- పుదుచ్చేరి సహా నాలుగు రాష్ట్రాలలో ఎన్నికలు
- పోలింగ్ తేదీలు ప్రకటించిన సీఈసీ
- మార్చి 27 న తొలిదశ ఎన్నికలు
- మే 2న కౌంటింగ్
పశ్చిమ బెంగాల్, తమిళనాడు కేరళ అసోం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 27 న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ఈసీ ప్రకటించింది. అసోంలో 126 స్థానాలు, పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలు, తమిళనాడులో 234 స్థానాలు కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 2న అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంత ఓట్ల లెక్కింపు జరగనుంది.
పోలింగ్ జరగనున్న తేదీలు:
అసోం :
అసోంలో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలిదశ, ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈశాన్య రాష్ట్రం అసోంలో ప్రస్తుత శాసన సభ గడువు ఏప్రిల్ లో ముగియనుంది. గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ అధికారం చేపట్టింది. అంతకు మందు తరుణ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుధీర్ఘకాలంపాటు అధికారం చెలాయించింది. కాంగ్రెస్ కు కీలక నేత అయిన గొగోయే ఇటీవలే మరణించారు.
పశ్చిమ బెంగాల్ :
294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో మాత్రం మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న తొలిదశ, ఏప్రిల్ 1న రెండో దశ, ఏప్రిల్ 6న మూడో దశ, ఏప్రిల్ 10న నాలుగో విడత, ఏప్రిల్ 17న ఐదో విడత, ఏప్రిల్ 22న ఆరో దశ, ఏప్రిల్ 26న ఏడో విడత, ఏప్రిల్ 29న ఎనిమిదో విడత పోలింగ్ జరగనున్నట్లు సీఈసీ అరోరా వెల్లడించారు.
హోరా హోరీ:
గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస వరుసగా రెండో సారి విజయం సాధించి అధికారం చేపట్టింది. ఈ సారి కూడా విజయం సాధించి హ్యోట్రిక్ కొట్టాలని మమతా బెనర్జీ పట్టుదలతో ఉన్నారు. అయితే కొద్ది నెలలనుంచి సువేందు అధికార సహా పలువురు కీలక నేతలు తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీ గూటికి చేరడంతో తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు 2019 లోక్ సభ ఎన్నికల్లో భారీగా పుంజుకున్న బీజేపీ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి బెంగాల్లో తొలిసారి పాగా వేయాలని వ్యూహరచన చేస్తోంది.
కేరళ :
140 స్థానాలున్న కేరళ శాసన సభ గడువు జూన్ 1 తో ముగియనుంది. ఏప్రిల్ 6న అన్ని స్థానాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ పై విజయం సాధించి అధికారం చేపట్టింది. ఈ సారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే కేరళలో గత ఎన్నికల్లో ఒకే ఒక్క చోట విజయం సాధించిన బీజేపీ పెద్దగా పట్టులేకపోయినా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీ లో చేర్చుకుని ప్రచారం చేయనుంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సరికొత్త ఎత్తుగడలతో ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.
పుదుచ్చేరి:
30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్, డీఎంకే సర్కార్ కుప్పకూలిపోయింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెస్ బలం తగ్గిపోవడంతో బలనిరూపణలో నారాయణ స్వామి సర్కార్ విఫలమైంది.
తమిళనాడు :
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో శాసన సభ గడువు మే 24 తో ముగియనుంది. ప్రస్తుతం తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలో ఉంది. కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు కావడం ఈ సారి విశేషం. అయితే అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన జయలలిత స్నేహితురాలు శశికళ ఈ సారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరోవైపు స్టాలిన్ కు సోదరుడు అళగిరి వ్యతిరేకంగా ఉన్నా..ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు.
ఇదీ చదవండి: సామాజిక మాధ్యమాలకు ముకుతాడు
పోలింగ్ కు విస్తృత ఏర్పాట్లు:
ఎన్నికల నేపథ్యంలో బెంగాల్లో లక్షకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో 89 వేల పోలింగ్ కేంద్రాలు, కేరళలో 40 వేల పోలింగ్ కేంద్రాలు అసోంలో 33 వేల పోలింగ్ కేంద్రాలు పుదుచ్చేరిలో 1500 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికల నిర్వహణకు అదనపు బలగాలను మోహరిస్తామని తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ఈ సారి ఆన్ లైన్ ద్వారా నామినేషన్ వేసే అవకాశం కల్పించనున్నట్లు అరోరా తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు రోడ్ షోకు అనుమతిస్తామని వెల్లడించారు. ఇవికాకుండా 16 రాష్ట్రాల్లో 34 అసెంబ్లీ స్థానాల్లో జరగనున్న ఉప ఎన్నికలకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: మున్సిపల్ పోరుకు ఎస్ఈసీ సన్నాహాలు