరిమాణాన్ని బలపరచుకో
గురువునుండి అడిగి నేర్చుకో అంటాడు లుయిపా.
ధ్యానాలన్నిటిని ఎవరైనా ఎందుకు చేస్తారు
సుఖంలోనో దుఖంలోనో మరణం నిశ్చయం.
ఎప్పటికప్పుడు పడే బేడీల ఇంద్రియ సుఖాల్ని వర్జిస్తూ
శూన్యం రెక్కల్ని హత్తుకో.
ఉచ్చ్వాస నిశ్వాసాల రెండు పీఠాల మీద కూర్చున్న
ధ్యానంలో దీనిని గమనించా నంటాడు లుయిపా.
ప్రతిపాదార్థం
లైన్ 1: పంచేంద్రియాల శరీరం.
2. పుట్టుకనుండి మరణం వరకు ఉన్న కాలం (దేశ కాలాలకు పరిమితమైన జేవం).
౩: జీవిత లక్ష్యమైన నిర్వాణం పొందాలన్న కోరికను బలపరచుకో.
4: గురువు మార్గదర్శనం అనుసరించు.
5,6: సుఖ దుఖాల జీవితంలో మరణం తప్పదు కాబట్టి ధ్యానం చెయ్యి.
7. ఇంద్రియ సుఖాలు ఆధ్యాత్మిక మార్గానికి బేడీలు / అడ్డంకులు.
8: అంతిమ లక్ష్యమైన (బౌద్ధ) శూన్యం / నిర్వాణం అందుకో.
9, 10: జీవితంలో కష్ట సుఖాలను అనుభవించి తెలుసుకున్న సారమిది.
1-10: ఇంద్రియ నిర్మితమైన భౌతిక శరీరం కాల ప్రవాహంలో నశించి పోయేదే. కాబట్టి ఇంద్రియ సుఖాలకు లొంగిపోక, జ్ఞాని అయిన గురువు మార్గదర్శనంతో అంతిమ లక్ష్యమైన నిర్వాణాన్ని చేరుకో.
Also read: కవిత్వమంటే……
చర్యా గీతం –2
తాబేలు (పొదుగు) పాలు ముంతలో పట్టలేము
చెట్టునుండి చింతపండు మొసలి తింటుంది
ఓ చదువుకున్న స్త్రీ, విను, ఇంటివైపు పెరడు ఉంది
అర్ధరాత్రి దొంగ, చెవి పోగులు దొంగిలించాడు
మామ నిద్ర పోయాడు, కోడలు మేల్కొనుంది
దొంగిలించిన చెవి పోగులు ఎక్కడ దొరుకుతాయి?
పగలు కోడికూతకు కోడలు భయ పడుతుంది
రాత్రి కాముక శృంగారానికి పోతుంది
కుక్కురిప ఎంత లోతైన చర్యాని గానం చేశాడంటే
లక్షల్లో ఏ ఒక్కడో దాన్ని అర్దం చేసుకోగలడు.
ప్రతిపాదార్థం
లైన్ 1: తాబేలు (పొదుగు) విషయ వాంఛల ప్రతీక. వాటిని పట్టి అధీనంలో ఉంచుకోవడం వీలు కాదు.
2: శరీరం నుండి పుట్టిన వాంఛ (లోకంతీరు) అనేది పట్టు వదలని మొసలి కాటు లాంటిది.
3: ఆలోచన కలిగిన వారికి కూడా లోపల భౌతిక కోర్కెలు ఉంటాయి.
4: విని నేర్చుకున్నదంతా అజ్ఞానమనే దొంగ దొంగిలించాడు.
5: విజ్ఞత నిద్ర పోయింది, కోరికలు మేలుకున్నాయి.
6: పోయిన జ్ఞానం మళ్ళీ తిరిగి పొందడం ఎలా?
7: జ్ఞానానికి అజ్ఞానం భయపడుతుంది.
8: అజ్ఞానం ఇంద్రియాలకు లొంగి పోతుంది.
9, 10: ఇక్కడి భావం లక్షల్లో ఒకడికి మాత్రమే అర్ధ మవుతుంది.
1-10: తాబేలు పొదుగు మనిషిలోని విషయ వాంఛలకు సంకేతం. పొదుగునుండి పెల్లుబికే కోరికలను పట్టి నియంత్రించే ముoత లేదు. శరీరమనే చెట్టునుండి పుట్టిన ఫలాన్ని (కోరికను) అంతరాంతరాల్లో దాగిన (పట్టు విడవని) మొసలి లాంటి భౌతికత్వం మింగేస్తుంది. మనిషి కోరికలు లోకంతీరుకు అనుగుణంగానే సాగుతాయి.
Also read: కొంతమంది సమకాలీన భారతీయ ఆంగ్లకవుల కవితల పర్యావలోకనం
శాస్త్ర జ్ఞానం కలిగిన వారైనా మరోవైపునుండి వచ్చే భౌతిక ప్రేరణలకు లొంగి జ్ఞానం కోల్పోతారు. ఇంటి యజమానియైన మామ (బద్ది) నిద్రపోయినపుడు కోడలు జ్ఞానం పోగొట్టుకొని శృంగారానికి లొంగుతుంది. అణచ వీలుకాని కామం ముంతలో పట్టించ లేనిది. బుద్ధి చాంచల్యం వల్ల ఉన్న జ్ఞానం మరుగున పడి అజ్ఞానం (కామం) పెచ్చరిల్లడాన్ని లక్షల్లో ఒకడు మాత్రమే అర్దం చేసుకోగలడు.
ముకుంద రామారావుగారు ‘వలస పోయిన మందహాసం’ లాంటి కవితలు, “అదే ఆకాశం” లాంటి దేశ దేశాల కవిత్వాల అనువాదాలు, 20వ శతాబ్దపు నోబెల్ గ్రహీతల కవిత్వాల అనువాదాలు, కధలు, వ్యాసాలు అనేకం రచించిన సాహితివేత్త. అనేక పురస్కారాలు పొందిన వీరి సేవ తెలుగు వారు గుర్తుంచుకోదగినది.
Also read: “ఆర్ధిక ప్రగతి – విద్య”