బ్రాహ్మణులు బ్రహ్మ ముఖంనుండి పుట్టారన్నారు. శరీరంలో తల, ముఖం ఆలోచనకు, భావ ప్రకటనకు ప్రతీకలు. అంటే ఆలోచించగలిగి నలుగురికి మంచి చెడు చెప్పగల వారు, బ్రహ్మను ఆనుసరించే వారే బ్రాహ్మణులు. వారు సమాజానికి తల లాంటి వారు. ధర్మ నిర్ణాయకులు, గురువులు.
భుజాలు బలానికి ప్రతీక. భుజాలనుండి పుట్టినట్లుగా చెప్పబడిన క్షత్రియులు ప్రజా రక్షకులు. బలంతో, శౌర్యంతో ధర్మ నిర్ణాయకులైన బ్రహ్మణుల ఆదేశాల మేరకు ప్రజలను నియంత్రించే ధర్మ నిర్వాహకులు.
ప్రజలందరికి అవసరమైన ప్రాణశక్తి నందించే ఆహార సృష్టికర్తలు వైశ్యులు. వ్యవసాయం, పశుపోషణ వృత్తిగాగల వీరు సమాజానికి ఆర్ధికభద్రత కలిగించే భాగ్య విధాతలు. సమాజాన్ని సజావుగా నిలిపే వీరు తొడలలాంటి వారు కాబట్టి తొడలనుండి పుట్టినట్టుగా చెప్పబడ్డారు.
సమాజం నడవడానికి అన్ని వృత్తులవాళ్ళు అవసరం. పాదాలనుండి పుట్టినట్లుగా చెప్పబడే శూద్రులు లేనిదే సమాజం నడవలేదు. పాదాలు సమాజ గతిశీలతకు శూద్రుల తోడ్పాటుకు ప్రతీక.
ముఖ్యమైన విషయ మేమిటంటే ఈ నాలుగు వర్ణాల్లో ఎక్కువ తక్కువలు లేవు. తల, భుజాలు, తొడలు, పాదాలని ప్రతీకలు (symbols) గా కాక శరీర భాగాలుగా పొరపాటు పడినప్పుడే వాటి స్థానాలను బట్టి ఎక్కువ తక్కువలు కనిపిస్తాయి. పదాల వెనుకనున్న అర్ధం గమనించినపుడు మనుషులలో, వృత్తులలో సమానత్వం తెలుస్తుంది.
గీతలో కృష్ణుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చతుర్వర్ణాలను గుణాన్ని బట్టి, కర్మను బట్టి నేనే సృష్టించాను అన్నాడు. ఇదే విషయాన్ని మనువు శరీర భాగాలను ప్రతీకలుగా వాడి వివరించడం అపార్ధాలకు అవకాశమిచ్చింది.