కొరివితో తలగోక్కోవడం అంటే ఇదే. నందమూరి తారకరామారావు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని పెట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం? పైగా అధికార వైఎస్ఆర్ సీపీకీ, వ్యక్తిగతంగా జగన్ మోహన్ రెడ్డికీ అప్రతిష్ఠ. నష్టదాయకం. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి రాజకీయ పోరాటంలో మరో ఆయుధాన్ని అందించారు. పరిపాలనా పరంగా ఆలోచించినా, రాజకీయంగా ఆలోచించినా పేరు మార్చడం అన్నది అనవసరమైన, దుందుడుకు చర్య అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు.
అకస్మాత్తుగా ఎన్ టీ రామారావు పేరును తొలగించడంలోని ఆంతర్యం ఏమిటో రాజకీయ పరిశీలకులకు అంతుబట్టడం లేదు. రాజకీయ ప్రయోజనం ఆశించకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే తెలివిమాలినవాడు వైఎస్ జగన్ అని ఎవ్వరూ అనుకోవడం లేదు. అంచనాలు తప్పవచ్చును కానీ అంచనాలు లేకుండా ఇటువంటి చర్య తలపెట్టే రాజకీయ నాయకుడు కాదు జగన్ మోహన్ రెడ్డి. కేవలం తన తండ్రిపట్ల భక్తిప్రపత్తులు ఉంటే సంతోషమే. ఎవ్వరూ కాదనరు. ఇప్పటికే అనేక చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టారు. ఎన్నో పథకాలకు ఆయన పేరు పెట్టారు. ఒక జిల్లాకే వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఎవ్వరూ తప్పుపట్టలేదు. విశాఖపట్టణం లేదా కర్నూలు కేంద్రంగా మరో ఆరోగ్య విశ్వవిద్యాయలం నెలకొల్పి దానికి డాక్డర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పెట్టినా ఎవ్వరూ ఆక్షేపించి ఉండేవారు కాదు. చంద్రన్న పథకం లాగా జగనన్న పథకం అని పథకాలకు పదవిలో ఉన్న ముఖ్యమంత్రులు తమ పేరు పెట్టుకోవడమే ఎబ్బెట్టుగా ఉంది. ఏ మాత్రం సంకోచం లేకుండా ప్రజల నిధులతో అమలు చేసే పథకాలకు ప్రధానమంత్రులూ, ముఖ్యమంత్రులూ పేర్లు పెట్టుకోవడం సమాజంలో వినయం, మర్యాదలు కొరవడుతున్నాయనడానికి నిదర్శనం.
ఎన్.టి.రామారావు పేరు తొలగించాలనే బిల్లుపైన చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన విన్యాసాలూ, ప్రదర్శనలూ కొత్త కాదు. ఎన్. టి. రామారావు పట్ల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడుకంటే తనకే ఎక్కువ గౌరవం ఉన్నదని చాటుకుంటే చాలదు. ఎన్. టి. రామారావు పట్ల చంద్రబాబునాయుడూ, తదితరులు ఎట్లా వ్యవహరించారో పాతతరం వారందరికీ తెలుసు. ఎన్ టి రామారావును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బతికి ఉండగానే అవమానిస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. టి రామారావును చనిపోయిన అనంతరం అవమానిస్తున్నారని ప్రజలు చెప్పుకోరా? అయినా ఈ మార్పు ఎంత కాలం నిలుస్తుంది? తాము అధికారంలోకి రాగానే తిరిగి హెల్త్ యూనివర్శిటీకి ఎన్.టి. రామారావు పేరు పెడతామని బుధవారంనాడు చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ ప్రకటించారు. ఎన్ టి రామారావును పూర్తిగా సొంతం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి జగన్ మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీనో, మరో పార్టీనో అధికారంలోకి వచ్చిన పక్షంలో హెల్త్ యూనివర్శిటీకి వైఎస్ఆర్ పేరు తొలగించి తిరిగి ఎన్. టి. ఆర్ పేరు పెడతారు. ఒక్క యూనివర్శిటీకే కాదు, చాలా పథకాలకు వైఎస్ఆర్ పేరు తొలగించవచ్చు. చూస్తున్నాం కదా దిల్లీలో దీనబంధు మార్గ్ అనీ, కర్తవ్యపథ్ అనీ ప్రధాని నరేంద్రమోదీకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడం లేదా? వాటిని రేపు (కాకపోతే ఎల్లుండి) ఏ రాహుల్ గాంధీనో, నితీష్ కుమారో ప్రధాని అవుతే ఆ పేర్లు మార్చకూడదని నిబంధన ఏమీ లేదు. పేర్లతో పట్టుదలలకు పోయి దివంగతులైనవారిని అవమానించడం ఎందుకు? ఇందులో ఆనందం ఏమున్నది?
రాజకీయంగా ఈ చర్య వల్ల జగన్ మోహన్ రెడ్డికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? కమ్మ సామాజికవర్గానికి చెందిన ఒక్కమంత్రి కూడా లేని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే. ఒక్క పదవి కమ్మవారికి ఇస్తే పెద్దగా నష్టం ఏమీ ఉండదు. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తున్న ఎంఎల్ఏలలో కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారు. గుడివాడ నానీ లాగా తనను పొగడటమే కాకుండా ప్రత్యర్థిని చెండాడే ఎంఎల్ ఏ ను ఏరి ఒక మంత్రిపదవి ఇస్తే నష్టం ఏమున్నది? జనాభాలో కమ్మ సామాజికవర్గం కంటే తక్కువ శాతం ఉన్న వైశ్యులకూ, బ్రాహ్మణులకూ ఏవో పదవులు ఇచ్చారు కానీ కమ్మ సామాజికవర్గాన్ని దూరంగా పెట్టారనే మాట అందరినోటా వినవస్తున్నది. తాను కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకమని చాటుకుంటూ, మొత్తం సమాజాన్ని కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకంగా తయారు చేసి వచ్చే ఎన్నికలలో మోహరించాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా? అది సాధ్యమేనా? అధికారంలో లేని సామాజికవర్గాన్ని వ్యతిరేకించేవారు ఉంటారా? కొంతమంది ఉండవచ్చునేమో కానీ అందరూ ఉంటారా? ఒక వేళ ఇదే వ్యూహమైతే ఈ వ్యూహం ఆశించిన ఫలితాలు ఇస్తుందా?
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయకుండా, కమ్మ సామాజికవర్గానికి ఒక్క కేబినెట్ స్థానం కూడా ఇవ్వకుండా, ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్ టి ఆర్ పేరు తొలగించి, తన తండ్రి పేరు పెట్టుకోవడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న సందేశం ఏమిటో అర్థం కావడం లేదు. లోగడ ఒక జిల్లాకు నందమూరి తారకరామారావు పేరు పెట్టినందుకు సంతోషించినవారిలో ఒక కమ్మ సామాజికవర్గమే కాదు అన్ని వర్గాలవారూ ఉన్నారు. ఎన్ టి రామారావు నటుడిగా వెలిగిన తీరూ, చిత్రసీమలో ఆయన ఎవరిని ప్రోత్సహించారో, ఎవరితో అంటకాగారో గమనించినవారికీ, ఆయన అధికారంలోకి సుడిగాలిలాగా దూసుకొచ్చిన పద్ధతినీ, సంక్షేమ కార్యక్రమాలను అమలు జరిపిన విధానాన్నీ పరిగణనలోకి తీసుకున్నవారికీ, 1985లో, 1994లో ఘనవిజయాలు సాధించిన విధానాన్ని పరిశీలించినవారికీ ఆయనను ఒక్క సామాజికవర్గానికి పరిమితం చేయడం అవివేకం అని స్పష్టంగా తెలుస్తుంది. కొత్త జిల్లాకు ఎన్ టి రామారావు పేరు పెట్టడం ద్వారా ముఖ్యమంత్రి సంపాదించిన మంచి పేరు హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ద్వారా కొట్టుకుపోయింది.
నిజానికి తెలుగువారి హృదయాలలో ఎన్ టి రామారావుకు శాశ్వత స్థానం ఉంది. తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకున్న రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇద్దరినీ నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ రాజకీయరంగంలో విజయ పరంపర సాధించవలసిన జగన్ మోహన్ రెడ్డి ఎన్ టి ఆర్ పేరును దూరం చేసుకోవడం మతిలేని పని.
ఇంతమంది వైఎస్ఆర్ పీసీ శాసనసభ్యులలో, శాసనమండలి సభ్యులలో ఒక్కరైనా ఈ నిర్ణయం తప్పని చెప్పడానికి సాహసించకపోవడం తెలుగు రాజకీయాలకు పట్టిన దుస్థితిని ప్రకటిస్తోంది. శాసనమండలిలో ఎన్ టి రామారావుతో కలసి పని చేసిన పెద్దమనుషులు ఉన్నారు. వారైనా ఈ నిర్ణయాన్ని ఆపేందుకు ప్రయత్నించకపోవడం శోచనీయం. మందబలంతో, అధికారమదంతో ఎటువంటి శాసనాలైనా చేయవచ్చునని మరోసారి ఆంధ్రప్రదేశ్ చట్టసభలు నిరూపించాయి. ఇదేమీ గర్వకారణం కాదు.