- క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి
- జోన్ల వారీగా నేతలకు బాధ్యతల అప్పగింత
- కీలక నేతలకు పార్టీ సమన్వయ బాధ్యతలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన టీడీపీ కొన్నాళ్లుగా నిస్తేజంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు కోవిడ్ మహమ్మారి కారణంగా అసలు బయటకు వచ్చే పరిస్థితులు లేకుండా పోయాయి. దీంతో పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యకలాపాలన్నీ అన్ని వీడియో కాన్ఫరెన్స్ లతో పనికానిచ్చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి, మార్చినెలల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో బలోపేతానికి కసరత్తు
టీడీపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం, సమస్యలు వస్తే తక్షణం పరిష్కరించేందుకు అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే లోక్ సభ నియోజక వర్గాల వారీగా పార్టీ అధ్యక్షుల్ని నియమించారు. వీటితో పాటు తెలుగు మహిళ, తెలుగు రైతు విభాగాల అధ్యక్షుల్ని చంద్రబాబు నియమించారు. రాష్ట్రంలోని 25 లోక్ సభ నియోజకవర్గాల్ని ఐదు జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్ లోని ఐదు లోక్ సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ పర్యవేక్షణ బాధ్యతలను ఒక్కో ప్రధాన కార్యదర్శికి అప్పగించారు.
జోన్ల వారీగా బాధ్యతలు
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు జోన్ 1 కింద వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు లోక్ సభ స్థానాలకు కేటాయించారు. పంచుమర్తి అనురాధకు జోన్ 2 కింద కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, ఏలూరు లోక్ సభ నియోజకవర్గాలను కేటాయించారు. బత్యాల చెంగల్రాయుడికి జోన్ 3 కేటాయించగా ఇందులో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల నియోజకవర్గాలు ఉన్నాయి.కడప, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నంద్యాల లోక్ సభ నియోజకవర్గాలు ఉన్న జోన్ 5 ను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు కేటాయించారు.వీరు క్షేత్రస్థాయిలో పర్యటించి పార్టీని పునర్ నిర్మించేందుకు కావాల్సిన చర్యలను చేపడతారు.
కీలక నేతలకు సమన్వయ బాధ్యతలు
భావసారూప్యత గల ఇతర పార్టీలను కలుపుపోయేందుకు సమన్వయ బాధ్యతల్ని మాజీ మంత్రి దేవినేని ఉమకు అప్పగించారు. పార్టీ విజ్ఞాన కేంద్రం, అధికార ప్రతినిధులపై పర్యవేక్షణ బాధ్యతలను సీనియర్ నేత ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు అప్పగించారు. 25 లోక్ సభ స్థానాల నుంచి వచ్చే నివేదికలు, ఇతర సమస్యలకు సంబంధించి పార్టీ కార్యాలయం లో ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి సమన్యయ బాధ్యతలను నిర్వహిస్తారు.
పార్టీ బలోపేతంపై బాబు దృష్టి
2022లో జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఇప్పటికే పార్టీ శ్రేణులను సమాయత్తపరుస్తున్నారు.అటు కేంద్ర ప్రభుత్వం కూడా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మేం సిద్ధంగా ఉన్నామంటూ రెండ్రోజుల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా అన్నారు.మరోవైపు రాష్ట్రంలో పార్టీని విస్తరించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.ఈ నేపథ్యంలో సంస్థాగత లోపాలను సరిదిద్ది పార్టీని బలోపేతం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:టీడీపీ “ఛలో తంబళ్లపల్లె” ఉద్రిక్తం