- ఎన్నికలకు టీడీపీ సిద్ధమన్న చంద్రబాబు
- ఎన్నికల విధులకు ఉద్యోగుల విముఖం
న్యాయం శాశ్వతం:
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని ప్రతిపక్ష టీడీపీ స్వాగతించింది. న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం లేని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘం అవసరం లేదనే రీతిలో వ్యవహరిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కూడా వద్దంటారేమోనని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు పోలీసుల మీద నమ్మకం లేదన్న జగన్ అధికారంలోకి వచ్చాక అదే పోలీసులతో టీడీపీ నేతలను అరెస్టు చేయిస్తున్నారని విమర్శించారు.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు
ఎన్నికలు ఎపుడు వచ్చినా సిద్ధమే:
కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలన్న అధికార పార్టీ కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎన్నికలు పెడుతుంటే వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. బలవంతపు ఏకగ్రీవాలు చేశారని అన్నారు. ఎన్నికలు ఎపుడు నిర్వహించినా టీడీపీ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. గుడివాడలో పేకాట శిబిరాలపై దాడిలో పాల్గొన్న ఎస్ఐ అనుమానస్పదంగా మరణించడం వెనక ఉన్నవాస్తవాలను వెల్లడించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం
సుప్రీంకు వెళ్లే యోచనలో జగన్ సర్కార్:
హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ కారణంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని అడ్వొకేట్ జనరల్ చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగులను బలవంతంగా విధులు నిర్వహించాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సబబని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట రెడ్డి అంటున్నారు.