- నోరు విప్పని అగ్రనేతలు
- కార్మికుల ఆందోళన
- విశాఖ ప్రజల ఆగ్రహం
దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రంగం సిద్ధమై పోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా తాజాగా ప్రకటన చేసింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, విశాఖపట్నం వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి.ఈ వార్త తెలిసిన మొదటిరోజు వందలాది మంది కార్మికులు ప్లాంట్ కార్పొరేట్ కార్యాలయం ప్రవేశ ద్వారం దగ్గర నిరసనకు దిగారు.
వైసీపీ, టీడీపీ అధినేతలు మౌనం
మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు మొదలైన నేతలు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, ఆ పార్టీ లోక్ సభ సభ్యుల వైఖరి ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. అధికార వై సి పి అభిప్రాయం కూడా ఇంకా వెల్లడవ్వాల్సి వుంది. వ్యవసాయ చట్టాల వలె ప్రైవేటీకరణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని బిజెపి ప్రభుత్వం చెబుతోంది. ప్రైవేట్ యాజమాన్యంలో నడవడం వల్ల ఉత్పత్తి సామర్ధ్యం బాగా పెరుగుతుందని, మానవవనరులు, సమయం ఎంతో సద్వినియోగం అవుతాయని, సృజనశీలతతో వినూత్న విధానాలతో స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రగతి ఎన్నో రెట్లు పెరుగుతుందని భారత ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
Also Read : ఇండో-పెసిఫిక్ పైనే అందరి దృష్టి
వాజపేయి హయాంలోనే మొదలు
దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టి, ఆదాయాన్ని పరుగులెత్తించాలంటే ఇటువంటి చర్యలు తప్పవనే స్థిరమైన అభిప్రాయంతోనే ప్రభుత్వ పెద్దలు ముందుకు వెళ్తున్నారు. ప్రైవేటీకరణ అనే అంశం నరేంద్రమోదీ సమయంలో వచ్చింది కాదు. గతంలో వాజ్ పెయి ప్రధానిగా ఉన్నప్పుడే పెట్టుబడుల ఉపసంహరణపై కార్యాచరణ ప్రారంభమైంది. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు తొలిగా ఆర్ధిక సంస్కరణలను పరిచయం చేశారు. ఈ క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన కొన్ని సంస్థలకు చెందిన పెట్టుబడుల ఉపసంహరణకు బీజం వేశారు. కానీ ఇవి మైనార్టీ వాటాలు మాత్రమే. వాజ్ పేయ్ సమయంలో ఈ విధానం ఊపందుకుంది. ఈ పెట్టుబడుల ఉపసంహరణకు “స్ట్రాటెజిక్ సేల్స్ ” అనే పేరు పెట్టారు.
అరుణ్ శౌరి ఆధ్వర్యం
పెట్టుబడుల ఉపసంహరణకు మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా రూపకల్పన చేశారు. అరుణ్ శౌరిని మంత్రిగా నియమించారు. సుమారు 12పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ప్రైవేటైజ్ చేశారు.వాటిల్లో హిందూస్థాన్ జింక్, భారత్ అల్యూమినియం పెద్ద సంస్థలు. వేదాంత గ్రూప్ ఈ కంపెనీలను తీసుకుంది. 2001-2002లో హిందూస్థాన్ జింక్ వార్షిక టర్న్ ఓవర్ రూ. 1,418 కోట్ల రూపాయలు ఉండేది. ప్రైవేటీకరణ తర్వాత 17రెట్లు పెరిగి, 2017-18లో రూ. 24,000 కోట్ల రూపాయలకు చేరింది. అదేవిధంగా, భారత్ అల్యూమినియం టర్న్ ఓవర్ 2017-18లో రూ. 9,000 కోట్లకు పెరిగింది. తదనంతరం మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ లో కూడా పెట్టుబడుల ఉపసంహరణ జరిపారు. జాపనీస్ ఆటోమేకర్ సుజుకి మోటార్స్ మారుతి ఉద్యోగ్ లో వాటాలను తీసుకుంది. 2000-01లో ఉన్న రూ. 6,000కోట్ల టర్న్ ఓవర్ 14రెట్లు పెరిగి, 2018-19లో రూ. 88,581 కోట్లకు చేరింది.
Also Read : మహాత్ముడి పట్ల మహాపచారం
ఇక ఎయిర్ ఇండియా వంతు
ఇలా చాలా సంస్థల ప్రగతిని ఉదాహరణగా చెప్పవచ్చు. ఇదే స్ఫూర్తితో నరేంద్రమోదీ ప్రైవేటీకరణ వైపు మొగ్గుచూపిస్తున్నారని భావించవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సంపదను గణనీయంగా పెంచవచ్చనే విశ్వాసంతో మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అందులో భాగమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఎయిర్ ఇండియా మొదలైన సంస్థల ప్రైవేటీకరణ. ఎయిర్ ఇండియా విషయం అటుంచగా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్ల ఎక్కువ ఆర్ధిక ప్రగతి కలుగుతుందని వీరి భావన.
ఉక్కు కర్మాగారానికి నవరత్న హోదా
స్టీల్ ప్లాంట్ నవరత్న హోదా పొంది కూడా 10 ఏళ్ళు దాటింది. ప్రస్తుతం 6.3మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం కలిగి వుంది . కేంద్ర ప్రభుత్వానికి 100శాతం వాటాలు ఉన్నాయి. 2017 నుంచి ఈ సంస్థ నష్టాల బాటలో ఉందని ప్రభుత్వ అభిప్రాయం. 2019లో మాత్రం రూ. 96.71కోట్ల రూపాయల నికర లాభాన్ని గడించింది. ఇంత పెద్ద ఉక్కు ఫ్యాక్టరీకి సొంత కాప్టివ్ ఐరన్ ఓర్ ఖనిజ వ్యవస్థ లేదు. దీన్ని బయట నుంచి కొనాల్సి రావడం వల్లే టన్నుకు 5,000 రూపాయల నష్టం వాటిల్లుతోందని స్టీల్ మినిస్ట్రీ వ్యాఖ్యానిస్తోంది. నష్టాల నుంచి బయటపడ వేయాలని, ఆదాయం పెద్ద ఎత్తున సృష్టించాలనే లక్ష్యంతోనే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బిజెపి నేతలు చెబుతున్నారు.
Also Read : చైనాతో వేగడం ఎలా?
సంస్కరణల పితామహుడు ఏమన్నారు?
ఈ సందర్భంగా, ఆర్ధిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావు మాటలు ఒకసారి గుర్తుచేసుకుందాం. “ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణకు నేను వ్యతిరేకం. ప్రైవేట్ రంగంతో ప్రభుత్వ రంగం పోటీ పడే పరిస్థితిని కల్పించాలి. నీ కన్నబిడ్డను నీవే గొంతు నులిమి చంపేయలేవు. సంస్కరణలు సరైన వేగంతో సాగాలి. అతి దూకుడు వల్ల సంక్షోభం ఏర్పడుతుంది”. దేశభక్తుడు, దర్శనికుడైన పీవీ మాటలను పూర్తిగా కొట్టిపారేయలేం.
ఎందరి త్యాగాల ఫలమిది?
తెన్నేటి విశ్వనాథం వంటి నిస్వార్థమైన నాయకులు నాయకత్వం వహించి ” విశాఖ ఉక్కు -ఆంధ్రా హక్కు” అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం పెద్ద పోరాటం చేశారు. ఈ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. దాతలు, రైతులు, ఎందరో కలిసి సుమారు 24వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు. అంతటి పోరాటాలు, దానాలు, ప్రాణత్యాగాల ఫలితంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ వెలిసింది. స్థాపన జరిగి కూడా దశాబ్దాలు దాటింది. విశాఖపట్నంకు మరోపేరు “ఉక్కు నగరం”. స్టీల్ ప్లాంట్ వల్లనే ఈ పేరు వచ్చింది.
Also Read : యోగ్యులను వరించిన పద్మపురస్కారాలు
ఉక్క కర్మాగారం వల్లనే విశాఖ మహానగరం
చిన్న మత్స్యకారుల పల్లె నేడు మహానగరంగా రూపాంతరం చెందిందంటే, అందులో స్టీల్ ప్లాంట్ పాత్ర ప్రధానమైంది. 40వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగానూ, లక్ష కుటుంబాలు పరోక్షంగానూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. విశాఖ ప్రైడ్ (గర్వకారణం) ట్యాగ్ లైన్ తో ఈ సంస్థ పేరు పెనవేసుకుని వుంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన సంస్థను ప్రెవేట్ వారి చేతుల్లో పెట్టడంపై చాలామంది ఆవేదన చెందుతున్నారు. పీవీ నరసింహారావు చెప్పినట్లుగా ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
బలోపేతం చేయాలి, తెగనమ్మకూడదు
ఆ దిశగా మానవవనరులు మొదలు అన్నింటా సంస్కరణలు తేవాలి కానీ, పూర్తిగా ప్రైవేట్ వారికి అప్పచెప్పడం సరియైన నిర్ణయం కాదు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతిపక్ష, పాలక పక్ష పార్టీల పెద్ద నేతలు నిశ్శబ్దంగా ఉన్నా, నేడో రేపో స్పష్టమైన వైఖరి ప్రకటించాల్సి వుంటుంది. నేడు ప్రారంభమైన కార్మిక సంఘాల నిరసనలు ఎటువంటి మలుపులు తీసుకుంటాయో త్వరలోనే తెలిసిపోతుంది.
Also Read : నందమూరి తారక రామారావు – ఒక చరిత్ర