పదవుల వెంట ఆయన పడలేదు. పదవులే ఆయన్ని వరించాయి అన్నదే ఆయన సంపాదించుకున్న ఆస్తి. పదవుల రాకపోకలను తేలికగా తీసుకునేవారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చిన నాడే భార్యతో సినిమాకు వెళ్లి వినోదాన్ని ఆస్వాదించిన స్థితప్రజ్ఞత్వం. అధిష్ఠానం అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, అంకితభావంతో నెరవేర్చడమే ఆయన నేర్చుకున్నది. అవిభక్త మద్రాసు రాష్రం నుంచి విశాలాంధ్ర వరకు రాజాజీ, టంగుటూరి ప్రకాశం,బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గాలలో, కేంద్రంలో జవహర్ లాల్ నెహ్రూ,లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాలలో పని చేసిన అనుభవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఆ మాటకు వస్తే కొత్త రాష్ట్రం తెలంగాణకు సంబంధించి ఏకైక దళిత ముఖ్యమంత్రి. ఆయన దామోదరం సంజీవయ్య. ఈ ఏడాది ఆయన శత జయంతి సంవత్సరం కావడం విశేషం.
రాజకీయ ప్రస్థానం
ఇరవై తొమ్మిదేళ్ల వయసులో (1950) తాత్కాలిక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికలో పోటీ చేయడానికి ధరావతు సొమ్ము కూడా లేకపోతే కామరాజ్ నాడార్ ఆ డబ్బుకట్టి సహకరించారు.పార్లమెంట్ సభ్యుడిగా రాజనీతిజ్ఞులు, పార్లమెంటేరియన్ల, దేశభక్తుల ప్రసంగాలు వినడం, చదవడం వల్ల విశాలమైన జాతీయ దృక్పథాన్ని అలవర్చుకున్నారు.
Also Read : సరళ స్వభావుడు… సుమధుర గాత్రుడు
మద్రాసు ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు
1952లో జరిగిన ఎన్నికలలో ఎమ్మిగనూరు-ప్రత్తికొండ ద్వి సభ్య నియోజకవర్గం నుంచి మద్రాసు ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ ఎన్నికలలో పెద్ద నాయకులు పరాజయం పాలైనా సంజీవయ్య గెలిచి అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. రాజాజీ ఆయనను ఏరికోరి తమ మంత్రివర్గంలోకి తీసుకుని సహకార శాఖను అప్పగించారు. తన శాఖను నిర్వహించడంలో తన అభిప్రాయాలను స్వేచ్ఛగా, నిర్భయంగా వ్యక్తం చేసేవారని చెబుతారు. ప్రకాశం మంత్రివర్గ సభ్యుడిగా మద్యపాన నిషేధానికి కృషి, నీలం సంజీవరెడ్డి మంత్రివర్గ సభ్యుడిగా ప్రతి గ్రామానికి పంచాయతీ నినాదంతో వికేంద్రీకరణ వ్యవస్థకు పునాది వేయడం మైలురాళ్లుగా చెబుతారు. 1955లో ఎమ్మిగనూరు ద్విసభ్య నియోజకవర్గం నుంచి, 1962లో కోడుమూరు నియోజకవర్గం నుంచి గెలిచారు.
ముఖ్యమంత్రిగా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 27 నెలలే అయినా తమ సామర్థ్యంతో అనేక విజయాలు సాధించారు. భూసంస్కరణలను అమలు చేశారు (అదే భూస్వాములకు ఆగ్రహం తెప్పించింది). అవినీతి నిరోధక విభాగాన్ని విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా అనుకున్నది చేసేవారనన పేరు తె చ్చుకున్నారు. బాలికల కోసం దేశంలోనే మొదటి పాలిటెక్నిక్ విద్యాసంస్థను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. హైదరాబాద్-సికింద్రాబాద్ లను కలిపి ఒకే మున్సిపాలిటీ పరిధిలోకి తెచ్చారు.సరోజిని కంటి ఆస్పత్రిని నెలకొల్పారు. ప్రభుత్వ ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో సాగాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన హయాంలోనే పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది.
Also Read : రజని జయంతి
నీలం సంజీవరెడ్డి తరువాత ముఖ్యమత్రి పగ్గాలు అందుకున్న దామోదరం సంజీవయ్య 1962 ఎన్నికల తరువాత అధిష్ఠానం ఆదేశానుసారం తప్పుకోవడంతో నీలం మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. వర్గ విభేదాలు తలెత్తిన రాష్ట్ర కాంగ్రెస్ ను దారిలో పెట్టాలంటే సంజీవరెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలన్నది అధిష్ఠానం యోచన.దానిని సంజీవయ్యకు సున్నితంగా వివరించి నీలం రాకకు మార్గం సుగమం చేసింది.మొదటే చెప్పుకున్నట్లు అధిష్ఠానం మాటను శిరోధార్యంగా భావించిన సంజీవయ్య ఆయనను(నీలం)శాసనసభ పక్షనేతగా ప్రతిపాదించారు. ఆ తరువాత నెహ్రూ మంత్రివర్గంలో చేరారు.
కాంగ్రెస్ అధ్యక్షుడిగా
ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన (1962) తరువాత అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమితులయ్యారు. మొత్తం మీద ఆ పదవిని మూడుసార్లు నిర్వహించడం ఒక రికార్డు. నెహ్రూ కుటుంబేతరులలో ఆ పదవిని అన్నిసార్లు నిర్వహించిన ఘనత దామోదరం సంజీవయ్యకే దక్కుతుంది. పార్టీలోని వారు క్రమశిక్షణతో ఉండాలని కాంగ్రెస్ అద్యక్షుడిగా, పార్టీ వాదిగా కోరేవారు. పిడివాదం, వితండవాదానికి దిగక అన్ని వర్గాల వారితో నమ్రతగా ఉండేవారని చెబుతారు.
జీవిత విశేషాలు
కర్నూలు జిల్లా పెదపాడు గ్రామంలో 1921 ఫిబ్రవరి 14వ తేదీ కడు బీద కుటుంబంలో పుట్టిన సంజీవయ్య మూడు రోజులకే తండ్రిని కోల్పోయారు. మేనమామ ఊరు పాలకుర్తి చేరి పశువుల కాపరి పనిచేశారు. మూడు సంవత్సరాల తరువాత స్వగ్రామం చేరుకున్నారు.ఆరుగురి సంతానంలో ( నలుగురు అన్నలు, అక్క) చివరివాడైన అతనినైనా చదివించాలని అన్నలు నిశ్చయించారు.వారికి నమ్మకాన్ని నిలబెడుతూ సంజీవయ్య చదువులో ముందుండేవారు. బీఏ పట్టభద్రులైన తరువాత కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు చిన్నచిన్న ఉద్యోగాలు చేశారు.ఆదర్శభావాలు గల ఆయన ఎక్కడా ఎక్కువ కాలం నిలవలేకపోవడంతో పాటు ఉన్నత చదువు అభిలాష వెంటాడింది. మద్రాసులో న్యాయశాస్త్రాన్ని (1946) అభ్యసించారు. అప్పట్లో కాలేజిలో స్కాలర్ షిప్ ఇచ్చే పద్ధతి లేకపోవడంతో జార్జ్‌టౌన్ లోని ప్రోగ్రెస్సివ్ యూనియన్ ఉన్నత పాఠశాలలో పార్ట్ టైం గణిత అధ్యాపకునిగా పనిచేసి, జీతంగా వచ్చే రూ. 90లతో చదువు కొనసాగించారు.అనంతర కాలంలో ప్రఖ్యాత రచయితగా పేరొందిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి (రావి శాస్త్రి)ఆయనకు సహాధ్యాయి. మంచి మిత్రుడు.
Also Read : కరోనా వ్యాక్సినేషన్ రెండో డోస్ ప్రక్రియ ప్రారంభం
ఐఏఎస్ కావాలనుకొని
ఐఏఎస్ కావలని కలలు కన్న సంజీవయ్య జీవనగమనం మారింది.1950లో మద్రాసులో న్యాయవాదిగా పనిచేస్తున్నప్పుడే రాజకీయాలపై ఆసక్తి కలిగింది. అది గమనించిన జిల్లాకు చెందిన ప్రముఖుడు కేబీ నరసప్పకు ఆయనలోని సౌమ్యత నచ్చింది.కాంగ్రెస్ అధిష్ఠానవర్గం దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు చూస్తున్నబెజవాడ గోపాలరెడ్డి సహకారంతో తాత్కాలిక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
సాహితీవేత్తగా
సంజీవయ్య సాహిత్యాభిమాని.కొన్ని పద్యాలు కూడా రాశారు.అఖిల భారత తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడుగా కొంతకాలం సేవలు అందించారు.గయోపాఖ్యానాన్ని గద్యంగా రాశారు. న్యాయశాస్త్ర విద్యార్థిగా చంద్రగుప్త నాటకంలో పాల్గొన్నారు. శివాజీ అనే నాటకం రాసి ప్రదర్శించారు. ఆయన హయాంలో నిర్వహించిన ఈ సంఘం సమావేశాలను అప్పటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. మూడు రోజుల పాటు సాగిన సభలకు ప్రత్యేకంగా హాజరయ్యేవారు. ముఖ్యమంత్రి హోదాన పక్కనపెట్టి రచయితల మధ్య భోజనం చేసేవారు. దేశరాజధానిలోని ఆయన అధికార నివాసం సాహితీవేత్తలకు, కళాకారులకు నిలయం. అధికారికి కార్యక్రమాలు, మంత్రివర్గ సమావేశాలు ఉన్నా తీరికచేసుకుని లేదా అనుమతి తీసుకొని సాహితీ సభలు, సదస్సులకు హాజరయ్యేవారు.
Also Read : దుర్భాషల `ఘనులు`
1967 ఎన్నికల ప్రచారం సమయంలో విజయవాడ నుంచి హైదరాబాదు వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్న ఆయన తిరిగి అంతగా కోలుకోలేక పోయారు. కేవలం రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు నిర్వహించి వాటికి వన్నెతెచ్చిన దామోదరం 51వ ఏట తనువు చాలించారు.