Monday, January 6, 2025

భారతీయ విశిష్ట తాత్విక నిలయం చార్వాకాశ్రమం!    

 (మానవీయ వైజ్ఞానిక సౌధానికి అర్ధశతాబ్ధి)

ప్రతీ ప్రగతిశీలవాదికీ పరిచితమైన ప్రదేశం అది. అన్ని ప్రజా ఉద్యమశ్రేణులకీ చిరపరిచితం ఆ స్థలం. అటువైపు వెళ్ళిన ప్రతీ భావోద్యమశీలి ప్రేమగా సందర్శించే చక్కని ప్రకృతి నివాసం. వేమన మొదలు మక్కలి గోశాలి, కపిలుడు, కణాదుడు, పాయసి, చార్వాకుడు, అజితకేశ కంబళి, ఇంకా సాంఘిక విప్లవకారులైన బుద్దుడు, అంబేద్కర్,  పెరియార్ వంటి అరుదైన ప్రాచీన, నవీన విజ్ఞుల విగ్రహాలతో గుంటూరు జిల్లా మంగళగిరి సమీప గ్రామం నిడమర్రులో ఉపాధ్యాయుడైన రామకృష్ణ మాష్టారు 50 ఏళ్ళ క్రితం 1974 లో “ప్రగతి విద్యా వనం” పేరుతో స్థాపించిన అద్వితీయ నిర్మాణమే చార్వాకాశ్రమం. ఒక్క తెలుగు నేలమీదే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా ప్రాచీన భౌతికవాదాన్ని ఆదర్శంగా తీసుకొని, మానవీయ ఆలోచనలతో పౌరసమాజంతో కలిసి పనిచేసే సంస్థ బహుశా ఇదొక్కటేనేమో. సుమారు 5000 ఏళ్ళ క్రితమే ప్రజానీకంలో ప్రశ్నించే స్వభావాన్ని నెలకొల్పి, హేతువాదాన్ని ప్రచారం చేసిన చార్వాక లోకాయత విధానాన్ని పరిశోధించి సమగ్రమైన జీవనమార్గంగా గుర్తించడమే కాకుండా, అందుకోసం ఎంతో విలువైన సాహిత్యాన్ని ప్రచురిస్తూ ముందు కెళుతున్న ప్రజాచైతన్య సంస్థ ఇది!

రామకృష్ణ మేష్టారు

నాస్తికత్వం అంటే అదేదో దేవుడ్ని తిట్టడంగా మాత్రమే భావించడం సమాజంలో ఉంది. అందుకు విరుద్దంగా జీవితంలోని సకల పార్శ్వాలనూ సుసంపన్నం చేసుకుంటూనే, ఇతరేతర సాంఘిక అసమానతలను ప్రశ్నించడమనే వైఖరి కల్పించడమే లక్ష్యంగా చార్వాకాశ్రమం పనిచేస్తోంది. అందులో భాగంగా కుల నిర్మూలన, మతోన్మాదం,  పురుషాధిక్యత, మూఢ నమ్మకాలు వంటి అంశాలపై దశాబ్దాలుగా పౌరసమాజంలో, ముఖ్యంగా యువతలో అవగాహన కలిగిస్తోంది. ప్రపంచంలో మొట్టమొదటి నాస్తిక కేంద్ర వ్యవస్థాపకులు గోరా, కొండవీటి వెంకటకవి ఆద్వర్యంలో ఏ మత సాంప్రదాయాలూ లేకుండా రామకృష్ణ – గృహలక్ష్మి గార్ల వివాహం జరిగింది. నాటి నుండి ఆ దంపతులు ఇద్దరూ ఉద్యమం కోసమే మొత్తం జీవితాన్ని ధారపోసారు. రామకృష్ణ గారి తదనంతరం కుమారులు, కోడలు, మనుమల సహకారంతో గృహలక్ష్మి గారు ఆశ్రమ బాధ్యతలు చేపట్టారు!

భావోద్యమాలలో సాంస్కృతిక రంగం ప్రాముఖ్యతను గుర్తించేవారు అరుదు. కానీ,  రామకృష్ణ గారు, సాంఘిక, ఆర్ధిక పోరాటాలు బొమ్మబొరుసులు అన్న నినాదంతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతీ ఏడూ ‘చార్వాక కేలండర్’ ని ఏదో ఒక నూతన ప్రజాహిత అంశంతో ప్రచురించడం చేశారు. మనుషుల్ని కలపడానికి మతాలకి పండుగలు ఉన్నట్టే, మానవవాదులకి మేళాలు అవసరమని భావించి ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి రెండో శని, ఆదివారాల్ని అందుకోసం కుటుంబాలతో సహా మత రహితులంతా వేడుక చేసుకునేలా “నాస్తిక మేళా” ఏర్పాటు చేశారు. ఈనాటికీ వివిధ సుదూర ప్రాంతాల నుండి కూడా ఆ రెండు రోజులు స్వచ్ఛందంగా అనేకమంది ఆలోచనా పరులు, మేధావులు, విజ్ఞానవేత్తలు ఆశ్రమానికి వచ్చి అభిమానంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోజన, వసతి ఏర్పాట్లన్నీ ఆశ్రమ నిర్వాహకులే చేస్తారు!

చార్వాకాశ్రమం

పసిపిల్లలకి శాస్త్రీయ విద్యను అందించే ఉద్దేశంతో రామకృష్ణ గారు ప్రాథమిక తరగతులకి పాఠ్యాంశాల్ని రూపొందించడమే కాదు, అప్పట్లో కొన్నేళ్ళు స్కూలు కూడా నడిపారు. భారతీయ విశిష్ట తాత్విక చింతన లోని దార్శనిక దృక్పధాల పై లోతుగా పరిశో ధించి పదుల సంఖ్యలో పుస్తకాలు రాశారు. తెలుగులో అంతగా ప్రాచుర్యం పొందని  దశాబ్దాలనాటి విలువైన భావోద్యమగ్రంథాల్ని పునర్ముద్రించారు. సొంతంగా ప్రెస్ ఏర్పాటు చేసుకొని పత్రికలెన్నో నడిపారు. సామాజిక అసమానతల్ని ప్రశ్నించకుండా సిద్ధాంతాల్ని వల్లె వేయడంవల్ల ప్రయోజనం లేదని గుర్తించి ప్రజాసంఘాల్లో, క్షేత్రస్థాయి ప్రజా పోరాటాల్లో భాగస్వామ్యం వహించారు. ఆ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు జరిపారు. ప్రతీ ప్రాంతంలోనూ ప్రజాచైతన్యం కోసం పనిచేస్తున్న కార్యకర్తల్ని గుర్తించి వారితో స్నేహసంబంధాలు పెట్టుకొన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర, విప్లవ, రాజకీయ శ్రేణులు అన్నింటిలోనూ మమేకమయ్యారు. అద్వానీ రథయాత్రప్పుడు ప్రత్యామ్నాయంగా శంబూక రథయాత్ర నిర్వహించారు. వందల ఆదర్శ వివాహాలు జరిపించారు. ప్రజాఉద్యమ తత్వవేత్త కే. జి. సత్యమూర్తి మొదలు బహుజనోద్యమ బుద్ది జీవి కలేకూరి ప్రసాద్ వరకూ ఎందరితోనో చర్చంచారు. ఎన్నో విమర్శలు, దాడుల్ని కూడా ఎదుర్కొన్నారు. ఐనా, ఈనాటికీ ఒక సుస్థిరమైన లక్ష్యంతో సమసమాజ నిర్మాణం కోసం నిబద్దతతో కృషిచేస్తున్న ఏకైక చార్వాక లోకాయత భావజాల సంస్థ ఇదొక్కటే!

మహామహుల విగ్రహాలతో ప్రకృతివనం

భారతీయ తాత్విక స్రవంతిలోని మానవీయ వారసత్వాన్ని ఆధునిక వ్యవస్థలో రాజ్యాంగ బద్ద రీతిలో ప్రచారం చేస్తూ, మూఢత్వానికి వ్యతిరేకంగా వైజ్ఞానిక, హేతుబద్ద ఆలోచనా విధానం కోసం అహర్నిశలు పని చేస్తున్న చార్వాకాశ్రమాన్ని కాపాడుకోవడం ఆలోచనా పరులు అందరి బాధ్యత. పాఠ్యాంశాలు మొదలుకొని ప్రదేశాల పేర్లు కూడా ఇష్టం వచ్చినట్లు మారుస్తూ, చరిత్ర స్థానంలో విశ్వాసాల్ని ప్రవేశపెడుతూ, విద్వేష మతతత్వ శక్తులు మితిమీరుతున్న ప్రస్తుత కాలంలో, దళిత, బహుజన, అణగారిన వర్గాల ఐక్యతే సాధనగా ఆధిపత్య విధానాలను నిరసిస్తూ, ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించడానికి నిబద్దతతో కృషి చేస్తున్న చార్వాకాశ్రమం నిజాయితీకి, పారదర్శకతకి జోహార్లు చెబుతూ అర్ధశతాబ్ధి పూర్తి చేసుకుంటున్న మానవీయ సౌధానికి మనఃపూర్వక శుభాకాంక్షలు!

(50 వ ఏటిలోకి ప్రవేశించబోతున్న భౌతికవాద తాత్విక సౌధానికి శుభాకాంక్షలతో..)

గౌరవ్

Gourav
Gourav
గౌరవ్, సామాజిక కార్యకర్త, రామచంద్రాపురం, డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles