రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
జీవితం అంతా జీతం కోసం తాపత్రయం
విత్తమే విలువలకు పరాకాష్ట అయిన జీవితం
ఎందుకు బ్రతకాలో తెలియని అయోమయం
ఇదంతా నీకు నేను, నాకు నువ్వు లేని నిరామయం.
మనకు ఎన్ని ఆశలున్నా
ఒకరికొకరం పంచ ప్రాణాలైనా
సమాజానికి వెరచే తల్లిదండ్రుల అధీరత్వం
వారి మాటలను కాదనలేని నిస్వార్ధం
స్వసంతోషాన్ని త్యాగం చేసిన నిస్సంగత్వం.
రాగం విరాగంగా మారిన వేళ
పెనవేసుకున్న ఆత్మజ బంధం దూరమైన వేళ
అడ్డాలనాటి బిడ్డలు చేయి వదలి
రెక్కలొచ్చి ఎగిరిపోయిన వేళ
ఉన్న తోడు స్వాంతన ఇవ్వలేని వేళ
విశాలమైన గుండె మొరాయించగా
నీలో సగ భాగం అచేతనమైన వేళ
బిడ్డ మీద కినిసి, బ్రతుకు మీద రోసి
శంకర మఠానికి వెళదామంటూ
శంకరుడి చెంతకే వెళ్లిపోయావు
నీలోని నాతో సహా.
ఈ బంధం జన్మ జన్మల బంధమేనా
కనుమూసి గగనాన కలిసేదేనా
ఏవరికి తెలుసు, ఎవరూ చెబుతారు
చకోర పక్షులమై ఎదురు చూడవలసిందే
ఏనాటికైనా, ఎన్ని యుగాలైనా
మనం కలవక తప్పదుగా
అనంత కాల వాహినిలో
కాసారంలో కలువలం అవక తప్పదుగా.