Sunday, December 22, 2024

విశాఖ ఉక్కు కర్మాగారం దక్కేనా?

  • తెన్నేటి విశ్వనాథం వంటి నేత ఏడీ?
  • ప్రైవేటుపరం చేయాలన్నదే కేంద్రం పట్టు
  • నష్టాలు వస్తున్నాయన్నది ఒక సాకు మాత్రమే

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం స్థిరమైన నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా వంతుల వారీగా అడుగులు వేస్తోంది. రేపో మాపో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయమనే మార్కెట్ వర్గాలు అంటున్నాయి.   ప్లాంట్ యధాతథంగా ప్రభుత్వ రంగ సంస్థగానే నడవాలన్నది కార్మిక సంఘాలు, ఉద్యోగులతో పాటు యావత్తు తెలుగువారంతా కోరుకుంటున్న అంశం. గతంలో కేంద్ర ప్రకటన వెలువడిన వెంటనే కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఉద్యమబాట పట్టాయి. బిజెపి తప్ప మిగిలిన రాజకీయ పార్టీలన్నీ  సంఘీభావం తెలిపాయి. ఉద్యమంలో పాల్గొన్నాయి.  ప్రారంభంలో బిజెపికీ చెందిన స్థానిక నేతలు,ఎమ్మెల్సీ మాధవ్ వంటివారు కార్మికులకు మద్దతుగా గళం విప్పారు. జనసేన స్థానిక నేతలు కూడా పాల్గొన్నారు. ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక’ కూడా నిర్మాణమైంది. విశాఖపట్నం కేంద్రంగా ఉద్యమాలు ఇంకా కొన సాగుతూనే ఉన్నాయి.  ఉభయ సభల్లో అన్ని పార్టీల ఎంపీలు గళాన్ని విప్పుతూనే ఉన్నారు.

Also read: పద్మపురస్కారం పరవశించిన రోజు!

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరంచేయకుండా లాభాల్లో ఎలా నడపాలో వివరిస్తూ ప్రధానమంత్రికి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పర్యాయాలు లేఖలు రాసింది. అందులో ప్రత్యామ్నాయ మార్గాలను చూపించింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విన్నవించారు. దేశంలోని అనేకమంది నిపుణులు ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా లాభాలబాట పట్టించవచ్చో వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు సమర్పించారు.  దేశ రాజధానిలో అపూర్వ రీతిలో రైతు ఉద్యమం నిర్వహించిన రైతు సంఘాల అగ్రనేత రాకేష్ సింగ్ టికాయిత్ బృందం విశాఖపట్నం వచ్చి ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నది. జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్ నేతలు సంజీవ్ రెడ్డి వంటివారు విశాఖపట్నం తరలి వచ్చారు.  తెలంగాణ మంత్రి,టీ ఆర్ ఎస్ అగ్రనేత కె టీ ఆర్, మెగాస్టార్ చిరంజీవి వంటి అనేకమంది పెద్దలు ఉక్కు కార్మికులకు తమ మద్దతును ప్రకటించారు. టిడిపి శాసన సభ్యుడు,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన శాసన సభ సభ్యత్వానికి రాజీనామా కూడా సమర్పించారు. విశాఖపట్నంతో పాటు విజయవాడ మొదలైన ప్రాంతాల్లోనూ ఆందోళనలు జరిగాయి. ఉక్కు పరిశ్రమ తరలిపోకుండా చూస్తానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాజాగా ప్రకటించారు. ఇలా అనేక రూపాల్లో,అనేక తఫాలుగా ఆందోళనలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా బుధవారం నాడు పార్లమెంట్ లో మళ్ళీ స్టీల్ ప్లాంట్ అంశం ప్రస్తావనలోకి వచ్చింది. టిడిపి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని  మాట్లాడారు. గనులు కేటాయిస్తే లాభాల్లోకి వస్తుందని రామ్మోహన్ నాయుడు వివరించారు. ప్రైవేటీకరణ నిర్ణయంపై పునరాలోచించాలని వై సి పి ఎంపీ మార్గాని భరత్ ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణే ఉత్తమ నిర్ణయమని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ మరోమారు స్పష్టం చేశారు. మన సభ్యులు అడిగినప్పుడల్లా కేంద్రం నుంచి ఇదే సమాధానం వస్తోంది. స్టీల్ ప్లాంట్ ను వీలైనంత త్వరలో ప్రైవేటీకరణ చెయ్యాలన్నదే కేంద్ర అభిమతమని ఇప్పటికే అనేకసార్లు రుజువైంది. మళ్ళీ ఇప్పుడూ అదే తంతు కొనసాగుతోంది తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. కార్మికుల సామర్ధ్యం తగ్గిందని, 22వేల కోట్ల రూపాయల అప్పులున్నాయని సాకులు చెబుతూ ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే కుట్రలో బిజెపి ప్రభుత్వం ఉన్నదని ఉక్కు పరిరక్షణ వేదిక నేతలు మండిపడుతున్నారు. ప్లాంట్ నష్టాల్లో ఉన్నదనే మాట మరో పెద్ద అబద్ధమని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కార్పొరేట్ వర్గాలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం…ఉక్కు పరిశ్రమకు చెందిన కేవలం 22 వేల కోట్లరూపాయల ఋణాలను  మాఫీ చేయడానికి ఎందుకు వెనకడుగులు వేస్తోందని వారు ప్రశ్నిస్తున్నారు. సొంత గనులు లేకపోవడం వల్ల టన్ను 8,500 రూపాయల చొప్పున కొనాల్సివస్తోందని, దాని వల్ల ఈ సంవత్సరం 2000 కోట్ల రూపాయలకు మించిన అదనపు భారం పడిందని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ నేతలు వాపోతున్నారు. ఉత్పత్తి సామర్ధ్యం తగ్గిందని కేంద్ర ఉక్కుమంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Also read: ఇంటి నుంచి పనికి ఇకపై స్వస్తి?

స్వల్పరుణం చూపించి ప్రైవేటుపరం చేస్తారా?

గతం కంటే ఈ సంవత్సరం ఉత్పత్తి 38 శాతం ( జనవరి వరకూ ) పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ సంవత్సరం ఇప్పటి వరకూ 22,289 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది. ఫిబ్రవరి నెల కల్లా 584 కోట్ల రూపాయల లాభాలను విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ గడించిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సత్యాలన్నింటినీ విస్మరిస్తూ ప్రైవేటీకరణ వైపే కేంద్రం మొగ్గుచూపడంపై ఉత్తరాంధ్ర వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.దశాబ్దాల పోరాటం,ప్రాణ, మాన, ధన, భూ త్యాగాలతో దక్కించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ.. ఇలా కళ్లెదురుగానే ప్రైవేట్ పరం కావడానికి రంగం సిద్ధమవ్వడం పట్ల తెలుగువారంతా ఎంతో బాధపడుతున్నారు. అప్పుడు సంస్థ స్థాపన కోసం పెద్ద పోరాటాలు చెయ్యవలసి వచ్చింది, ఇప్పుడు ప్రభుత్వ సంస్థగానే మిగిలిపోవడానికి పోరాటాలు చెయ్యాల్సి వస్తోందని కార్మిక సంఘాలు ఆవేదన చెందుతున్నాయి. ప్రైవేటుపరమైతే చాలా కోల్పోవాల్సి వస్తుందని వారు భయపడుతున్నారు. ఒకప్పుడు తేన్నేటి విశ్వనాథం వంటి మహానాయకులు ఉండేవారని, ఇప్పుడు అటువంటివారు దివిటీ వేసి వెతికినా కానరారని.. గత ఉద్యమ చరిత్రను తెలిసినవారు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతలు బలంగా ఉంటే?దేనినైనా సాధించుకోవచ్చు.. ఈనాటి నేతల తీరు చూస్తుంటే విశాఖ ఉక్కు దక్కడం కష్టమేనని ఎక్కువమంది పెదవి విరుస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదంటూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి పదే పదే చెబుతున్నారు. కార్మికుల వైపు నిల్చుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అంటున్నారు.వీరంతా ఏం చేస్తారో.. ఏం జరుగుతుందో.. చూద్దాం.

Also read: యుద్ధపర్వంలో ఎత్తులు పైఎత్తులు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles