Thursday, November 21, 2024

కెందామరనేత్రుడు శంఖచక్రధరుడు ఆజానుబాహుడు

మాడభూషి శ్రీధర్ తిరుప్పావై 14

ఉజ్ఞళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెజ్ఞరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెజ్ఞల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తజ్ఞళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎజ్ఞళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నజ్ఞాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శజ్ఞొడు చక్కరం ఏందుం తడక్కైయం
పజ్ఞయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

పెరటి మడుగులోన చెందమ్మికమలాలు కలిసి విరిసె

నల్లకల్వలు నీవు రావని ముకుళించి మూతిముడిచె

ధవళదంతుల మునులెల్ల తలుపుతెరువ బీగాలతో

కాషాయధారులు శంఖమ్ములూద గుడులకరిగినారు

మమ్మెలేపదమన్న మాట మరిచి నిద్రపోయెదవేల

కెందామరనేత్రుడు శంఖచక్రధరుడు ఆజానుబాహుడు

ఆకాశవర్ణునికి ఆరాధనలు జేసి మంగళమ్ములు పాడ

కదలిరావమ్మ కమలాక్షి కలిసి కృష్ణవ్రతముజేయ

అర్థం

ఉజ్ఞళ్ = మీ యొక్క, పురైక్కడై త్తోట్టత్తు = పెరటితోటలో, వావియుళ్ =కొలనులో,
శెజ్ఞరునీర్ వాయ్ నెగిర్ అంద్ = ఎర్రతామరలు వికసించి, ఆమ్బల్ వాయ్ కుమ్బిన =నల్లకలువలు ముకుళించుకుని ఉన్నాయి. కాణ్= చూడు, శెజ్ఞల్పొడి క్కూరై = కాషాయవస్త్రాలు ధరించిన వారు, వెణ్బల్ =తెల్లని పలువరస గల వారు, తవత్తవర్ =తపసులు, తజ్ఞళ్ తిరుక్కోయిల్ = తమ దైవ సన్నిధిలో, శంగిడువాన్ =శంఖం మోగించడానికి, పోగిన్ఱార్= వెళ్తున్నారు. ఎజ్ఞళై =మమ్మల్ని, మున్నం ఎరుప్పువాన్ = ముందుగానే వచ్చిలేపుతానని, వాయ్ పేశుమ్= నోటితో చెప్పిన, నజ్ఞాయ్! =ఓ పరిపూర్ణురాలా, ఎరుందిరాయ్ = లేచిరమ్ము, నాణాదాయ్! =సిగ్గులేనిదానా, నావుడైయాయ్= తీయని మాటలు గుప్పించే నాలుకగలదానా, శజ్ఞొడు చక్కరం = శంఖ చక్రాలను ఏందుం = ధరించిన, తడక్కైయం = దీర్ఘబాహువులు గలవాడునూ, పజ్ఞయ క్కణ్ణానై = ఎర్రతామరలను పోలిన కన్నులు గలవాడు అయిన సర్వేశ్వరుని, ప్పాడ= స్తుతించడం.

Also read: రాకాసిరాజు రావణు పదితలలు గిల్లివేసె రామమూర్తి

చెలికత్తెలమైన మమ్ములని ముందుగానే లేపుతానని మీనోటితోనే చెప్పిన పరిపూర్ణురాలా, సిగ్గులేనిదానా, తీయని మాటలుచెప్పే నాలికగలదానా, మీ ఇంటి పెరటిలోని తోటలో బావిలోన ఎర్రతామరలు విరిసినవి. నల్లకలువలు ముకుళించినవి. ఎర్రని జేగురు రాళ్లపొడితో రంగు అద్దబడిన కాషాయవస్త్రములను దాల్చి, తెల్లి పలువరుసలు గల సన్యాసులు తమ దేవాలయములకు కుంచెకోల పట్టుకుని ఆరాధనకై వెళ్తున్నారు. మాకొరత తీర్చుము. లెమ్ము. శంఖ చక్రములను ధరించిన విశాల బాహువక్షము కలిగిన పుండరీకాక్షుని కీర్తించుటకు రమ్ము.


భావార్థము
బయట ఉన్నగోపికలు: నీగుమ్మం ముందు నిలబడి ఉన్నాం మేము. నీవు ఇంకా బయలుదేరి బయటకు రావడం లేదేమి?

లోని గోపిక: తెల్లవారి పోయిందా?

బ.గో: ఎర్రతామరలు విరిసినాయి, నల్లకలువలు ముకుళించాయి కనిపించడం లేదా?
లోని గోపిక: మీరు నా భవనానికి వచ్చిన ఆనందంతో మీకన్నులు వికసించాయి. నేను ఏమీ మాట్లాడకపోవడం వల్ల కోపంతో మీ నోళ్లు మూసుకుపోయినాయి. ఇవే మీరు వికసించిన తామరలు, ముకుళించిన నల్లకలువలు అంటున్నారు.
బ.గో: బయట ఉన్న పూవులే కాదు లోపల తోటలో కూడా పుష్పాలు వికసిస్తున్నాయి. మరికొన్ని ముడుచుకుంటున్నాయి.

లో.గో: మీరు తోటంతా తిరుగుతూ వికసించే వాటిని వికసింపజేస్తున్నారు. ముడుచుకునే వాటిని ముడుచుకునేట్లు చేస్తున్నారు.

బ.గో: మేముదిగడానికి వీలుకానంత లోతున్న కొలనులో ఉన్న పుష్పాలను మేమెలా వికసింపజేస్తాం? మరికొన్నిటిని ముడుచుకునేలా చేయగలమా? వాటంతట అవే జరుగుతున్నాయి.
లో.గో: మీ కళ్లు నోళ్లు ప్రతిఫలించే కాంతులే అవి, నిజమైన పూలు కావు.
బ.గో: సరే నీవే వెళ్లి చూడు.

Also read: రాముడు ‘‘నేడు పోయి రేపురా’’ అని, రావణుడుతో బతికించి పోయాడు

లో.గో. పూలు వికసించినా ముకుళించినా అవి మీవల్లనే. మీరు ఘటనాఘటన సమర్థులైన భగవంతుని సంబంధీకులు కనుక మీరు చేయలేనిదేమీలేదు.

బ.గో: సూర్యరశ్మి పడకపోయినా కొన్ని పూలు కొలనులో వికసిస్తున్నాయి. కొన్ని ముడుచుకుంటున్నాయి. అచేతనములైనవే యథానుసారంగా విధులు నిర్వర్తిస్తుంటే చేతనమైన నీవు ఊరకే పడుకోవడం ధర్మం కాదు.


అంతరార్థం:

ఈ శరీరమే ఒక తోట. నాడీమండలము చైతన్యప్రసరణమార్గము. నాడీమండలము వెన్నుపూసలో ఉంటుంది. ఇది దిగుడు బావి. తామరపూవులంటే నాడీ చక్రములు. మూలాధారము, స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము. కలువలని అంటే ఇంద్రియములు. ఇంద్రియములు ముడుచుకున్నాయి. తోట అంటే అష్టాక్షరీ మంత్రం. మధ్యలో గల బావి నమః అనేది. తామరపూవు అంటే పారతంత్ర్యము. కలువపూవు అంటే స్వాతంత్ర్యము. జేగురు రాయి అంటే విషయములందు ఆసక్తి గల మనసు. విషయరాగమే ఎరుపు. పొడిచేయడమంటే భగవత్పారతంత్ర్యమును తెలియజేయడమే. భగవత్సంబంధముగల పదార్థములను కలుపుట నీటిలో కలపడం, భగవత్పారతంత్ర్యము భగవత్ప్రీతి విభూతి యందు ప్రతి గల మనసు గలిగి యుండుట కాషాయ వస్త్రధారణ. తెల్లని పలువరుస ఆహార శుద్ధిని వాక్ శుద్ధినీ సూచిస్తుంది. సన్యాసులంటే ప్రపన్నులు. తనకు కలిగిన భగవదనుభవమును దాచుకొనకుండా చెప్పడమే సిగ్గులేకుండా ఉండడం. పరిపూర్ణత సాధించి శిష్యులకు మనోరంజకంగా చెప్పడమే మాటనేర్పు. శంఖం అంటే ప్రణవం, చక్రమంటే సుదర్శనము, భగవంతుడిని చక్కగా చూపేది. కుంచెకోల అంటే ఆచార్యజ్ఞాన ముద్ర. జ్ఞాన ముద్ర అంటే చూపుడు వేలు బొటనవేలుతో చేర్చి, మూడు వేళ్లు దూరముగా ఉంచడం. బొటన వేలు భగవంతుడు. చూపుడు వేలు అంటే జీవుడు. మూడువేళ్లు అంటే గుణత్రయం. మూడుగుణాలు దూరమైతేనే జీవుడు భగవంతుడు చేరుననడమే జ్ఞాన ముద్రలోని సందేశం. శంఖ చక్రములను భుజాలపైన దాల్చిన ఆచార్యులే మనకు ఆశ్రయించదగిన వారు అని కందాడై రామానుజాచార్య వివరించారు.

తిరుప్పాణియాళ్వార్ ను మేలుకొలిపే పాశురం ఇది.  ఇందులో మాట నేర్పరితనం, ప్రమాణాలద్వారా జ్ఞానం సంపాదించడం ప్రస్తావనకు వస్తాయి.

         తిరుప్పాణియాళ్వార్ ను అనుసంధించడం ఈ పాశురంలో సాగుతుంది. నంగాయ్ గుణపరిపూర్తి, నాణాదాయ్ అహంకారం లేకుండా ఉండడం. పదిపాశురాలలో అన్ని వేదాలను ప్రతిపాదించిన గంభీరార్థములు వివరించిన వేదాంత దేశికులు ప్రస్తుతించారు గనుక వీరు నాలుకగలవారు కనుక నావుడయాయ్ అనీ అనవచ్చు. ఈ పాశురంలో శ్రీమన్నాథమునయేనమః అని అనుసంధానంచేసుకోవాలి. మనసులోలేని దానికి నోటితో చెప్పకూడదు. చెప్పినవాటిని చేయకుండా ఉండరాదు. జ్ఞానం అనుష్టానం రెండూ ఒకటి కావాలి. శ్రీమన్నాథమునయేనమః ఈ రోజు గురుమంత్రం.

యథార్థం తెలుసుకోవడానికి సాధనాలను ప్రమాణములు అంటారు. అవి మూడు రకాలు. ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. ఇంద్రియములచేత విషయములను అనుభవించడం ద్వారా తెలుసుకోవడం ప్రత్యక్షం. కంటితో ఒక వస్తువును చూడడం, చెవితో వినడం,  ముక్కుతో వాసన చూడడం. తాకి తెలుసుకోవడం, నాలుకతో రుచి చూడడం వంటివి. కార్యమును చూసి కారణాన్ని తెలుసుకోవడం అనుమానం. పొగ నిప్పుఉంటేనే వస్తుంది. పొగను చూచి నిప్పు ఉందనుకోవడం అనుమాన జ్ఞానం.  ఆప్త్డుడైన వ్యక్తి చెప్పిన మాట విని తెలుసుకోవడం శబ్ద జ్ఞానం. భ్రమ ప్రమాదములు లేకుండా మన మేలు కోరి చెప్పేవాడు ఆప్తుడు. అసలు భ్రమ ప్రమాదములు లేని వారు ఉంటారా? సర్వజ్ఞుడైన సర్వేశ్వరుడి అనుగ్రహముతో జ్ఞానం పొందిన మహాపురుషులే ఆప్తులు. వారినుంచి వెలువడిన శృతి స్మృతి అనేవి శబ్దప్రమాణాలు. ఈ మూడు ప్రమాణాలతో తెల్లవారినదని తెలుసుకున్నామని అంటున్నారు గోపికలు.

హనుమ ప్రతిభ తెలిసిన రాముడు

రామాయణంలో ఆంజనేయుడిని మొదటిసారి కిష్కిందలో కలిసిన సమయంలో, ఆయన మాట నేర్పరితనాన్నిశ్రీ రాముడు గుర్తించి లక్ష్మణుడికి వివరించే సన్నివేశం ఉంటుంది. ఈతడు రుగ్వేదము, యజుర్వేదము, సామవేదమే కాకుండా మొత్తం వ్యాకరణాన్ని తప్పక అధ్యయనం చేసినవాడని అనిపిస్తున్నది. లేకపోతే ఇంత ఔచిత్యంతో మాట్లాడలేడు కదా అంటాడు శ్రీరాముడు. ఆంజనేయుడి నేర్పరితనం మరొకసారి లంకలోని అశోకవనంలో వ్యక్తమవుతుంది. సీతమ్మకు మాత్రమే వినిపించేట్లు, అదీ ఆమెను అలరించే ధోరణిలో రామకథను హనుమ సంక్షిప్తంగా కావలసినంత మేరకు మాత్రమే చెప్తారు. ఆమె చెవికి ఇంపుగా ఉంటుంది. ఇతరులకు వినిపించదు.

తను శ్రీరామునితో ఉన్నంత వరకు తెలిసిన కథను ముందువినిపించి, అవుననిపించుకున్నతరువాత, ఆమె అపహరింపబడిన తరువాత సంగతులను వివరించి ఆమెకు తాను మిత్రుడినని నిరూపిస్తాడు హనుమ. అందుకు పాండిత్యము, మాధుర్యము కూడా ఉండాలి. గోపికలు కూడా అదే విధమైన పాండిత్యం మాధుర్యంతో సంభాషిస్తున్నారు.

Also read: ఆమె మరో సీత – గోదాదేవి

శంఖ చక్రధరుడైన శ్రీ కృష్ణుడిని గోపికలు కీర్తిస్తున్నారు. పుట్టే యపుడే చతుర్భుజాలు శంఖు చక్రాలు ఎట్టు ధరియించెనే ఈ కృష్ణుడూ అని అన్నమయ్య వర్ణిస్తాడు.శ్రీకృష్ణుడు చతుర్భుజాలతో శంఖ చక్రాలతో జన్మిస్తే ఆశ్చర్యపోయి చూసిన దేవకీ వసుదేవులు, శత్రువులు ఎక్కడ గమనిస్తారో అని ఆందోళన పడితే, వాటిని మరుగు పరుస్తాడు. అయితే ఆతరువాత యశోదకు, ప్రియమైన గోపికలకు కూడా ఆయన చతుర్భుజాలతో కనిపిస్తాడట. శంఖమంటే గోపికలకు చాలా ఇష్టం. శంఖం ఎప్పుడూ శ్రీకృష్ణుడి చేతిలోనే ఉంటుంది. అధరాలను తాకుతూ ఉంటుంది. అతను ఊదే గాలితో పలుకుతూ ఉంటుంది. అదే విధంగా గోపికలు కూడా శ్రీకృష్ణ హస్త, అధర సంస్పర్శనము కోరుకుంటూ ఉంటారట. శంఖము ప్రణవస్వరూపము. దూరంగా ఉన్నవారికి కూడా శంఖ నాదంతో తాను అక్కడ ఉన్నట్టు తెలియజేస్తాడు. ఆవుల మంద వదిలి దూరంగా పోయిన ఆవులను శంఖ నాదంతో పిలుస్తాడు. దూరమైన జీవులను దరిచేర్చేది శంఖమే. విరోధులకు గుండెలదిరేట్టు చేసి దూరం చేసేదీ శంఖమే.

విష్ణోర్ముఖోత్థానిల పూరితస్యయస్యధ్వనిర్దానవ దర్పహంతాం, తం

పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అని వేదాంత దేశికులు కీర్తిస్తారు. ఇక పరమాత్ముడిని బాగుగా దర్శనము చేయించేది  సుదర్శన చక్రం. ఆయన సంకల్పిస్తే చాలు దూరంగా వెళ్లి శత్రువులను దునుమాడి తిరిగి వస్తుంది. దూరం ఉన్న ఆప్తులను దరికి రప్పించేశంఖాన్ని, దూరాన ఉన్న శత్రువులను తరిమి కొట్టే చక్రాన్ని, ఆ శంఖ చక్రాలను ధరించిన బాహుయుగళం గల వాడిని ప్రేమిస్తున్నారు గోపికలు. దూరంనుంచే దరిజేర్చి ఉద్ధరించి, ఆలింగనం చేసుకునే దీర్ఘబాహువులు కలిగిన ఆజానుబాహుడిని, చూడగానే కన్నులతోకనికరించి ఊరట కలిగించే ప్రసన్న నేత్రుడైన పుండరీకాక్షుడిని కీర్తిస్తున్నారు.

Also read: మోహన మురళీ కృష్ణు ముద్దుల జవరాల నిదుర ఇంకేలనమ్మ

మేలుకొలుపుల వెనుక వేద రహస్యాలు


జీయర్ స్వామి వివరణ: మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కో వేద రహస్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వార వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం , వేదం (లేక శబ్దం లేక ఆప్తవాక్యం) ఈ మూడు మన ప్రమాణాలు. ఈమూడు ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్ళే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక. అందుకే మనం వేద మర్గాన్ని విశ్వసిస్తాం. వేదమార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహా భారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపలగోపబాలిక గొప్ప ప్రామాణికురాలు మంచిగా మాట్లాడగలదు కూడా, అందుకే మన ఆండాళ్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి అయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోప బాలికను కూడా లేపడం ప్రారంభించింది.

గోదమ్మ చరణాలకు శరణు

Also read: కిరీట, తులసీ దామపరిమళాలు జిమ్ము నారాయణుండు

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles