- కిషన్ రెడ్డి వెల్లడి
హైదరాబాద్ : హైదరాబాద్ తో పాటు దేశంలోని కొన్నిచోట్ల రోహింగ్యాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర సమాచారం ఉందని, దీనిపై సమీక్షిస్తోందని కేంద్రహోం శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో వారున్నారని లిఖితపూర్వకంగా తెలిపిన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందిచడంలేదని ప్రశ్నించారు. శాంతి భద్రతల పేరిట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆయన తనయుడు తారక రామారావు ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. తెలుగుజాతి గర్వించదగ్గ నేతలు వీవీ నరసింహారావు, ఎన్టీ రామారావుల సమాధులను కూల్చివేయాలన్న మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలను సీఎం ఎందుకు ఖండించడంలేదని ప్రశ్నించారు.
మజ్లస్ లో ఇతర మతాలవారూ ఉన్నారు: అక్బరుద్దీన్
హైదరాబాద్ నగరానికి బీజేపీ చేసిందేమీ లేకపోగా, తమ పార్టీని బూచిగా చూపి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రయత్నిస్తోందని ఎంఐఎం నేత , ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. మతవాద పార్టీగా తమకు ముద్ర పడింది కానీ ఇతర మతాలకు చెందిన వారూ తమ పార్టీలో ఉన్నారని గురువారం నాంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో అన్నారు. వివిధ రాష్ట్రాలలో తమ పార్టీకి పెరుగుతున్న ఆదరణను సహించలేకపోతున్నారని,తమపై విమర్శలు చేసేవారు తమ మౌనాన్ని బలహీనతగా భావించవద్దని అన్నారు.
షరతులపై మహిళా ఖైదీల విడుదల
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జైళ్లలో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న 53 మంది మహిళలను గడువుకు ముందే విడుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజమండ్రి మహిళా జైలు నుంచి 19 మంది, కడప నుంచి 27 మంది, నెల్లూరు నుంచి అయిదుగురు. విశాఖపట్నం నుంచి ఇద్దరి విడుదలకు సంబంధించి షరతులతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం వారంతా రూ.50వేలు పూచికత్తు బాండ్ ఇవ్వాలి. శిక్షాకాలం ముగిసేంత వరకు మూడు నెలలకు ఒకసారి సంబంధిత పోలీస్ స్టేషన్ వద్ద హాజరు కావలసి ఉంటుంది. విడుదలైన వారు ఒకవేళ ఎలాంటి నేరానికి పాల్పడినా వెంటనే అరెస్ట్ చేసి ముందస్తు విడుదలను రద్దు చేస్తారు.