హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు మంగళవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టిందనీ, రైతు భరోసా పేరుతో ఐదేళ్లలో రైతుకు ప్రభుత్వం ఇచ్చేది రూ.37,500 మాత్రమేననీ, టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే అన్నదాత సుఖీభవ, రుణమాఫీ 4, 5 కిస్తీల కింద ఒక్కో రైతుకు రూ.1.15 లక్షలు చొప్పున వచ్చేవనీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు విపత్తు సహాయనిధి రూ.4 వేల కోట్లు ఇస్తామని రైతులను నమ్మించారనీ, అధికారంలోకి వచ్చాక మాట మార్చి మడమ తిప్పారనీ విమర్శించారు. హారన్ కొడితే జరిమానాలు విధించడం మరో తుగ్లక్ చర్య అంటూ చంద్రబాబునాయుడు విమర్శించారు. వరదల్లో నష్టపోయిన రైతుల వద్దకు వైసీపీ నాయకులు వెళ్లరనీ, వరద బాధితుల వద్దకు వెళ్లిన టీడీపీ నేతలపై కేసులు పెడతారనీ, ఇది వైఎస్ ఆర్ సీసీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి అనీ టీడీపీ అధినేత దుయ్యబట్టారు.