• నివాసం, కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు
• తనిఖీల సమయంలో ఇంట్లోనే ఉన్న రాయపాటి
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ఆస్తులపై సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. గుంటూరులోని రాయపాటి నివాసం, ఆయన కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన ట్రాన్స్ టాయ్ కంపెనీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటిని సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్ ట్రాయ్ తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు గతంలో ఆస్తుల వేలానికి నోటీసులు కూడా జారీ చేసింది.
గతంలోనూ సీబీఐ సోదాలు:
ట్రాన్స్ ట్రాయ్ సంస్ధకు సీఈవోగా పనిచేసిన శ్రీధర్ అనే వ్యక్తి మోసం చేశాడంటూ రాయపాటి కుటుంబ సభ్యులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వారి నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 300 కోట్ల రూపాయల రుణాలను ట్రాన్స్ ట్రాయ్ బ్యాంకులకు బాకీ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై గతంలో రెండుసార్లు సీబీఐ దాడులు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది.