• రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులు
• నేలపై బైఠాయించి చంద్రబాబు నిరసన
• ట్విటర్ లో ప్రభుత్వంపై మండిపడ్డ చంద్రబాబు
చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. తన పర్యటన గురించి సంబంధిత అధికారులకు ముందే సమాచారం అందించానని ఎన్నికల సంఘం వద్ద అనుమతి కూడా తీసుకున్నానని చంద్రబాబు తెలిపారు. అయినా పోలీసులు వినకపోవడంతో విమానాశ్రయంలో నేలపై కూర్చునే చంద్రబాబు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎంతగా బ్రతిమలాడినా చంద్రబాబు వినలేదు. క్రింద కూర్చుంటే బావుండదు పెద్దవారు అని పోలీసులు వారించారు. లోపల కూర్చోమని పలుమార్లు పోలీసులు విజ్ఞప్తి చేసినా చంద్రబాబు వినలేదు. ప్రతిగా నేనేమీ పెద్దవాడ్ని కాదు అందుకేగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టారంటూ చంద్రబాబు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు.
చంద్రబాబుకు నోటీసులు :
చిత్తూరు జిల్లా పర్యటనకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద అనుమతి తీసుకున్నట్లు తమకు తెలియదని, చంద్రబాబు పర్యటన ఎన్నికల ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉందని పోలీసులు జారీచేసిన నోటీసుల్లో తెలిపారు. పర్యటనలో చంద్రబాబు వెంట ఆయన వ్యక్తిగత కార్యదర్శితోపాటు వైద్య అధికారి ఉన్నారు. వీరి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను పోలీసులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కలెక్టర్, తిరుపతి, చిత్తూరు ఎస్పీలకు తన పర్యటన అడ్డుకున్న తీరుపై వినతిపత్రం ఇచ్చి వెళ్తానని పోలీసులకు చంద్రబాబు తెలిపారు. అయితే అధికారులను కలిసేందుకు పోలీసులు నిరాకరించారు. ప్రతిపక్షనేతగా కలెక్టర్, ఎస్పీలను కలిసే హక్కు తనకు లేదా అంటూ చంద్రబాబు పోలీసులను ప్రశ్నించారు.
Also Read: ఉక్కు సంకల్పమే శరణ్యం
ట్విటర్ లో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం:
తనను ఎవరూ అడ్డుకోలేరని తన గొంతు నొక్క లేరని ట్విటర్ లో ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. భయపెడితే మౌనంగా కూర్చోమని అన్నారు. దౌర్జన్యం, భయభ్రాంతులకు గురిచేయడంద్వారా ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోలేరని ట్విటర్ లో ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు కురిపించారు.
టీడీపీ నేతల గృహనిర్భంధం:
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేశారు. పలమనేరులో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, తిరుపతిలో టీడీపీ నేత నర్సింహయాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలను పోలీసులు నిర్భంధించారు.
Also Read: మున్సిపల్ పోరుకు ఎస్ఈసీ సన్నాహాలు
తీవ్రంగా ఖండించిన టీడీపీ నేతలు:
మరోవైపు రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారన్న వార్త దావానలంలా వ్యాపించడంతో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబు పట్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కరోనా సాకు చూపి చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం విడ్డూరమని అన్నారు. ఓటమి భయంతోనే అధికార పార్టీ అడుగడుగునా టీడీపీ నేతలను శ్రేణులను అడ్డుకుంటోందని ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.