ఒకప్పుడు జన నీరాజనాలందుకున్న చందమామ, విజయా సంస్థల సృష్టికర్తలలో ఒకరు బి.నాగిరెడ్డి అయితే ఆ రెండవ వారు చక్రపాణి. బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడిగా ఇలా పలు పార్శ్వాలలో తన సేవలందించిన చక్రపాణి తెలుగు వారు సదా గుర్తుంచుకునే ధీశాలి.
బాలసాహితీవేత్తలకు మార్గదర్శి చందమామ. చందమామ మేధస్సు నుంచి పురుడు పోసుకున్నదే ‘చందమామ’ మాస పత్రిక. ఆ రోజుల్లో పలు భాషల్లో ‘చందమామ’ జనాన్ని ఎంతగా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటి తాతయ్యలు, అమ్మమ్మలు, నాన్నలు, అమ్మలు ప్రతీ ఒక్కరూ ఒకప్పుడు చందమామ పత్రికను చదివి ఉన్నారని చెప్పడానికి సాహసించనక్కర్లేదు. ఎందుకంటే ఆ పత్రిక అంతటి ప్రజాదరణ పొందింది. అలాగే, ‘చందమామ’ ఇంగ్లిష్ ప్రతి కోసం కళ్ళింతలు చేసుకొని బాలలు ఎదురుచూసిన రోజులూ కూడా ఆ కాలంలో ఉండేవంటే అతిశయోక్తి కానేరదు. ఇక చిత్రసీమలోనూ చక్రపాణి బాణీ భలేగా సాగింది. ‘చెక్కన్న’గా సినీజనం అభిమానం సంపాదించిన చక్రపాణి తన మిత్రుడు బి.నాగిరెడ్డితో కలసి ‘విజయా సంస్థ’ను నెలకొల్పి, తెలుగువారు మరచిపోలేని అనేక చిత్రాలను అందించారు.
చక్రపాణి అసలు పేరు ఆలూరి వెంకటసుబ్బారావు. గుంటూరు జిల్లా తెనాలిలో 1908వ సంవత్సరం ఆగష్టు 5 న ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో గురవయ్య, వెంకమ్మ దంపతులకు జన్మించారు. జాతీయోద్యమ ప్రభావానికి లోనై ఉన్నత పాఠశాల విద్యకు స్వస్తిచెప్పి యలమంచిలి వెంకటప్పయ్య దగ్గర హిందీ భాషను అభ్యసించారు.
‘చక్రపాణి’ పేరు ఎలా వచ్చింది?
ఆయనకు చిన్నతనం నుంచీ సాహిత్యం పట్ల అభిమానం ఎక్కువ. హైస్కూలు విద్య పూర్తయ్యాక హిందీ పాఠశాల ప్రారంభించారు. అనంతరం హిందీలోంచి తెలుగులోకి కథలను అనువదించారు. అప్పట్లో ఉత్తరాది పండితులు ప్రజానందశర్మ ఆ పాఠశాలను దర్శించి, సుబ్బారావు రచనా కౌశలాన్ని అభినందించి ‘చక్రపాణి’ అనే కలం పేరుతో రచనలు చేయమని సూచించారు. నాటినుంచీ ఆయన ‘చక్రపాణి’గా స్థిరపడి పోయారు.
1932లో చక్రపాణి టీబీ వ్యాధి బారిన పడ్డారు. ఆ వ్యాధికి చికిత్స తీసుకునే సమయంలోనే ఓ బెంగాలీ ద్వారా బెంగాలీ భాష నేర్చుకుని, ఆయన కలం నాటకాలూ పలికించింది. ఈ క్రమంలో చక్రపాణి ప్రతిభను గుర్తించిన దర్శకుడు పి.పుల్లయ్య తాను తెరకెక్కిస్తున్న ‘ధర్మపత్ని’ చిత్రానికి సంబందించిన స్క్రిప్టు పనులు అప్పగించారు. బి.యన్.రెడ్డి రూపొందించిన ‘స్వర్గసీమ‘కు కూడా చక్రపాణి రచయిత. సినిమాలకు రచన చేస్తూ, తన రచనలను పుస్తకాలు వేయిస్తూ ఉండేవారు చక్రపాణి. ఆ క్రమంలో బి.యన్.కె. ప్రెస్ నిర్వహిస్తున్న బి.యన్. రెడ్డి తమ్ముడు బి.నాగిరెడ్డి పరిచయమయ్యారు. అది కాస్తా గాఢ స్నేహంగా మారింది. ఈ ఇద్దరు మిత్రులు కలసి ‘విజయా’ సంస్థను నెలకొల్పి, విలువలుగల చిత్రాలను వినోదంతో నింపి మరీ ప్రేక్షకుల ముందుకు వదిలారు. ఇంకేముంది విజయావారి చిత్రాలను తెలుగు జనం విశేషంగా ఆదరించారు. జనాన్ని ఆకర్షించడం కోసం వెకిలి వేషాలు, అసభ్య సన్నివేశాలు, అశ్లీలపు చేష్టలు చేయించకుండా ఇంటిల్లి పాది కలసి సినిమాలు చూసేలా చేయాలని చక్రపాణి, నాగిరెడ్డి భావించారు. తొలి చిత్రం ‘షావుకారు‘ మొదలు చివరి సినిమా శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ వరకు ఆ ఇద్దరు మిత్రులు అదే తీరున కొనసాగారు.
విజయా సంస్థ ద్వారా తొలి ప్రయత్నంగా ‘షావుకారు’ (1950) చిత్రాన్ని ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి కథ, సంభాషణలు చక్రపాణి సమకూర్చారు. ఆరోజుల్లోనే ఈ సినిమా టైటిల్ కు ‘ఇరుగుపొరుగుల కథ’ అనే ట్యాగ్ లైన్ అమర్చారు. అయితే ఈ సరికొత్త భావాలను ప్రేక్షకులు ఆదరించలేకపోవడంతో ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. 1951 లో అఖండ విజయం సాధించిన ‘పాతాళ భైరవి’ చిత్రాన్ని నిర్మించారు. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు.
విజయా ప్రొడక్షన్స్ ఆ తరువాత మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, సి.ఐ.డి. అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన చిత్రాలు నిర్మించింది.
సినిమాలలో చక్రపాణిది ఓ విభిన్న శైలి. చిత్ర నిర్మాణంలోనూ ఆయన బాణి ప్రత్యేకంగా ఉండేది. “మనం తీసేది జనం చూడ్డం కాదు జనం కోరేది మనం తీయాలి” అనే ధోరణి ఆయనది. చిత్ర విజయానికి ఆయనకు కొన్ని కొలమానాలు ఉండేవి. చిన్న పిల్లలకు సినిమా నచ్చితే పెద్దవాళ్ళకూ తప్పకుండా నచ్చుతుందని ఆయన విశ్వాసం. గుండెలు బాదుకుని ఏడ్చే ఏడుపుల మీద గానీ, సినిమా పరిభాష లోని మేలోడ్రామా మీద గానీ ఆయనకు నమ్మకం లేదు. తీవ్రమైన సంఘటనల్లో కూడా సునిశితమైన హాస్యం లేకుండా ఆయన కల్పన ఉండేది కాదు. చిత్రం లోని ప్రతి శాఖనూ చాలా ప్రత్యేక శ్రద్ధతో గమనించడం, జనాన్ని రంజింపజేసేలా తీర్చి దిద్దడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా గ్రామీణ ప్రజలని ఆకట్టుకునేలా పాటలు ఉండాలని, ఆ పాటలు కూడా మెలోడి ప్రదానంగా ఉండాలని భావించి ఆ మేరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. ఆయన చేసిన ఆ కృషికి నిదర్శనంగానే ఇప్పటికీ ఆయన చిత్రాలలోని పాటలు ప్రేక్షకులను మైమరపిస్తూ ఉంటాయి.
1945 ప్రాంతాల్లో చక్రపాణిగారి నిర్వహణలో ‘ఆంధ్రజ్యోతి’ మాసపత్రిక చెన్నై వెలువడింది. ప్రముఖ రచనలతో ‘ఆంధ్రజ్యోతి’ సాహితీ లోకంలో సంచలనం సృష్టించింది. ‘యువ’ మాన పత్రిక చక్రపాణిగారి మానసపుత్రిక. ఎవరైనా ఆయన దగ్గరకు వెళ్ళి మీ ఆశీస్సులు కావాలంటే “నువ్వు కష్టపడు. ఎవరి ఆశీస్సులు అక్కర్లేదు పైకొస్తావ్. అది లేనప్పుడు ఎందరు ఆశీర్వదించినా ఫలితం శూన్యం” అనేవారు. ఈ ఒక్కమాట చాలు ఆయన ఆంతర్యాన్ని అంచనా వేయటానికి. తన యూనిట్లో ఎవరింట్లో యే శుభకార్యం జరిగినా స్వయంగా వెళ్లి చేయగల సహాయాన్ని గుప్తంగా అందజేసిన సౌమ్యుడు చక్రపాణి.
‘మిస్సమ్మకథ’ను అటుఇటుగా మార్చి, ‘శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్‘ రూపొందించాలనుకున్నారు. బాపును తన కో-డైరెక్టర్ గా నియమించుకున్నారు. ఆ సినిమా మొదలయిన కొద్ది రోజులకే చక్రపాణి సెప్టెంబరు 24, 1975 న కన్నుమూశారు. తరువాత బాపు నిర్దేశకత్వంలో ‘శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్‘ రూపొందింది. ఆ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. చక్రపాణి (చెక్కన్న) మరణం నాగిరెడ్డిని ఎంతగానో కలచివేసింది. ఆ తరువాత నాగిరెడ్డి కూడా చిత్రనిర్మాణం సాగించలేదు. నాగిరెడ్డితో కలసి చక్రపాణి నెలకొల్పిన విజయా సంస్థ, విజయావాహినీ స్టూడియోస్, డాల్టన్ పబ్లికేషన్స్ అన్నీ కాలగర్భంలో కలసి పోయాయి. అయినప్పటికీ చక్రపాణి చేసిన చిత్రాలు, రాసిన రాతలు, చేసిన తలపులు ఎప్పటికీ జనం మదిలో నిలచే ఉంటాయి.
(సెప్టెంబరు 24న చక్రపాణి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం)
దాసరి దుర్గా ప్రసాద్