Sunday, December 22, 2024

చంద్రబాబునాయుడు-  ఊహాచిత్రం, వాస్తవం (ఇమేజ్ అండ్ రియాలిటీ)

పాలగుమ్మి సాయినాథ్

ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కంటే కాస్త పెద్దదని ఇప్పుడు  మీడియాని ఒప్పించడం కొంచెం తేలిక కావచ్చు. (2004లో) ఎన్నికలు పూర్తయి రెండు మాసాలు గడిచిన తర్వాత మీడియా చంద్రబాబునాయుడు పేరు ఎత్తడం లేదు. ఏ భారత రాజకీయ నాయకుడి గురించి మీడియాలో అత్యధికంగా రాశారో ఆ నాయకుడు అకస్మాత్తుగా తెరమీది నుంచి అదృశ్యమైపోయాడు. జాతీయ స్థాయిలో ప్రజాతీర్పు హిందూత్వకు అనుకూలంగా ఉన్నదా, సంస్కరణలకు అనుకూలంగా ఉన్నదా అని చర్చ జరుపుతున్నది. విశ్లేషణలు సాగుతున్నాయి. నాయుడు గురించి మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఇది ఆత్మావలోకనం ఫలితం కాదు. ఇబ్బందిగా అనిపించి   ఉంటుంది. ఎందుకంటే నయాఉదారవాద ఆర్థిక సంస్కరణలకు అతను (నాయుడు) ఒక గురువు.

అయినా సరే, నాయుడు అనే ఒక భ్రమను పరిశీలిస్తే చాలా విషయాలు అర్థం అవుతాయి. చాలా సూచికల ప్రకారం చూస్తే దక్షిణాదిలో సుమారు పదేళ్ళలో చాలా అథమస్థాయి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో నడిపించారు నాయుడు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ను పట్టిపీడిస్తున్న పెనుసంక్షోభం కూడా అతని విధానాల ఫలితమే. విచిత్రం ఏమంటే అతను ఎంత నష్టం చేస్తున్నాడో మీడియాలో అతని స్థాయి అంతగా పెరిగింది. అతని ఇమేజ్ (ఊహాచిత్రం)కీ, వాస్తవ పనితీరుకూ మధ్య ఉన్న తేడా దిగ్భ్రాంతికరమైనది.

చంద్రబాబునాయుడికి వచ్చిన మీడియా పొగడ్తలు భారత దేశంలో మరే రాజకీయ నాయకుడికీ రాలేదు. ‘అద్భుతాలు చేసే మనిషి,’ ‘వచ్చేతరానికి చెందిన సీఎం,’ ‘ఆంధ్రప్రదేశ్ సీఈవో.’ నిజంగా ఉన్నదాని కంటే ఎక్కువ చేసి చూపించే ఊహాచిత్రం విపరీతంగా సొంతప్రచారంపైన ఖర్చు పెట్టడం వల్ల సాధ్యమైంది. దాన్నిపెంచి పోషించేందుకు ముంబయ్ నుంచి వాణిజ్య ప్రకటనల గురువులు (యాడ్ గురూస్) హైదరాబాద్ లో దిగారు. మన మీడియా ఏది అందితే అది ప్రచురించింది లేదా టెలికాస్ట్ చేసింది. న్యూయార్క్ టైమ్స్, ఫినాన్షియల్ టైమ్స్, మరెన్నో ప్రాంతాల నుంచి మెరుస్తున్న కళ్ళతో జర్నలిస్టులు దిగారు. వారు చేసే మాయాజాలం వారు చేశారు.

2002వ సంవత్సరాన్ని ఉదాహరణగా తీసుకోండి. ప్రపంచంలోని అత్యున్నతమైన పత్రికలు నాయుడూనామా (నాయుడు నామజపం) ప్రచురించాయి. సదరు పత్రికల ప్రతినిధులు హైదరాబాద్ లో తిరుగుతున్నారు. వారిలో ఒకరు మూడో ప్రపంచ దేశాలకు నాయుడి వంటి నాయకుడిని ఎన్నుకోండని సలహా ఇచ్చాడు. ఆయన ప్రభుత్వం వ్యవసాయం రంగంలో మైనస్ (-)17.06 వృద్ధి సాధించిందన్న వాస్తవం వారికి పట్టదు. ఊహాచిత్రం (ఇమేజ్) ప్రధానం. నాయుడిని గురించి మీడియాలో రాసేవారికి వాస్తవాలతో నిమిత్తం లేదు. ‘ప్రైవేట్ ఐ’ అనే సంస్థ వ్యవస్థాపకుడు ఒకసారి ఇలా అన్నాడు: ‘‘మంచి కథకు అడ్డుగా నిజాన్ని నిలవనీయకండి.’’ ఒక వ్యంగ్య పత్రిక సంపాదకుడు హాస్యం కోసం అన్న మాటలవి. మన సంపాదకులు ఆ సామెతను మనస్ఫూర్తిగా అమలు చేశారు. వారిలో బొత్తిగా హాస్యరసం లేదు.

మరో ముఖ్యమంత్రి ఎవరైనా తన ఊహాచిత్రాన్ని పెంపొందించేందుకు అలక్ పదమ్సీని తీసుకొని  వెళ్ళి ఉంటే దాని గురించి విమర్శనాత్మకమైన రాతలకు అంతం ఉండేది కాదు. కానీ నాయుడు ఆ  పని చేయడంలో మీడియాకు తప్పేమీ కనిపించలేదు. ఆయన ఒకానొక బ్రాండ్ కదా!

ఒక ఎగ్జిట్ పోల్ నాయుడు ఓడిపోతున్నాడని చెప్పిన తర్వాత ఆయన గురించి విమర్శనాత్మక కథనాలు ప్రచురించడం ప్రారంభమైంది.  అప్పటికి కూడా రెండో విడత పోలింగ్ లో కోస్తాంధ్ర ఆయనను బలపర్చుతుందని కొన్ని పత్రికలు జోస్యం చెప్పాయి. ఇందుకు భిన్నంగా ఎట్లా ఉంటుంది? అతను గొప్ప పనులు చేశాడు కదా?

నాయుడు ముఖ్యమంత్రిగా పని మొదలు పెట్టినప్పుడు ప్రజలలో సద్భావం ఉన్నది (ఎన్టీఆర్ వారసుడిగా నాయుడు తగినవాడనే జనాభిప్రాయం). ఆ సమయంలో ఆయన చైతన్యం, సాంకేతికత పట్ల అతని దృక్పథం (సాంకేతిక విషయాలు అర్థం అయ్యాయని కాదు) ప్రజలకు నచ్చినట్టే కనిపించింది. ఆ ఉత్సాహంలో నాయుడు అమలు చేసిన విధానాలు రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రజలకు వినాశనకరమైనవని కొద్ది సంవత్సరాలలో తేలింది. కానీ పేద ప్రజల నుంచి నాయుడు ఎంత దూరమైతే కార్పొరేట్ ప్రపంచానికి అతడు అంత దగ్గరయ్యాడు. ఇప్పుడతను సంస్కరణల సారథి. ‘అంతర్జాతీయ దాతలకు అత్యంత ప్రియమైన వ్యక్తి.’

ప్రపంచబ్యాంకు, బిల్ గేట్స్, బిల్ క్లింటన్, వగైరా సంపన్నులు ఇచ్చిన కితాబులు ఈ ఊహాచిత్రాన్ని మరింత ఉబ్బించాయి.  మూగజీవాలైన తన ప్రజలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ స్వార్థరహిత సీఈవో రాత్రింబగళ్ళూ కష్టపడుతున్నారనే ఊహాచిత్రం ఆకర్షణీయంగా తయారైంది. ఈ అంచనాకు పూర్తి విరుద్ధంగా ఉన్న వాస్తవాలేవీ ఈ అభిప్రాయాన్ని చెదరగొట్టలేకపోయాయి. కొన్నివేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడంతో కొందరికి జ్ఞానోదయం అయింది. కానీ ఆ సమయంలో మీడియా దారుణంగా విఫలమైందని ఇప్పుడు చాలా బాధాకరంగా అర్థం అవుతోంది. ఎగ్జిట్ పోల్ తర్వాత నాయుడి పాలనను విమర్శిస్తూ రెండు, మూడు కథనాలు రాష్ట్రం వెలుపల పత్రికలలో వచ్చాయి.

ఆ విధంగా ప్రచురించిన విమర్శనాత్మక కథనాలు సైతం డొల్లవి. రైతుల ఆత్మహత్యలకు కారణం కరువు అని చాలా పత్రికలు తేల్చివేశాయి. ఆత్మహత్యల వెనుక ఉన్న అనేక కారణాలను బద్ధకంగా దాటవేయడమే వాటి పని. మొత్తం మీద మీడియా అంతటా తాబేదార్ల రాజ్యం సాగుతున్నట్టు అనిపించింది.

ఉదాహరణకు కీత్ బ్రడ్షర్ అవార్డులు గెలుచుకున్న పరిశోధనాత్మక జర్నలిస్టు. అతను ప్రభుత్వం గురించి వస్తున్న కపట వార్తలని కొంత వరకైనా అనుమానిస్తాడని మనం అనుకుంటాం. కానీ నాయుడూనామాలో దానికి స్థానం లేదు. ఈ దేవాలయానికి పూజించడానికే వచ్చావు. న్యూయార్క్ టైమ్ప పత్రిక 27 డిసెంబర్ 2002 సంచికలో బ్రడ్షర్ రాసిన ఈ పిచ్చిరాతలు చూడండి: ‘‘ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పట్టు భద్రంగా ఉన్నట్టు కనిపిస్తున్నది. దీనికి కొంత వరకూ కారణం ఏమంటే నాయుడూ, ఆయన మిత్రపక్షాలవారూ ఆ రాష్ట్రంలో మాత్రమే (ఒకటిరెండు పొరుగు రాష్ట్రాలలో కొద్దిమంది) మాట్లాడే భాషను మాట్లాడతారు.’’

అవునా? నాయుడు ప్రత్యర్థులు ఏ భాష మాట్లాడుతారు? ఇస్పెరాంటో భాషా? (అధికారంపైన పార్టీ పట్టు భద్రంగా ఉన్నదనే మాట పద్దెనిమిది మాసాల తర్వాత చివరి వాక్యమైంది). ఈ రిపోర్టు ప్రచురించిన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు బాగా పెరిగాయి. రాష్ట్ర బడ్జెట్ ను నాయుడు దాదాపుగా సమతుల్యం చేశాడనే అంచనాకు బ్రడ్షర్ వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన భారీ రుణాల గురించి ఆ పత్రికా విలేఖరి ప్రస్తావించడు. ప్రపంచ బ్యాంకు నుంచీ, ఇతర సంస్థల నుంచి రాష్ట్రం తీసుకున్న అప్పుల ప్రభావం భవిష్యత్తులో చాలా బడ్జెట్ ల పైన పడుతుంది. ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న కొన్ని ప్రభుత్వ విధానాల వల్ల ప్రపంచానికి రాష్ట్రం ఆదర్శంగా నిలవబోతోందని బ్రడ్షర్ జోస్యం చెప్పాడు.

వాస్తవాలను సమీక్షించుకున్న తర్వాతనే కథనాలను ప్రచురిస్తుందన్న పేరు గల ఫినాన్షియల్ టైమ్స్ సైతం దారిలో పడింది. 2 మే 2003 నాటి సంచికలో ఆ పత్రిక ఈ విధంగా నిస్సిగ్గుగా సూచించింది: ‘‘నిమ్నకులాల మహిళలను నిర్ణయాక పాత్ర పోషించకుండా దూరంగా పెట్టే ఆనవాయితీ ఉన్న దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక విప్లవం నడిపిస్తున్నది.’’ ఈ విప్లవం ఆంధ్రప్రదేశ్ లోని వేలాది గ్రామాలలో జరుగుతోంది. నాయుడు పథకాల వల్ల పంచాయతీలు మూత పడటమో, నాశనం కావడమో జరిగిన దరిమిలా ఈ విప్లవం సంభవించడం విశేషమని ఫినాన్షియల్ టైమ్స్ విలేఖరి రాశాడు. తరతరాలుగా ఇంట్లో నుంచి బయటకు కదలకుండా, మౌనంగా ఉన్న మహిళలు ఒక గ్రామం రచ్చబండలపైన బాహాటంగా విజృంభించారని కూడా ఆ విలేఖరి కనిపెట్టాడు.

ఇతర రాష్ట్రాల నాయకులకు నాయుడిని ఒక ఆదర్శంగా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ అభివర్ణించింది.  టైమ్ మేగజైన 1999లోనే ‘సౌత్ ఏసియన్ ఆఫ్ ద ఇయర్ (దక్షిణాసియాలో అత్యంత ప్రముఖుడు)’గా ప్రకటించేసింది. న్యూస్ వీక్ నాయుడిని డాక్టర్ నాయుడు అని సంభోదిస్తూ లేని డాక్టరేట్ ని ఆపాదించింది.

భారత మీడియాలో ఊపిరాడని ఉద్వేగం, ఆశ్చర్యం స్తంభించిపోయాయి.  తరచుగా ‘ఐటీ’ అనీ, ‘సాఫ్ట్ వేర్’ అనీ కేకలేయడం వివిధ రంగాలలో క్షేత్రకార్యక్రమం చేయడానికి ప్రత్యామ్నాయం కాదు. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఏరకంగానూ అగ్రభాగంలో లేదు. కానీ మీడియా చదివేవారికీ, చూసేవారికీ అదే అన్ని రాష్ట్రాలకంటే ముందున్నదని అనిపించింది. మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా కూడా లేదు. ర్యాంకులు తగ్గుతూ వస్తున్నది.

ఈ రాష్ట్రం అక్షరాస్యతలో దక్షిణాదిలో అట్టడుగున ఉన్నది. జాతీయ సగటు కంటే తక్కువే. టాటా స్టాటిస్టికల్ అవుట్ లైన్ ఆఫ్ ఇండియా చూపించే లెక్క ప్రకారం సైబరాబాద్ అక్షరాస్యత కూడా పట్నా, రాంచీ, భోపాల్,  ఇండోర్, జబల్పూర్, జైపూర్ ల అక్షరాస్యతకంటే తక్కువ. నాయుడు గొప్పగా చెప్పుకునే నగరం రేటింగ్ ఇది.

ఈ రాష్ట్రంలో లక్షలాది పిల్లలు బడికి వెళ్ళడం లేదు. దేశంలో కెల్లా అత్యధికంగా బాలకార్మికులు ఉన్న రాష్ట్రం ఇది. గ్రామీణ కార్మికులలో 90 శాతం నిరక్షరాస్యులు లేదా ప్రైమరీ స్కూలు వరకూ చదువుకున్నవారు.

నాయుడు హయాంలో ఉపాధి పెరుగుదల విపరీతంగా తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో ఆయన హయాం ప్రారంభం కావడానికి ముందు దశాబ్దిలో ఉపాధి పెరుగుదల సాలీనా 2.40 శాతం ఉండేది. 1994-2000ల ప్రాంతంలో అది 0.29కి పడిపోయింది. గ్రామీణ ప్రాంతంలో వేతనాల పెరుగుదల శాతం 1990లలో విపరీతంగా పడిపోయింది.

వేగంగా పెరిగే రాష్ట్రాలలో ఒకటిగా మీడియా అభివర్ణించిన రాష్ట్రం నిజానికి కుప్పకూలుతోంది. 1994-2000 లో జీడీపీ (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్) పెరుగుదల అయిదు శాతం. దక్షిణాది రాష్ట్రాలలో అతితక్కువ. జాతీయ సగటు కంటే తక్కువ. 1981-91లో కొన్ని రాష్ట్రాలు సాధించిన జీడీపీ పెరుగుదల కంటే తక్కువ. ఆర్థిక శాస్త్రవేత్తలు మహేంద్రదేవ్, సి. రవి చెప్పినదాని ప్రకారం: ‘‘1980లలో జీఎస్ డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్)పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ ముందుగా ఉండేది. రాజస్థాన్,హరియాణా, మహారాష్ట్రలు మాత్రమే 1980లలో జీఎస్ డీపీ పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ కంటే ముందు ఉండేవి.’’ అయితే, ఈ ర్యాంకు వచ్చే దశాబ్దంలో నాలుగు నుంచి ఎనిమిదో ర్యాంకుకు పడిపోయింది. ‘‘1990లలో ఆంధ్రప్రదేశ్ కంటే ఏడు రాష్ట్రాలు ఎక్కువ పెరుగుదల సాధించాయి. రాష్ట్రాన్ని గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ లు అధిగమించాయి.

మొదటి, రెండవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల ప్రకారం శిశు మరణాలలో (ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ –ఎంఎమ్ ఆర్) ప్రగతి చూపని ఒకే ఒక దక్షిణాది రాష్ట్రం ఏపీ. ఈ సర్వే ఫలితాలు 1990లలో వెల్లడైనాయి. ఆంధ్రప్రదేశ్ ఐఎంఆర్ (65) బీహార్ ఐఎంఆర్ (62) కంటే కొద్దిగా ఎక్కువ.

దేశవ్యాప్తంగా సన్నకారు రైతులు 1990లలో దెబ్బతిన్నారు. కానీ వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది ఆంధ్రప్రదేశ్ లోనే. రైతు వ్యతిరేక విధానాల వల్ల నష్టం ఇంకా కొనసాగుతూనే ఉంది.(నాయుడి నిష్క్రమణ అనంతరం కూడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రైతులకు మంచి చేయాలంటూ ఆయన అసెంబ్లీలో చేసిన ఉద్ఘాటనలో ‘కాఫ్కా బూటకపు నాటకీయత’ ఉన్నది.

ఇదంతా జరుగుతుంటే మీడియాలో నాయుడు భజన పెరుగుతూనే ఉన్నది. ఒక్క రవ్వంత అనుమానం లేదు. మీడియాలో నాయుడి జీవితం గురించి వచ్చిన వార్తలలో ఆయనను పేద రైతు లేదా సన్నకారు రైతు లేదా ఒక మోస్తరు రైతు బిడ్డగా అభివర్ణిస్తారు. తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత అంత చిన్నరైతు కొడుకు, ఆయన భార్య 21 కోట్ల రూపాయలకు ఎట్లా పడగలెత్తారో ఎవ్వరూ పరిష్కరించదలచుకోని విస్మయకరమైన సమస్య. ఎన్నికలలో నామినేషన్ దాఖలు చేస్తూ నమోదు చేసిన అంకె ఇది. కానీ ఎవ్వరూ ప్రశ్నించరు. రాజుగారు ఎన్నడూ తప్పు చేయడు.

పాలగుమ్మి సాయినాథ్

(కర్టెసీ: ద హిందూ)

అనువాదం: అడుసుమిల్లి జయప్రకాశ్, మాజీ శాసనసభ్యుడు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles