- ట్విట్టర్ ను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం
- 1200 ఖాతాలను బ్లాక్ చేయనున్న ట్విట్టర్
సాగు చట్టాల రద్దు కోసం పోరాడుతున్న అన్నదాతల ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. పలు మార్లు చర్చలు జరిపినా ఓ కొలిక్కి రాకపోవడం అదే సమయంలో సామాజిక మాధ్యమాల్లో సాగు చట్టాలపై జరుగుతున్న విష ప్రచారాన్ని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆందోళనకు సంబంధించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రచారం చేస్తున్న ఖాతాలను నిలిపివేయాలని ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Also Read: భద్రతా దళాల పహరాలో రైతుల రాస్తారోకో
పాకిస్తాన్, ఖలిస్తాన్ కుం చెందిన సుమారు 1200 ట్విట్టర్ ఖాతాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర హోంశాఖ సూచనల మేరకు ఐటీ శాఖ ఈ ఆదేశాలు జారీచేసింది. రైతుల ఆందోళనపై అసత్య ప్రచారం చేసిన ఖాతాలను పునరుద్ధరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ కు హెచ్చరికలు జారీ చేసింది. దేశ సమగ్రతకు భంగం కలిగిస్తూ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనపై కొందరు సామాజిక మాధ్యమాలలో దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేయడంతో అలాంటి ఖాతాలను నిలిపివేయాలని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ వారం రోజుల కిందట ట్విట్టర్ ను ఆదేశించింది. దీంతో దాదాపు 250 ఖాతాలను బ్లాక్ చేసిన ట్విట్టర్ గంటల వ్యవథిలోనే పునరుద్ధరించింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను వివాదస్పద 1200 ఖాతాలను నిలిపివేయాలని తాజా ఉత్తర్వులు జారీ చేసింది.