కృష్ణాజల వివాదం – 2
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య కృష్ణా,గోదావరి నదీజలాల అసమాన పంపిణీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు యాభై సంవత్సరాలు పోరాడారు. నీటి కేటాయింపులో జరుగుతున్న అన్యాయం గురించి ఫిర్యాదు చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ ఉపప్రాంతానికి రాజ్యాంగ హోదా లేదు. అదుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాదం బలం పుంజుకున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్టం డిమాండ్ వెనుక రాజ్యాంగపరమైన అవసరం ఉన్నదని నేను వ్యక్తిగత హోదాలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఎదుట నివేదించాను. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి (జస్టిస్ శ్రీకృష్ణ), లా విశ్వవిద్యాలయం (నల్సార్ వీసీ ప్రొఫెసర్ రన్బీర్ సింగ్)ఉపకులపతి ఈ విషయమై నన్ను అనేక ప్రశ్నలు అడిగారు. రాజ్యాంగం ప్రకారం అంతర్ రాష్ట్ర నదీజాలాల వివిదాన్ని ప్రస్తావించే హక్కు రాష్ట్రప్రభుత్వాలకు మాత్రమే ఉంది. తెలంగాణ అప్పుడు రాష్ట్రం కాదు కనుక, ఉపప్రాంతమే కనుక కృష్ణా లేదా గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యూనల్ కు నివేదించే అవకాశం సాంకేతికంగా లేకుండా పోయింది.
ఫిర్యాదు చేసే హక్కు తెలంగాణకు ఇదివరకు లేదు
ఎగువ రాష్ట్రాలకు నదీ జలాలను దుర్వినియోగం చేస్తున్నాయని ఫిర్యాదు చేసే హక్కు రాష్ట్రాలకు మాత్రమే ఉంది. ఎగువ రాష్ట్రాలు తెలంగాణకు రావలసిన నీటిని రానివ్వడం లేదనే అంశాన్ని అంతర్ రాష్ట్ర వివాదాల ట్రిబ్యూనల్ సమావేశాలలో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నడూ ప్రస్తావించలేదు. ఒక వేళ ఇందుకు సంబంధించిన కేసు విచారణకు లేదా చర్చకు వచ్చినప్పటికీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడవలసిందిగా సదరు ఇంజనీర్లను కానీ ప్రవీణులను కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నడూ ఆదేశించలేదు. తెలంగాణ నీటిపారుదల అవసరాలే కాదు తాగునీటి అవసరాలను కూడా పట్టించుకోకుండా అంతర్గత పంపిణీ జరిగేది. ఈ విషయాన్ని ఏ వేదికపైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ప్రస్తావించదు. తెలంగాణ నాయకులు ప్రస్తావించడానికి రాజ్యంగం అంగీకరించదు. ఎక్కువ మంది ఇంజనీర్లు ఆంధ్ర ప్రాంతంవారు కావడం వల్ల తెలంగాణ వ్యతిరేకత ఉండేది. పత్రికలు చూపించే పక్షపాతం సరేసరి. హైదరాబాద్ లో స్థిరపడినవారు కూడా తమ పూర్వీకుల ప్రాంతాలకు నీరు వెడుతోంది కదా అని మౌనంగా ఉండేవారు. ఈ విషయంలో సోదరభావం కానీ, సమానభావన కానీ లేకపోవడంతో ఆవేశకావేశాలు పెరిగేవి, ఆగ్రహం తన్నుకొచ్చేది, ప్రత్యేకవాదం బలపడేది. పత్రికలలో, టీవీలలో, సినిమాలలో తెలంగాణ భాషను పరిహసించడం నిప్పులో ఆజ్యంగా పని చేసింది. నీటిలో సమాన వాటా లేకుండా, నియామకాలలో, నిధులలో పక్షపాత ధోరణి అవలంబించడం ఉద్యమం ఉధృతం కావడానికి దారితీసిన కారణాలలో కొన్ని ప్రధానమైనవి. పోలీసు కాల్పులలో కానీ ఆత్మహత్యల ద్వారా కానీ చాలామంది ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణకు అన్యాయం
కృష్ణానది డెబ్బయ్ శాతం తెలంగాణలో ప్రవహిస్తున్నప్పుడు కృష్ణాజలాలలో యాభై శాతం కంటే తక్కువ వాటా ఎందుకు రావాలి? సమానత్వానికి సంబంధించిన మామూలు ప్రశ్న ఇది. రాజ్యాంగంలోని 21వ, 14వ అధికరణలు స్పష్టం చేస్తున్న సమానత్వ సూత్రమిది. జీవించే హక్కు, నీటి హక్కు రెండూ ప్రాథమికమైనవి. జలవివాదాలను ట్రిబ్యూనళ్ళు పరిష్కరించవచ్చును. సమానత్వ సూత్రం, జీవించే హక్కు దెబ్బతిన్నప్పుడు కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని వాదించడం పూర్తిగా అసంగతమైనది, న్యాయపాలనకు వ్యతిరేకమైనది. ఇదీ రెండు నదుల పరీవాహక రాష్ట్రాల మధ్య నీటి వాటాను తిరిగి నిర్ణయించమని కోరడానికి ఉన్న నేపథ్యం. దీనిని కాదనడం అసంబద్ధమైన, నిర్హేతుకమైన నిర్ణయం.
జలశక్తి మంత్రిత్వశాఖ (నీటి వనరుల, నదుల అభివృద్ధి, గంగ పునరుద్ధరణ విభాగం) దిల్లీ నుంచి 15 జులై 2021న ఎస్.వో. 2842 (ఇ) తో ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్రమైన ఇబ్బందులకు కలుగుతాయి. ట్రిబ్యూనళ్ళూ, మేనేజ్ మెంట్ బోర్డులూ ఏర్పడిన ఏడు దశాబ్దాల తర్వాత కేంద్రం వాటి హద్దులను నిర్ణయించింది. హద్దులు నిర్ణయించడం అంటే మొత్తం నదులనూ, జలవిద్యుత్ కేంద్రాలతో సహా సొంత పరిధిలోకి తీసుకోవడం. నదులపైనా, విద్యుత్ కేంద్రాలపైనా నియంత్రణను తీసుకోవడమే కాదు మొత్తం ఆస్తిపాస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లాక్కోవడం, రివర్ మేనేజ్ మెంట్ బోర్డుల పేరుమీద కేంద్రానికి దఖలు పరచడం.