విద్యాధికుడు, గొప్పవక్త, అంతర్జాతీయ విద్యా సంస్థల్లో భారతీయులకు, ప్రత్యేకించి తెలుగువారికి గుర్తింపు తెచ్చిన వారు కట్టమంచి రామలింగారెడ్డి. స్వపక్ష, పరపక్షాలనే పక్షపాతం లేకుండా విమర్శలు గుప్పిస్తూ ఏ రాజకీయ విధానానికి, కార్యక్రమానికి కట్టుబడని మనస్తత్వం. రాజకీయంగా అదే ఆయనకు కలసిరాని అంశం. `ఓటు ప్రతిభకు ప్రతీక కాదు. ప్రతిభ ఓటుతో గుర్తింపు పొందాలి.
రాజకీయంలో నైతిక విలులు:
కేవలం ఓట్ల పెట్టె తుది న్యాయనిర్ణేత కాదు. చరిత్రే తుది న్యాయ నిర్ణేత. నైతిక విలువలు లేని రాజకీయాలు దేశాన్ని అభ్యుదయం వైపు నడిపించలేవు` అనే వారు. అప్పటి రాజకీయాలతో తన అభిప్రాయాలు పొసగక పోవడం వల్లనే తక్కువ కాలంలోనే రాజకీయాలను వీడారు. విద్యారంగంలో అందనంత ఎత్తుకు ఎదిగారు. స్వతంత్ర మనస్తత్వం కారణంగా రాజకీయాలలో వ్యక్తగతంగా నష్టపోయారేమో కానీ, విద్యారంగం సుసంపన్నమైంది. అందుకు విశాఖలోని ఆంధ్రవిశ్వ కళాపరిషత్తు నిదర్శనం. వివిధ దేశాలలోని విద్యా విధానాలు పరిశీలించి, వాటిలో మేలైనవి అమలు పరిచారు.
Also Read: నట `మిక్కిలి`నేని
జీవిత విశేషాలు:
చిత్తూరు జిల్లా కట్టమంచిలో 1880 డిసెండర్ 10వ తేదీన పుట్టిన రామలింగారెడ్డి మదరాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రులై, కేంబ్రిడ్జిలో సెయింట్ జోన్స్ కాలేజీలో ఉన్నత విద్య అభ్యసించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లిటరరీ క్లబ్ కార్యదర్శిగా, విద్యార్థి యూనియన్ ఉపాధ్యక్షుడిగా వ్యహరించారు. అంతటి గౌరవం ఏ ఇతర భారతీయుడికి దక్కలేదని అంటారు. 1905లో బ్రిటన్‌లో పార్లమెంట్ ఎన్నికలలో దాదాభాయ్ నౌరోజీ పోటీ చేయగా, ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ సుమారు వంద సభలలో చేసిన ఉపన్యాసాలు శ్రోతలను అలరించాయట. ఆనాటి రాజకీయాభిరుచే స్వదేశం వచ్చిన తరువాత చట్టసభలకు పోటీ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది.
రెడ్డిగారి ప్రతిభను మెచ్చిన బరోడా మహారాజు ఆయనకు అమెరికాలో ఉన్నత చదువుకు సహకరించి, తిరిగి వచ్చిన తర్వాత తమ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్ గా నియమించారు. అక్కడ ఆయన ఎంతగా రాణించారో తెలుసుకునుందకు ఒక్క ఉదాహరణ చాలు. అనంతర కాలంలో కేంద్రమంత్రిగా పనచేసిన డాక్టర్ కె.ఎం.మున్షీ ఆ కళాశాల విద్యార్థి. నేను రెడ్డిగారి తరగతికి చెందిన విద్యార్థిని కాకపోయినా ఆయన మహోపన్యాసాలు వినాలనే కుతూహలంతో నా తరగతి ఎగ్గొట్టి రామలింగారెడ్డిగారి పాఠాలు వినేందుకు వెళ్లేవాడిని అని మున్షీగారే స్వయంగా చెప్పుకున్నారు. రెడ్డిగారు బరోడాలో ఉన్న సమయంలోనే మైసూర్ ప్రభుత్వం ఆహ్వానంపై అక్కడ ఉపన్యాసాలు ఇవ్వడంతో, వాటికి ముగ్ధులైన మైసూర్ మహారాజా తమ కళాశాలలో అధ్యాపకునిగా నియమించారు. అక్కడి విద్యారంగంలో ఉన్నత పదవులు నిర్వహించారు. అయన కాలంలోనే మైసూర్‌కు ప్రత్యేక విశ్వ విద్యాలయం ఏర్పాటైంది. మైసూరు విద్యాశాఖాధికారిగా ఉన్నప్పుడే ప్రతి ఊరికి పాఠశాలఅనే ఉద్యమం చేపట్టారు. పాఠశాలల ఏర్పాటుకు, వాటి నిర్వహణకు ప్రభుత్వ ఆదాయంలో అధిక మొత్తం వినియోగానికి కట్టమంచి చూపిన చొరవ ఎనలేనిది. గాంధీజీ దళితజనోద్ధరణ కార్యక్రమం చేపట్టే నాటికే (1917) కట్టమంచి ప్రతి పాఠశాలలో దళితులకు ప్రవేశం కల్పించారు. 1921 వరకు మైసూరులో ఉన్న ఆయన ఆ మరుసటి సంవత్సరం మద్రాసు శాసనభకు ఎన్నికయ్యారు.
Also Read: వ్యయ `వ్యూహం`లో ఉక్కిరిబిక్కిరి
రాజకీయ ప్రస్థానం:
కట్టమంచి రాజకీయాల్లోకి ఆకస్మికంగా వచ్చినట్లే అదే రీతిలో వాటికి స్వస్తి చెప్పారు. ఆంధ్రకేసరి టంగూటరి ప్రకాశం పంతులు ప్రేరణతో కాంగ్రెస్‌లో చేరినా అక్కడ ఎక్కువ కాలం నిలవలేకపోయారు. ఆయన మేధాశక్తిని కాంగ్రెస్ సరిగా వినియోగించుకోలేక పోయిందని, ఆయన స్వతంత్ర ప్రవృత్తి అందుకు కొంతకారణమై ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటారు. అవిభక్త మద్రాసు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష ఉపనేతగా ఆయన వాగ్ధోరణి, విమర్శనా నైపుణ్యం ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో పడవేసేది. సభ వేడెక్కిన సందర్భాలలో తమ హాస్య చతురతతో నవ్వులు పూయించేవారు. జస్టిస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఉన్న పానగల్ రాజాపై ప్రతిపక్ష ఉపనేతగా కట్టమంచి అవిశ్వాస తీర్మానం (1922) తేవడం అప్పట్లో కలకలం రేపింది. ఆయన ధాటికి తట్టుకోలేక పానగల్ రాజా ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సృష్టించి, కట్టమంచిని ఉప కులపతిగా నియమించారనే వాదన ఉంది. దీనినే సానుకూల కోణంలో చూస్తే, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపాధ్యక్ష పదవికి మరొకరు లేరని పాలకపక్షం భావించి ఉండవచ్చు. ఏమైనా, రాజకీయాలలో ఇమడలేని ఆయనకు ఈ పరిణామం మంచిదనిపించింది.
ఆంధ్ర విశ్వకళాపరిషత్తుకు జీవనాడి:
విశ్వవిద్యాలయాన్ని రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పాలని ఆ ప్రాంత వాసులు తెచ్చిన ఒత్తిడి తెచ్చిన సీమవాసియైన రామలింగారెడ్డి ప్రాంతీయాభి మానానికి అతీతంగా విశాల దృష్టితో ఆలోచించి విశాఖపట్నం అనువైన ప్రాంతంగా నిర్ణయించారు. వ్యవస్థాపక ఉప కులపతిగా నియమితులై విశ్వ విద్యాలయం అభ్యున్నతికి ఇతోధికంగా కృషి చేశారు. దేశంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా తీర్చిదిద్దారు. విరాళాలు సేకరించి సంస్థను ప్రగతి బాట పట్టించారు. ప్రథమ దాతగా తమను తాము నిరూపించుకున్నారు. ఉప కులపతి హోదాలో వచ్చే నెలవారీ పారితోషికంలో సగం విశ్వవిద్యాలయా నికి విరాళంగా ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యావంతులు, పండితులను రప్పించి కొలువుతీర్చారు. కులమతాలకు అతీతంగా ప్రతిభకు పట్టం కట్టారు. ప్రతిభ, యోగ్యతలను బట్టే ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన హయాంలో ఈ విద్యాలయం శారదా నిలయంగా భాసించింది. కాశీ విశ్వవిద్యాలయాన్ని తీర్చదిద్దడానికి మదన్ మోహన్ మాలవ్య కష్టపడినట్లే ఆంధ్ర విశ్వకళాపరిషత్ ఉన్నతికి కట్టమంచి ఫాటుపడ్డారు. సత్యాగ్రహం సందర్భంలో పరాయి పాలకుల తీరుకు నిరసనగా ఉప కులపతి పదవీ త్యాగం చేశారు. ఆరేళ్ల విరామం తరువాత 1936 నుంచి 1949 వరకు ఉపకలపతిగా వ్యవహరించారు. ఆ తర్వాత మైసూరు విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్‌గా సేవలు అందించారు. ఆయన పరిపాలన దక్షతకు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సజీవ చిహ్నంగా భావిస్తారు. ఉద్యోగ విరమణ తరువాత సాహిత్య సేవ చేయాలని ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆంధ్రాంగ్ల భాషలలో ఆయన రచనలు, అప్రకటితాలుగా అలాగే ఉండిపోయాయి.
Also Read: ఆర్థికశాస్త్ర నిపుణుడు `వీఎస్`
బహుముఖ ప్రజ్ఞావంతుడు:
ఆర్థిక శాస్త్రం, చరిత్రలో ఆయనకు గల పరిజ్జానం అపారం. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చరిత్రలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై రైట్స్ పురస్కారాన్ని అందుకున్నారు. అర్థ శాస్త్రంపై గ్రంథాలు రాశారు. శాసనసభలో ఆర్థికరాజకీయ అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలు సభ్యులకు ఆశ్చర్యం కలిగించేవట. రెడ్డిగారికి న్యాయశాస్త్రం అభ్యసించాలని ఉన్నా, గోపాలకృష్ణ గోఖలే సలహాపై ఎం.ఎ. చదివి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. అప్పట్లో ప్రఖ్యాత బ్రిటిష్ పార్ల మెంటేరియన్, మహావక్త బర్క్ తో కట్టమంచిని పోల్చడం అంటే అక్కడి సమాజంలో ఆయనకు గల స్థానాన్ని ఊహించవచ్చు.
ముసలమ్మ మరణంకు బహుమతి:
రామలింగారెడ్డి చిన్నతనంలోనే భారత, భాగవత, రామాయణాలు క్షుణ్ణంగా చదివారు. ఆయన కుటుంబ నేపథ్యం వల్లనే సాహిత్యంపై ఆసక్తి కలిగింది.విద్యార్థిగా 19వ ఏట రాసిన ముసలమ్మ మరణం’ కావ్యం ప్రథమ బహుమతిని అందుకుంది. ఊరి సంక్షేమం కోసం ఒక మహిళ ప్రాణత్యాగం చేయడం దాని ఇతి వృత్తం. పింగళి సూరన కళాపూర్ణోదయంపై ఆయన రాసిన విమర్శక వ్యాసం వేదం వేంకటరాయశాస్త్రి వంటి మహా పండితుల ప్రశంసలు అందుకుంది. 1911-12లో అర్థశాస్త్రంపై రాసిన గ్రంథం మద్రాసు విశ్వవిద్యాలయం బహుమతిని గెలుచుకుంది. ఆయన ‘కవితత్వ విచారం’ విమర్శక గ్రంథం పండిత, విమర్శకుల మన్ననలు అందుకుంది. దీని గురించి ‘కవిత్వతత్వ విచారంతో విమర్శపథాల్లో గొప్ప దృక్పథం కలిగించి నవ్య సాహిత్యానికి కొత్త బోదెలు తవ్వారు అని కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ, విమర్శ మార్గమున బాహిరజగత్తు నుండి అంతర జగత్తుకు కొనిపోయిన ప్రథమాంధ్ర విమర్శన గ్రంథం అని ఆచార్య పింగళి లక్మీకాంతం శ్లాఘించారు.
Also Read: వందేళ్ల చింతామణికి ‘నూరేళ్లు’
పురస్కారాలు:
కట్టమంచి వారి సర్వతోముఖ ప్రతిభా పాటవాలను గుర్తించిన ఆంగ్ల ప్రభుత్వం సర్ బిరుదుతో గౌరవించింది. ఆంధ్ర విశ్వ కళాపరిషత్ గౌరవ డాక్టరేట్ ప్రదానంతో కృతజ్ఞత చాటుకుంది. వాస్తవానికి విజ్ఞానఖని, మేధావి, వాక్చతురుడు, విషయ పరిజ్ఞానుడికి తగిన స్థాయి దక్కలేదేమోనని సమకాలీనుల చెప్పుకుంటారు. దక్కని హోదాలు, పదవుల కంటే వచ్చిన అవకాశాలకు న్యాయం చేయడమే ప్రధానమన్నది రెడ్డిగారి భావన. చివరి వరకు దానినే పాటించారు.
ఆయన బ్రహ్మచారి అయినా విద్యాలయాలే అయన కుటుంబం. మానవతా దృష్టి, ఉదార స్వభావం, మౌలిక చింతన, కళాదృష్టి లాంటి విశేష లక్షణాలు గల ఆయన అస్వస్థతతో 71 ఏట 1951 ఫిబ్రవరి 24న తనువు చాలించారు.
( ఫిబ్రవరి 24న కట్టమంచి వర్ధంతి)