Sunday, November 24, 2024

“మార్చిన చరిత్ర”

భారత దేశ చరిత్ర అనాదిగా మార్చబడుతూనే ఉంది. కొన్ని సార్లు విషయం అర్థం చేసుకోలేక, కొన్ని సార్లు భారత ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో. ఉదాహరణకు అందరికీ తెలిసిన మహాభారతంలోని ఏకలవ్యుడి కథ తీసుకుందాం. గురువుగా భావించిన ద్రోణుడితో మాట్లాడేటప్పుడు కుక్క మొరిగిందని దాని నోట్లోకి అనేక బాణాలు వేసి అది అరవకుండా చేశాడు ఏకలవ్యుడు. అతని విలువిద్య ప్రావీణ్యం ఎంత గొప్పదంటే బాణాలు కుక్క నోటిలోని భాగాలను గాయపరచ లేదు. అంటే నేడు రాకెట్లు ఏ విధంగా కచ్చితమైన ప్రదేశానికి చేరుతాయో అలాంటి టెక్నాలజీ ఉపయోగించాడు. అప్పుడు ద్రోణుడు కోరినట్లుగా ఏకలవ్యుడు బొటనవేలు కోసి ఇచ్చేశాడు. దీనికి కారణం గిరిజనుడైన ఏకలవ్యుడు క్షత్రియుడైన అర్జునుడికి పోటీ అవుతాడేమోనని ద్రోణుడు ఈ కోరిక కోరినట్లుగా చెప్పారు. ఈ ఏకలవ్యుడు గిరిజన రాజకుమారుడని, అతని తండ్రి మగధను పాలించే రాక్షసరాజైన జరాసంధుడి సర్వ సైన్యాధిపతి అన్న విషయం దాచి అమాయక గిరిజనుడికి అగ్రవర్ణాలవాళ్ళు అన్యాయం చేసినట్లుగా చెప్పారు.

భారత దేశంలో కుల మతాల కారణంగా కొంతమందిని తక్కువగా చూస్తారని ఆరోపణ. హిందూ శాస్త్రాల్లో వర్ణాల గురించి చెప్పారు కానీ కులాల గురించి ఎక్కడా చెప్పలేదు. వర్ణాలలో కూడా ఎక్కువ తక్కువలు లేవు. హిందువులకు ముఖ్య గ్రంధం రామాయణం రాసిన వాల్మీకి ఒక గిరిజనుడు. మహాభారతం రాసిన వేద వ్యాసుడు చేపలు పట్టడం వృత్తిగా కల (బెస్త) స్త్రీ పుత్రుడు. ఆయనను వ్యాస భగవానుడు అంటారు. మహర్షులలో అన్ని కులాల వారున్నారు. అంటే పుట్టుకను బట్టి ఎక్కువ తక్కువలు నిర్ణయించలేదనే విషయం స్పస్టమవుతుంది. గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో భారత దేశాన్ని దర్శించినపుడు ఇక్కడి  సమాజంలో అందరూ సమానం ఆనే విషయం రాశాడు. నిజానికి ‘క్యాస్ట్’ అనే పదం పోర్చుగీసు భాషనుండి వచ్చింది. 1931లో భారత జనాభా లెక్కలు రాయడానికి నియమించబడ్డ ఆంగ్లేయుడు భారతీయులలో కొన్ని వేల కులాలున్నాయని రాశాడు. కులం గురించిన మొదటి రికార్డు అది.

భారత దేశంలో అనాదిగా ఉన్న గ్రామ పంచాయతి వ్యవస్థలో సభ్యులు ఐదు మంది. వారు బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలనుండి ఒక్కొక్కరు, ఆ గ్రామ పరిసరాల్లో ఉన్న గిరిజన కుటుంబాలనుండి  ఒకరు. ఇది నిజమైన ప్రజాస్వామ్య గ్రామ పరిపాలన. ఎక్కువ తక్కువలు లేవనడానికి బలమైన ఉదాహరణ.

విదేశీయులు భారత దేశంపై చేసే మరో ఆరోపణ స్త్రీలకు విద్య లేకుండా అణగ దొక్కారని. గార్గి, మైత్రేయి పురాణ కాలంలోని పండితురాళ్ళు. మహర్షులతో సమానంగా గౌరవం పొందిన వాళ్ళు. శంకరాచార్యకు, మoడన మిశ్రుడికి మధ్య జరిగిన వేదాంత చర్చకు న్యాయమూర్తి మండన మిశ్రుడి భార్య ఉభయ భారతి. భర్త ఓడిపోతున్న సమయంలో స్వయంగా వాదనకు దిగుతుంది శంకరాచార్యుడితో. నాల్గవ శతాబ్దంలో గుప్త వంశానికి చెందిన ప్రభావతి అనే రాణి రాజ్య పరిపాలన చేసింది. హోల్కారు వంశానికి చెందిన అహల్యా బాయి, ఝాన్సీకి చెందిన లక్ష్మీ బాయి యుద్ధ విద్యలలో ఆరితేరిన వారనే సంగతి తెలిసిందే. నిజానికి భారతీయ స్త్రీలు పురుషులకంటే ఎక్కువగా భావించ బడ్డారు. పవిత్రమైన వన్నీ తల్లిగా భావించ బడ్డాయి. గంగా మాత, భారత మాత.   తల్లిదండ్రులు అన్నారు. తల్లి తరువాతే తండ్రి స్థానం. దేవుళ్ళకూ అదే వరుస. సీతా రాములు, లక్ష్మీ నారాయణులు, గౌరీ  శంకరులు, రాధా కృష్ణులు.

రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్. చదివింది ఆంగ్ల సాహిత్యం అయినా తెలుగులో కవిత్వం రాస్తారు. ఇతనికి స్వామి చిన్మయానంద, సాయినాధుని శరత్ బాబుజీల కొన్ని రచనల్ని తెలుగులోకి అనువదించే అవకాశం లభించింది. కొన్ని సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలు రాశారు త్రివేణి, మిసిమి లాంటివాటిలో. చెప్పదలచుకున్నది కొద్ది మాటల్లోనే వ్యక్త పరచడం ఇతని కవిత్వ లక్షణం. భావుకత, లోతైన ఆలోచన, ఆధునికత, వేదంత విషయాలపై మక్కువ,భాషపై పట్టు ఇతని కవితలలో కనిపిస్తాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles