దేశంలో అరెస్టు అయిన మొదటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కారని మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాష్ వ్యాఖ్యానించారు. మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావులు అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారనీ, కోర్టు గడప తొక్కారనీ గుర్తు చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ఆరోపణలపైన న్యాయస్థానాలలో పోరాడారని జయప్రకాష్ చెప్పారు. డిస్ ప్రపోర్షనేట్ అసెట్స్ (అసమాన ఆస్తులు) కేసులో తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత, బీహార్ ముఖ్యమంత్రిగా పని చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. హరియాణా ముఖ్యమంత్రిగా పని చేసిన ఓం ప్రకాష్ చౌథాలా పదేళ్ళ జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. ఆయన తండ్రి దేవీలాల్ ఈ దేశానికి ఉపప్రధానిగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అసమాన ఆస్తుల ఆరోపణలపైన జైల్లో ఉన్నారు. అప్పుడాయన పార్లమెంటు సభ్యుడు. ఆయన ఈ కేసుల విషయంలో పోరాటం చేస్తున్నారు. స్కిల్స్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడిపైన వచ్చిన ఆరోపణలకు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని కోర్టు భావించి ఆయనను రిమాండ్ కు పంపిందని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా కేసుని కొట్టివేయడానికి అంగీకరించక పోవడంతో ప్రజలలో రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే అవకాశం ఉన్నదనీ, చంద్రబాబునాయుడు తప్పు చేయలేదనుకుంటే తన నిర్దోషిత్వాన్ని న్యాయస్థానాలలో నిరూపించుకోవచ్చుననీ జయప్రకాష్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలలో ప్రచారం సీఐడీ కేసులపైనే జరుగుతుందనీ, ఇది ఆసక్తికరంగా ఉండబోతున్నదనీ జయప్రకాష్ అన్నారు.