అత్యంత అధునాతన హంగులతో విశాలంగా నిర్మించతలపెట్టిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2022లో దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనుంది. ఈ సందర్భానికి గుర్తుగా కొత్త పార్లమెంటు భవనాన్ని పూర్తిచేయాలని మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణాలు 2024 నాటికి పూర్తి చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్న జమిలి ఎన్నికలు 2022 ప్రథమార్ధంలో జరిగితే కొత్త పార్లమెంటు సభ్యులు సెంట్రల్ విస్టాలో కొలువు దీరనున్నారు.
హరిత వనాన్ని తలపించనున్న సెంట్రల్ విస్టా
భారత ప్రజాస్వామ్యం, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సెంట్రల్ విస్టా ఉండనుందని తెలుస్తోంది. పరిపాలనా అంతా ఒకే చోట నుంచి చేసే లక్ష్యంతో ఆధునిక నిర్మాణాలు, అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు భూకంపాలను తట్టుకునేలా భవనాలను నిర్మించనున్నారు. అంతే కాదు ఈ ప్రాంతం మొత్తాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు హరితవనాలను ఏర్పాటు చేయనున్నారు. మోడీ రెండోసారి అధికారం చేపట్టాక సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగిరం చేసింది.
భవిష్యత్ అవసరాలను తీర్చనున్న నూతన భవనం
66 వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దాదాపు 970 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. రాబోయే కాలంలో పార్లమెంటు సభ్యుల సంఖ్య పెరుగుతుందని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1224 మంది కూర్చునేలా భవంతి ప్రణాళిక ఉంటుందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లోక్ సభ హాలులో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చుని సభాకార్యక్రమాలు నిర్వహించేలా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించనున్నారు. దేశ వారసత్వ సంపదను పరిరక్షించేలా కొత్త పార్లమెంట్ లో రాజ్యాంగ హాలును ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు పార్లమెంటు సభ్యులకు ప్రత్యేక గదులు, గ్రంథాలయం, భోజన వసతి సదుపాయాలు, సభ్యుల వాహనాలను నిలిపిఉంచేందుకు పార్కింగ్ స్థాలాన్ని సిద్ధం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న మూడు కిలోమీటర్ల మార్గంలో ప్రభుత్వ భవనాలను నిర్మించనుంది.