- ఏడోసారి చర్చలు విఫలం
- చట్టాలను రద్దు చేసేవరకు ఇంటికి వెళ్లమన్న రైతులు
- కొనసాగుతున్న ప్రతిష్ఠంభన
వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. చట్టాల రద్దు తప్ప వేరే గత్యంతరం లేదంటూ రైతులు కూడా పట్టిన పట్టు వీడటం లేదు. దీంతో రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన అలానే కొనసాగుతోంది. సోమవారం విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఏడో విడత చర్చల్లోనూ పరిష్కారం దొరకక పోవడంతో చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. చర్చలు జరుగుతున్న తీరు పట్ల రైతు సంఘాల నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వానికి మధ్య కొన్ని అంశాలలో ఏకాభిప్రాయం కుదిరిందని మంత్రులు చెబుతున్న మాటలు అవాస్తవమని రైతు నేతలు చెబుతున్నారు.
చట్టాల రద్దుపై తగ్గని రైతు సంఘాలు
సాగు చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలంటూ రైతు సంఘాలు పట్టుబడుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఒప్పకోకపోవడంతో ఏడు సార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అయితే మంగళవారం (జనవరి 5) సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని రైతు సంఘాల నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకునే దాకా ఇంటికి కూడా వెళ్లేది లేదని రైతు సంఘాలు తెలిపాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనేది తమ ప్రధాన డిమాండ్ అని భారతీయ కిసాన్ యూనియన్ ప్రకటించింది.
ఇదీ చదవండి:రాజస్థాన్-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత
జనవరి 8న మరోసారి భేటీ:
40 మంది రైతు సంఘాల ప్రతినిధులతో ముగ్గురు కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయాల్, సోం ప్రకాష్ లు దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిపారు. తదుపరి చర్చల కోసం జనవరి 8న భేటీ కావాలని రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రులు నిర్ణయించారు.
ఇదీ చదవండి:అన్నదాత ఆక్రందన పెడచెవిన పెట్టడం అనర్థం