హైదరాబాద్ : పోలవరం ముంపు మండలాలను ఇవ్వాలని కేంద్రాన్ని కోరామనీ, ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిపారనీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు సోమవారంనాడు విడియో కాన్షరెన్స్ లో అన్నారు. పోలవరాన్ని పూర్తిచేస్తామని యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ. ఆర్‍అండ్‍ఆర్ ప్యాకేజీ ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందనీ, పోలవరం నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించాలని నీతి ఆయోగ్ సూచించిందనీ, నీతిఆయోగ్ సిఫార్సులతోనే పోలవరం పనులను రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందనీ తెలిపారు.
విద్యుత్ కేంద్ర ఖర్చుమాత్రమే రాష్ట్ర భరిస్తుంది
‘‘విద్యుత్ కేంద్రం ఖర్చు మాత్రం మేమే పెట్టుకుంటామని చెప్పాం. 2019లో సాంకేతిక సలహా కమిటీ రూ.55 వేల కోట్ల అంచనాలను ఆమోదించినట్టు ఎంపీలు పార్లమెంట్‍లో అడిగిన ప్రశ్నలకూ కేంద్రం చెప్పింది. ఇరిగేషన్ కాంపోనెంట్‍లోనే భూసేకరణ, ఆర్‍అండ్‍ఆర్ కలిసి ఉంటాయని కేంద్రం చెప్పింది. ఎవరు అడిగినా రూ.55,548 కోట్లకు ఆమోదించినట్లు చెప్పారు. 2005లో పనులు ప్రారంభమై 2014లో జాతీయ హోదా వచ్చింది. ప్రపంచంలో ఎక్కడా పోలవరం లాంటి ప్రాజెక్టు లేదు. భూసేకరణ, ఆర్‍అండ్‍ఆర్ మొత్తమే 77 శాతం పెరిగింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ నిర్మాణ వ్యయం పెరగడం సహజం. దేశంలో ఎక్కువ నీటి లభ్యత ఉన్న నది గోదావరిలోనే. తీవ్ర కరువుతో అల్లాడుతున్న రాయలసీమను రతనాల సీమగా మార్చాలని పోలవరంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. పోలవరం పూర్తయితే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించొచ్చు. పోలవరం పూర్తైతే ఐదేళ్లు వర్షాలు పడకపోయినా రైతులకు నీళ్లివొచ్చు – టీడీపీ హయాంలో పోలవరాన్ని 71 శాతం పూర్తిచేశాం – పోలవరంపై 2018 జూన్‍లో గడ్కరీకి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పా. పోలవరం పనులు బాగున్నాయని అప్పట్లో గడ్కరీ అభినందించారు,’’ అంటూ చంద్రబాబునాయుడు చెప్పారు.
అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
కృష్ణా-గోదావరి నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేననీ, పోలవరంపై అవగాహన లేకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారనీ, సున్నితమైన అంశంలోనూ వైసీపీ బాధ్యతారహితంగా వ్యవహరించిందనీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరంపై అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారనీ ప్రతిపక్షనేత దుయ్యపట్టారు. ‘‘సీఎం జగన్‍కు అవగాహన లేకపోతే పూర్తిగా తెలుసుకోవాలి. అవగాహనారాహిత్యంతో రాష్ట్రానికి నష్టం చేయొద్దు. వైసీపీ ప్రభుత్వ అరాచక వైఖరిని ఖండిస్తున్నా. సీఎం కేంద్రంతో మాట్లాడకుండా టీడీపీపై ఎదురుదాడి చేస్తున్నారు. సమస్య పరిష్కరించుకోకుండా సీఎం చెత్త లేఖలు రాస్తున్నారు. సరైన నిపుణులను పెట్టుకోండి. కేసీఆర్ సహకారంతో ప్రాజెక్టులు కడతామని జగన్ మొదట్లో హడావిడి చేశారు.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తట్లేదు. పోలవరం పట్ల రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రజలు స్పందించాలి.’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.