Thursday, November 21, 2024

దేశాధినేతలను సైతం వదలని మహమ్మారి

  • ట్రంప్ దంపతులకు కోవిద్ పాజిటీవ్
  • రత్నాల్లాంటి ప్రణబ్ దానీ, బాలూనీ కోల్పోయాం
  • టీకా మందు వచ్చే లోగా అందుబాటులోకి కొన్ని మందులు
  • ప్రజలకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వాలదే
మాశర్మ

కరోనాకు  కట్టడి ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ, అది సృష్టిస్తోన్న విలయం సాధారణంగా లేదు. తాజాగా  దేశంలో కోవిద్ మరణాల సంఖ్య లక్ష దాటింది. దీంతో లక్షకు పైగా మృతుల సంఖ్య నమోదు చేసుకున్న మూడవ దేశంగా భారత్ నిలిచింది. కరోనా కేసుల సంఖ్యలో ప్రపంచంలో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 65 లక్షలకు చేరువలో ఉంది. 73 లక్షల కేసులతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. భారత్ లో వ్యాప్తి తీరును గమనిస్తే, త్వరలోనే అమెరికాను దాటిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన దేశంలో సగటున రోజుకు 1000మందికి  పైగా కోల్పోతున్నాం. సామాన్యుల నుండి మాన్యులవరకూ ఎందరినో పోగొట్టుకుంటున్నాం. భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కోల్పోయాం.రత్నం వంటి గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని పోగొట్టుకున్నాం. వైరస్ సోకిన తర్వాత కూడా ఎంతో ధైర్యంగా మాట్లాడిన జాతీయ స్థాయి నాయకులను కూడా కాపాడుకోలేకపోయాం.

బతికి బయటపడిన బోరిస్ జాన్సన్

తాజాగా,  ప్రపంచ అగ్రరాజ్యమైన  అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులను కూడా కరోనా తాకింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా తక్కువ మోతాదులో సోకింది. శత్రు దుర్భేద్యమైన వైట్ హౌస్ లోనూ కరోనా ప్రవేశించింది. అంతకు ముందు ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్ కి కరోనా తాకింది. ఆయన క్షేమంగా గట్టెక్కారు. ఇలా.. దేశాధ్యక్షులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, మంత్రులు, అధికారులు, జర్నలిస్టులు ఎవ్వరూ దీని నుండి తప్పించుకోలేక పోతున్నారు. ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబసభ్యులను కూడా కోల్పోతూ ఎందరో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు. మన అగ్రనేతలు ఎప్పటి నుండో  అంటున్నట్లుగా,  కరోనాతో కాపరం చేయడమేనా? కలిసి సాగడానికి కోవిడ్ -19  జీవితభాగస్వామి కాదు, జీవితాన్ని హరించే పెద్ద వైరస్. ఆరోగ్యవంతమైన, విలాసవంతమైన భవనాల్లో జీవిస్తూ, 24గంటలూ చుట్టూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అగ్రాసనాధిపతులకు కూడా కరోనా సోకితే, ఈ పరిణామాలు ఎటువంటి  సందేశాన్నిస్తాయి?  ఏ విధంగా అర్ధం చేసుకోవాలి. ఎవరి నుండి ఎవరికైనా, ఎప్పుడైనా వైరస్ సోకుతుంది, అన్నది అర్ధమవుతోంది.మీ స్థాయి వారే వైరస్ సోకకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోలేకపోతే, మమ్మల్ని మీరేమి రక్షిస్తారంటూ.. దేశాధినేతలను ఉద్దేశించి సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి సంకేతం కాదు. త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడి ప్రజల నాడిని  కొంత అర్ధం చేసుకోవచ్చు.

జమిలి ఎన్నికలపై వదంతులు

భారతదేశంలో 2022లో జమిలి ఎన్నికలు రావచ్చుననే వార్తలు గుప్పుమంటున్నాయి. నిజంగా జరిగితే, ఈలోపు కరోనాను కట్టడి చెయ్యలేకపోతే, అధికారంలో ఉన్న  పార్టీ ప్రజాగ్రహాన్ని చవి చూడక తప్పదు. ఇప్పటికే  ప్రజలు నైతిక ధైర్యాన్ని కోల్పోతున్నారు.వ్యాక్సిన్ల మీద నమ్మకం పెట్టుకున్నారు. టీకాలు  అందుబాటులోకి వస్తే, సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేస్తామనే విశ్వాసంలో ప్రపంచ మానవాళి మొత్తం ఉంది.మానవాళి మొత్తానికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టేట్టు ఉంది. ప్రస్తుతం కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. అవి కొంత మేరకు పని చేస్తున్నాయి. ఇది మంచి పరిణామమే. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి  రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందనే వార్తల నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు ఏ మేరకు పనిచేస్తాయన్న విషయంపై ప్రభుత్వ వర్గాల నుండి విస్పష్టమైన ప్రకటనలు వెలువడాలి. అవి ప్రజలకు నైతిక ధైర్యంతో పాటు, వైద్య సేవల పరంగా మార్గదర్శనం చేస్తాయి. మన జనాభాతో పోల్చుకుంటే వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య తక్కువే కావచ్చు. కానీ, దేశంపై పడుతున్న భారం, ప్రజల్లో నెలకొన్న భయం  సామాన్యమైవి కాదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల రీకవరీలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువని ఆరోగ్య శాఖ వెల్లడించడం ఆనందావహ అంశమే. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 54లక్షల మంది వైరస్ బారి నుండి బయటపడ్డారు. భారతదేశ భౌగోళిక వాతావరణం, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన అంశాలు మొదలైనవి దీనికి కారణాలు  కావచ్చు. ఇది మా గొప్పే అంటూ ప్రభుత్వాలు జబ్బలు చరుచుకోవాల్సిన అవసరం లేదు.

ఆస్పత్రి కంటే ఇల్లే పదిలం

వైరస్ సోకిన వ్యక్తులు ఇంటి దగ్గరే వుండి (హౌస్ క్వారంటైన్ ) చికిత్స తీసుకుంటున్నవారు త్వరగా కోలుకుంటున్నారు. మరణాల  తీరును పరిశీలిస్తే, ఆస్పత్రుల్లో చేరినవారికే ఎక్కువగా  ప్రాణహాని కలుగుతోందనే వాదనలు వింటున్నాం. ఆస్పత్రిలో చేరడం వల్ల న్యూమోనియా సోకి మరణానికి కారణం అవుతోందంటున్నారు. దీనికి వెనకాల ఉన్న అసలు నిజాలు, వాస్తవాలు ఇంకా పరిశోధించాల్సి వుంది. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది. వైరస్ సోకి  ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరినవారిపై ఆర్ధిక భారం భరించలేని స్థితిలో ఉందనీ, వైద్య చికిత్సకు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అమానవీయ పోకడలకు కళ్లెం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకే వుంది. జనవరి 2021కి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే అన్నారు. ఈ సంవత్సరాంతానికి (2020) వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, సామాన్యప్రజలకు కూడా భారం కాకుండా చౌకగా లభిస్తుందని తెలంగాణ గవర్నర్ తమిళసై ఈమధ్యనే అన్నారు. ఈ చల్లని మాటలు  నిజం కావాలని కోరుకుందాం. ఈ తరుణంలో,  కరోనా చుట్టూ నెలకొని ఉన్న అన్ని అంశాలకూ దేశాధినేతల నుండి స్పష్టమైన మార్గదర్శనం కావాలి. దేశ ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఏలినవారికి వుంది.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles