కిందటి నెల ఒక వ్యక్తిగత పని మీద నేను ఆంధ్రా లో ఒక వారం ఉండాల్సి వచ్చింది… మా భీమవరం నుండి ఇంచుమించు ఆ వారం రోజుల్లో వీరవాసరం, అత్తిలి, పాలకొల్లు, పెనుగొండ, పెరవలి, మార్టేరు, తణుకు, నర్సాపురం, సిద్ధాంతం, రావులపాలెం, మండపేట, ఏడిద, ఉండి, గణపవరం, గుడివాడ, బందరు, ఆకివీడు, విజయవాడ… వంటి ఎన్నో చిన్న-పెద్ద పట్టణాల గుండా ఇలా తూర్పు – పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎన్నో ప్రాంతాల్లో, చిన్న-పెద్ద పల్లెలతో సహితం చాలా విస్తృతంగా తిరిగాను… అప్పటికీ, మా బావ నాకోసం ఎంతో ప్రేమతో ఒక సరికొత్త మోడల్ ఇన్నోవా కారును డ్రైవర్ తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా, అష్టదరిద్రంగా, పరమ నికృష్టంగా ఉన్న రోడ్ల కారణంగా నా కూసాలు కదిలిపోయి నా నడుము-వెన్ను విరిగినంత పనయ్యింది… వాటిని రహదారులు అనటం కన్నా చాలా వరకూ గోతులు-గుంతలతో నిండిన రోత పుట్టిస్తున్న, రోగాల పాల్జేస్తున్న ‘రాళ్లు-రప్పల’దారులు అనడం సబబు…
నీచనికృష్టరోడ్లు
నా ఆంధ్రా పర్యటనలో నడ్డి విరుస్తున్న, నీచ-నికృష్ట రోడ్లతో పాటు నా దృష్టిని ఆకర్షించినవి… ప్రతి ఊర్లో, చిన్నా-పెద్ద పల్లెల్లో, పట్టణాల్లో రోడ్ల పొడవునా ఏర్పాటు చేసిన రోత పుట్టిస్తున్న, రంధిపుట్టిస్తున్న రాజకీయ-కుల నాయకుల ఫ్లెక్సీలు… ఒక్కో సందర్భానికీ, ఒక్కో పండక్కీ, ఒక్కో సినిమాకీ, ఒక్కో హీరోకీ, ఒక్కో పార్టీకీ, ఒక్కో కులంతో, ఒక్కో వర్గంతో, ఒక్కో మతంతో ఒక్కో ఫ్లెక్సీ చొప్పున ఏర్పాటు చేసినట్టు మొత్తం రోడ్ల పొడుగునా ‘ఫ్లెక్సీ’ లే ‘ఫ్లెక్సీ’లు ఏర్పాటు చేసారు… అధికారం లో వున్న ప్రముఖుల వ్యక్తిగత భజన, వాళ్ళ చెంచాల డప్పు-దరువు-వందిమాగధుల రాతల్లో రాయించుకొని రోడ్ల కిరువైపులా నింపేశారు… ఈ శ్రద్ధలో కొంతలో కొంతైనా రోడ్ల పై చూపించినా, ఈ ఫ్లెక్సీలన్నీ రోడ్లపై పరిచినా, రోడ్లన్నీ బాగుపడి ఉండేవి… పేరుకి అభినందనలు తెలపటానికి ఏర్పాటు చేసినట్టు కనిపిస్తున్నా వాటి వెనుక ఉన్న కుల – మత – వర్గ విభజన స్పష్టం గా కనిపిస్తుంది…
దేవుళ్ళకీ కులాలు అంటగట్టడం పరాకాష్ట:
ఇందులో పరాకాష్ట ఏంటంటే… శ్రీకృష్ణుడంతటి దేవుడ్నీ, చరిత్రలోని మహానుభావులకు కూడా కులాలు అంటకట్టడం… అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణదేవరాయలు, వాల్మీకి , ఎన్టీఆర్, గాంధీజీ, తాండ్రపాపారాయుడు, బి.ఆర్. అంబేద్కర్, ఎస్ వి రంగారావు, సావిత్రి… వంటి వారిని, సినీ నటులందరినీ, మరెందర్నో కూడా కులాల వారీ గా ఫ్లెక్సీ లకు ఎక్కించారు కొందరు ఆంధ్రా నాయకులు… ఆంధ్రా జిల్లాల్లో పవితమైన “సుబ్రహ్మణ్య షష్టి” పండుగను సుబ్బారాయుడి షష్టి అని పిలవడం పరిపాటి… అలాంటి పవిత్రమైన ‘సుబ్బారాయుడి’ కి కూడా ‘రాయుడి’ పేరుని బట్టి కులాన్ని అంటగడుతున్న అజ్ఞానుల్ని కూడా కలిసే సౌభాగ్యం నాకు మా భీమవరం పర్యటనలో కలిగింది…
నవ్వు, బాధ, ఆవేదన
వీటిని చుస్తే ఒక రకం గా నవ్వు, ఇంకో రకం గా బాధ – ఆవేదన కలుగుతాయి. ఈ రాజకీయ- కుల నాయకులు ఆంధ్రా, తెలుగు, భారతీయ ప్రజలను ఓట్ల కోసం అన్ని రకాలుగా కులాల – వర్గాల పేర్లు చెప్పి రెచ్చగొట్టి, వంచిస్తూ, విభజన రాజకీయాలతో వాళ్ళ పబ్బం, స్వార్ధం బ్రహ్మాండం గా గడుపుకుంటున్నారు… ఒక్కో కులం వారూ ఒక్కో ఏరియా లో ప్రత్యేకమైన ఫ్లెక్సీలు, ఒక్కో కులానికీ ఒక్కో వాట్సాప్ గ్రూపులు, ఫేస్-బుక్ గ్రూపులు, కులాల-వర్గాల వారీగా పేపర్లలో ప్రకటనలు… ఇప్పట్లో ఉన్న కుల మత వర్గ విభజన ఎప్పుడూ లేదు… కులాభిమానం ఇప్పుడు పీక్స్ లో కనబడుతోంది… చదువుకున్నవాళ్లలో, యువతలో, పిల్లల్లో కూడా ఈ కులపిచ్చి లక్షణాలు కనపడటం చాలా బాధాకరం, దురదృష్టకరం, ఆందోళననకరం… రాజకీయాలు కులాధారంగా మారటం దీనికి ప్రధానకారణం… రాజకీయ నాయకులనే దీనికి ప్రధాన కారణం గా నిందించాల్సి వస్తుంది… వాళ్ళ రాజకీయ లబ్ది కోసం సమాజాన్ని కుల మత సంకుల సమరం గా మార్చేస్తున్నారు…
కులాలవారీ లెక్కలు
ఈ మధ్యన ఎలక్షన్ ఎక్స్పర్ట్లు గా, ఎన్నికల విజయ-సిద్ధాంతకర్తలుగా, ఎన్నికల్లో విజయం ‘పీకే’ వాళ్ళుగా ప్రచారం చేసుకొంటూ చెప్పుకు తిరుగుతున్న కొందరు బీహారీ ‘కేడీ’గాళ్ళు వీటిని పెంచి పోషిస్తున్నారు… ఓట్ల కోసం, అధికారం కోసం చాలా రాజకీయా పార్టీలు వీరిని బాగా నమ్మి వందల కోట్లు పెట్టి మరీ మేపుతున్నారు… కొన్నిసార్లు, కొంతవరకు వీళ్ళ చెత్త ఫార్ములాలు పనిచేసిన మాట నిజమే గానీ, వీళ్ళ సిద్ధాంతమే తప్పు… స్టాటిస్టిక్స్ ఆధారం గా ఓట్లను కులాల వారీగా లెక్కలు వేసి, నెగ్గడానికి అవసరమైన ఎక్కువ ఓట్ల ఫార్ములాలు మత – కులాల ఆధారం గా, వర్గ విభజన చేసి నిర్ధారిస్తారు… వీరికి తెలిసిన ఎలక్షన్ విన్నింగ్ ఫార్ములా ఇదే… వి’కులం’ చేత… ‘కులం’ కోసం… ‘కులం’ తో… సకలం ‘కులం’ గా… సం’కులం’తో వ్యా’కుల’మైపోతున్న మన ‘భారతీయం’
విభజించు, పాలించు
బ్రిటిషువాళ్ళు విజయవంతం గా నేర్పించిన ‘విభజించు – పాలించు – లాభపడు’… సమాజాన్ని కులాలవారీగా విడగొడుతున్నారు… వాళ్లకు ఓటు వేసే కులాల్ని మాత్రం లెక్కలు వేసుకొని ప్రత్యేకంగా చూసుకొని స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వీరి ప్రత్యేకత… లెక్కలు వేసుకొని ఎలాగూ కొందరు వాళ్లకు ఓటు వెయ్యరు గనుక వాళ్ళను పట్టించుకొనే పనే లేదని మరి కొన్ని కులాల పట్ల ద్వేషం నింపుతున్నారు… ప్రెజెంటేషన్ స్కిల్స్ , స్టాటిస్టికల్ ఎనాలిసిస్ ఆధారంగా కొన్ని గ్రాఫులు వేసి మొత్తం ప్రజల ‘నాడి’ పట్టేసాం అనే బీహారీ నయా రాజకీయ ‘నాడీ’ జ్యోతిష్యులు వీళ్ళు.
అటు నేనే, ఇటు నేనే…
ఒక్కోసారి రెండు ప్రధాన రాజకీయ పార్టీలకూ మళ్ళీ వీళ్ళే ఎలక్షన్ ఎక్స్పర్ట్లు. రెండు వర్గాలు గా విడిపోయి ప్రధాన – ప్రతిపక్ష పార్టీలకూ ఎన్నికల స్పెషల్ విజయసూత్రాలను ఇద్దరికీ కొన్ని వందల కోట్లకు అమ్మడం వీళ్ళ వ్యాపార ప్రత్యేకత… వీళ్లిందులో సిద్ధహస్తులు… నీతి, నియమం వీళ్ళకు ఎంత మాత్రం లేవు… కేవలం డబ్బు సంపాదనే వీరికి ప్రధానం… సమాజాన్ని వీళ్ళ వ్యాపారం కోసం మరింత గా చీలుస్తున్నారు… రోజు రోజు కీ ఇంకా నీచాలకు దిగజారుతున్నారు. నైతిక విలువల్లేని బిహారీ మార్కు రాజకీయ-వికృత ‘ప్రజాస్వామ్య’ హంతక ఎలక్షన్ కన్సల్టెంట్స్ వీరు… ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కే విరుద్ధం… ఎలక్షన్ కమిషన్ వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలి…
సోషల్ మీడియా విష వలయం:
ఇక కుల-మత విద్వేషాలు, రాజకీయాలు పెంచి పోషించడం లో ప్రధాన భూమిక, ప్రత్యేకం గా చెప్పుకోవాల్సిన ప్రధాన గోబెల్స్ తరహా ‘అ’వాస్తవ సోషల్ మీడియా… “సోషల్ మీడియా” గా పిలవబడే ఈ అప్రజా ‘జన’ మీడియా సహాయం తో అబద్ధాల్ని నిజం గా ప్రచారం చేయడం. నిజానికి సోషల్ మీడియా ఒక వ్యాపార ‘విష’ వలయం… అందులో 90% నిజమైన ప్రజా ప్రాతినిధ్యం ఉండదు. కొన్ని వేల కోట్ల వ్యాపారం కోసం అంతా సృష్టింపబడుతుంది, ఏదైనా నమ్మేలా కల్పిస్తారు, నిజాల్ని తారుమారు చేస్తారు… అవాస్తవాలను వాస్తవం అనిపించడం వీరి స్పెషలిటీ… అసత్యమే సత్యం అనిపించేలా భ్రమింపచేయడమే వీరి సోషల్ మీడియా వ్యాపార రహస్యం. ఇది మొత్తం ఒక విష విద్వేష సాలెగూడు… అందులో ప్రతీది అమ్మకానికి దొరుకుతుంది. ప్రతిక్షణం కొన్ని కోట్ల వ్యాపారం తో ప్రజల్ని వర్చ్యువల్- ఊహా ప్రపంచం లో నమ్మించడమే ప్రధానంగా సాగే మల్టీ నేషనల్ బిజినెస్ ఫార్ములా. మొబైల్ ప్రపంచం లో వీరు చూపించేదే నిజం అనేట్టు సృష్టిస్తారు… ప్రజల్లో అపోహల్ని, అపనమ్మకాల్ని కల్పిస్తారు… నమ్మేలా చేస్తారు…
అన్ని కులాలూ సఖ్యతగా ఉండేవి:
మా చిన్నప్పటి పరిస్థితి దీనికి చాలా భిన్నంగా ఉండేది… మా చిన్నప్పుడు మా ఊర్లో, ఆంధ్రాలో అందరూ, అన్ని కులాల వాళ్ళూ, వేరే మతాల వాళ్ళు కూడా చాలా సంతోషం గా కలిసి మెలిసి ఉండేవారు… కుల అభిమానాలు ఉన్నా ఇంత ‘కుల-గజ్జి’ అప్పట్లో ఉండేది కాదు… అన్ని కులాల వారు వేరే కులాల వారిని కూడా “అమ్మా! తమ్ముడూ! అన్నా! బావా! మావా! బాబాయ్! బామ్మర్దీ! అక్కా! వదినా! చెల్లాయ్! పిన్నీ! పెద్దమ్మా! చిన్నమ్మా! తాతా! బామ్మా!”… అంటూ వరసలు పెట్టి మరీ పిలుచుకొనేవారు… పంటలు, కూరగాయలు, కోడిని కోసినా, పొట్టేలు కోసినా, చేపలూ-రొయ్యలూ-పీతలు పట్టినా అందరూ ఒకరికొకరు పంచుకొని, కలిసే వండుకొని మరీ అందరూ సంతోషంగా తినేవారు… ఎవరింట్లో మంచి వేటమాంసం గానీ, పులస పులుసు గానీ, ఎప్పుడైనా కొన్ని ప్రాంతాల్లో, దగ్గర్లో అడవి వేట నుండి వచ్చే అడవి జంతువులు దుప్పి/జింక మాంసం గానీ, స్పెషల్ గా దొరికే మాంసాహారం చేసుకుంటే అందరికీ, అన్ని కులాల మిత్రులకూ ఆహ్వానాలు వెళ్లిపోయేవి…సహపంక్తి గా అందరూ కలసి మెలిసి భోజనాలు చేసేవారు.
మా చిన్నప్పుడయితే….
మా చిన్నప్పుడు ఎవరింట్లో గేదె ఈనినా జున్ను వండి వూరంతా పంచుకొని కలిసి తినడం నాకింకా గుర్తుంది… అలాగే తాటి ముంజెలు, మామిడి కాయలు, అరటి పళ్ళు, తాటి తేగలు, కొబ్బరి కాయలు, చింతకాయలూ, నేరేడు పళ్ళు… అన్నిరకాల పళ్లు, కూరగాయలు… ఇలాంటివెన్నో వూళ్ళో అందరూ కలసి పంచుకు తినడం నా జ్ఞాపకాల్లో ఉన్నాయి… ఊర్లో గుళ్లో పూజలు జరిగినా, అమ్మవారి జాతర జరిగినా, తీర్ధం జరిగినా అందరూ ఎంతో సంతోషం గా కలిసిమెలసి జరుపుకోవడం నాకు ఇప్పటికి చాలా గుర్తు… మా స్నేహితులు అన్ని కులాల వాళ్ళూ ఉండేవారు… మేమంతా ఎప్పుడూ కులాల- మతాల గురించి ఆలోచనతో ఉండేవాళ్ళం కాదు… అవి మంచి రోజులు… ఇప్పుడేమో పిల్లలు కూడా కులాల గురించి చిన్నప్పట్నుంచీ సోషల్ మీడియా లో మాట్లాడుతున్నారు… ఇప్పుడున్న కులపిచ్చి ఎప్పుడూ లేదు… కులాల పేరు చెప్పి ప్రజల్ని విడగొడుతున్నారు… ఇలా ఎంతకాలం?… ఇంకెంత కాలం ఈ నీచమైన కుల రాజకీయాలు…?
ఒక కులంపైన స్పెషల్ ‘కక్ష’ ఎందుకు?
ఇంకా ఈ మధ్య ఒక కులం కారణం గానే ఆంధ్రా రాజధాని ని కూడా మార్చేశామని అధికార ప్రముఖులు, అమాత్యులు కూడా సెలవిచ్చినట్టు మీడియా లో విస్తృతం గా చూశాము… రాష్ట్ర ప్రభుత్వమే ఒక కులాన్ని ప్రత్యేకం గా టార్గెట్ చేయటమేమిటి…?… ఒక కులం పై ఎందుకు స్పెషల్ ‘కక్ష’…? అన్ని కులాల వాళ్ళు కలిస్తేనే రాష్ట్రం, రాజ్యం, ప్రభుత్వం కదా…?… ఇది నిజమైతే, అంతకన్నా దౌర్భాగ్యం మరోటి లేదు…!… ఈ మధ్య అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నికైన జో బిడెన్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే చేసిన ప్రకటన ఈ ప్రపంచానికే ఆదర్శం… “ఇక ఎన్నికలు ముగిశాయి… ఇక డెమొక్రాట్లు, రిపబ్లికన్లు అనే భేదభావం నాకు లేదు… అందరూ నా అమెరికన్లే… నేను మొత్తం అమెరికా కు అధ్యక్షుడిని… నాకు అందరు ప్రజలూ ఒకటే… ప్రజలంతా నాకు సమానమే”.
ప్రజలకోసం, ప్రజలచేత:
రాజకీయం అంటే అలా ఉండాలి… కులం ఆధారంగా కొందరిపట్ల, కొన్ని కులాల పట్ల వివక్ష చూపించడం ఏ రకం గా న్యాయం? ధర్మం? రాజ్యాంగబద్ధం…?… ప్రజల కోసం … ప్రజల చేత… ప్రజల తో… ప్రజా ప్రభుత్వం గా పరిఢవిల్లవలసిన మన పవిత్ర ప్రజాస్వామ్య భారత దేశం దురదృష్టవశాత్తు ‘కులం’ చేత… ‘కులం’ కోసం… ‘కులం’ తో… సకలం ‘కులం’ గా… మన పవిత్ర భారతదేశం సం’కుల’ సమర వేదికై పోతున్నది… ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం… భారత ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు… ఈ కులస్వామ్యాన్ని కూడా ప్రశ్నించలేని ప్రజాస్వామ్యమెందుకు…???
మానవత్వమే నిజమైన మతం :
సర్వ కుల-మత సమానత్వమే భారతీయత… ఈ కుల-మత వివక్ష, దురభిమానం, దురహంకారం భారతీయ సామాజిక రుగ్మతలు. వీటిని రూపుమాపనంతవరకూ భారత దేశానికీ, భారతీయతకు, మన స్వాతంత్య్రానికీ నైతికం గా ఎటువంటి విలువా లేదు.నవరత్నాల్లాగే ‘నాణ్యమైన’ మంచి రోడ్లు కూడా మన ప్రజలకు, ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరమనీ, అన్ని కులాలు, అన్ని మతాలూ కూడా అన్నిరకాలుగా సమానమే అనీ, అన్ని ఓట్లు కూడా ఒక్కటే అనీ కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించాలని అన్ని కులాల దేవుళ్లనూ పేరుపేరునా కోరుకొంటూ…
జై హింద్ … భారత మాతకు జై…
ఇదీ చదవండి:సంక్రాంతి శోభ