- చైనా, జపాన్, దక్షిణకొరియాలో విజృంభణ
- పండుగల సీజన్ ముందు భయాందోళనలు
- జాగ్రత్తలు పాటించడం ఒక్కటే శ్రీరామరక్ష
కరోనా మళ్ళీ విజృంభిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ తీవ్రత ప్రస్తుతం విదేశాలకే పరిమితమై ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను అప్రమత్తంగా ఉండమని హెచ్చరిస్తోంది. సరే! కరోనాకు పుట్టినిల్లైన చైనాలో ఎన్నాళ్ల నుంచో మరణమృదంగాలు మోగుతున్నాయి. జపాన్, దక్షిణకొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసుల నమూనాలను జీనోమ్ స్వీక్వెన్సింగ్ కు పంపాలని కేంద్రం సూచించింది. దీని ద్వారా కొత్త వేరియంట్లను గుర్తించవచ్చు. అమెరికాలో కూడా కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో నాలుగో వేవ్ ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం గతంలో అనుసరించి కరోనాను కట్టడి చేసిన ఐదంచల వ్యూహాన్ని మళ్ళీ అమలుచేసే ఆలోచనలో కేంద్రం ఉంది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కట్టడి. ఈ అంశాలే మన అంబులపొదిలోని ఆయుధాలు. ప్రస్తుతం మన దగ్గర వారానికి 1200 కేసులు నమోదవు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కేసులు నమోదవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ దేశాల్లో కరోనా అలజడి చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కేంద్ర ఆరోగ్యశాఖ పలు విభాగాలతో కీలక సమీక్ష నిర్వహించనుంది. రాష్ట్రాలను కూడా కేంద్రం అప్రమత్తం చేస్తోంది.
Also read: అవధాన దినోత్సవం
ప్రభుత్వాలు, ప్రజలు సంసిద్ధం కావాలి
ఇప్పుడిప్పుడే ఒకప్పటి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ, ఈ వార్త కలవర పెడుతోంది. మిగిలిన దేశాల వలె మనం కూడా కష్టనష్టాలను ఎదుర్కొన్నా, మన దేశ జనాభా పరంగా చూసుకుంటే మనం కరోనా కట్టడిలో మంచి విజయాన్ని సాధించామనే చెప్పాలి. పండుగల సీజన్ ఇప్పటికే మొదలైంది. మరి నాలుగురోజుల్లోనే క్రిస్టమస్, మరి నాలుగురోజుల్లో న్యూ ఇయర్, ఆ తర్వాత సంక్రాతి పండుగలు ఎదురుగా ఉన్నాయి. ముఖ్యంగా కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా జనం గుంపులుగుంపులుగా జమ కూడతారు. షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ బిజీబిజీగా మారిపోతున్నాయి. ఎయిర్ పోర్ట్స్, బస్, రైల్వే స్టేషన్స్ లో రద్దీ షరా మామూలే. విదేశాల నుంచి వచ్చేవారితోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సివుంది. ప్రభుత్వాల పర్యవేక్షణ ఉన్నపటికీ, స్వయంక్రమశిక్షణ కీలకం. ఈ సీజన్ కూడా చలి, జలుబు, దగ్గుజ్వరాలతో నిండుకొని ఉంటుంది. ఈ విధంగానూ అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్తలు పాటిస్తూ, ధైర్యాన్ని కోల్పోకుండా ఉండడమే మన ముందున్న మార్గాలు.
Also read: గుండెను పిండే విషాదం