- హేమాహేమీల సరసన జో రూట్
- కెరియర్ లో 20వ సెంచరీ
ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 2021 క్రికెట్ సీజన్లో వరసగా మూడో సెంచరీతో చెలరేగిపోయాడు. శ్రీలంక సిరీస్ లో డబుల్ సెంచరీ బాదిన రూట్ భారత్ తో టెస్టు సిరీస్ తొలిటెస్టు తొలి రోజు ఆటలోనే మూడంకెల స్కోరు సాధించాడు. తన కెరియర్ లో 1వ, 50 వ టెస్టుమ్యాచ్ లు భారతగడ్డపైనే ఆడిన రూట్ 100వ టెస్టును సైతం భారత్ ప్రత్యర్థిగా భారత గడ్డపైన ఆడటమే కాదు సూపర్ సెంచరీతో చిరస్మరణీయం చేసుకొన్నాడు. ఇంగ్లండ్ 3 వికెట్లకు 263 పరుగుల స్కోరు సాధించడంలో ప్రధానపాత్ర వహించాడు.
30 సంవత్సరాల రూట్ సెంచరీ సాధించడానికి 164 బంతులు ఎదుర్కొన్నాడు. ఇందులో 12 బౌండరీలు సైతం ఉన్నాయి. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి రూట్ 14 బౌండరీలు, ఒక సిక్సర్ తో 128 పరుగుల నాటౌట్ స్కోరుతో నిలిచాడు. తన వందో టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన 9వ క్రికెటర్ గా రికార్డుల్లో చోటు సంపాదించాడు. గతంలో ఇదే ఘనత సాధించిన క్రికెట్ దిగ్గజాలలో కోలిన్ కౌడ్రే, జావేద్ మియాందాద్, గార్డన్ గ్రీనిడ్జ్, అలెక్ స్టివార్ట్, రికీ పాంటింగ్ , ఇంజమాముల్ హక్, గ్రీమ్ స్మిత్, హషీం ఆమ్లా ఉన్నారు.
Also Read: భారత గడ్డపై అతిపెద్ద టెస్ట్ సమరం
నాగపూర్ వేదికగా భారత్ ప్రత్యర్థిగా 2012లో టెస్టు అరంగేట్రం చేసిన రూట్ తన 50 టెస్టును విశాఖలోని ఆంధ్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఆడాడు. తన వందోటెస్టుమ్యాచ్ ను చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆడటం విశేషం. అంతేకాదు తన 98, 99 టెస్టుల్లో శ్రీలంక ప్రత్యర్థిగా శతకాలు బాదిన రూట్ 100 వ టెస్టులో భారత్ ప్రత్యర్థిగా సెంచరీ చేయడం ద్వారా తనజట్టును పటిష్టమైన స్థితిలో నిలిపాడు.
Also Read: జో రూటే సెపరేటు