- యూరోప్ దేశాలలో తిరిగి తలెత్తుతున్న కోవిద్
- భారత్ లో తగ్గుముఖం, కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుదల
- జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఒక్కటే కర్తవ్యం
- భయపడితే నష్టం, ధైర్యంగా సమస్యను ఎదుర్కోవడం సరైన మార్గం
క్రమంగా తగ్గుముఖం పడుతోందన్న కరోనా మళ్ళీ కలవరం పెడుతోంది. ప్రపంచంలో పలు దేశాలు లాక్ డౌన్ ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఐరోపాలోని ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ మొదలైన దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో కరోనా విజృంభణ మళ్ళీ మొదలైంది. ఫ్రాన్స్ లో వ్యాపారులు కార్యకలాపాలను మరో నెల రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. స్పెయిన్ లో స్థానిక ప్రభుత్వాలు కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిషేధించాయి. లండన్ లో రానున్న రోజుల్లో రోజుకు 96 వేలకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఒక అధ్యయనం చెబుతోంది. స్విట్జర్లాండ్, టర్కీ, నెదర్లాండ్, బెల్జియం, జర్మనీలో కూడా కేసులు విస్తృతంగా పెరిగే అవకాశముందని మరికొన్ని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
కాన్పూర్ ఐఐటీ బృందం అధ్యయనం
ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజులోనే 5లక్షల 40వేలకు పైగా కొత్త కేసులు, 7వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 4.52కోట్ల మందికి కరోనా సోకింది. 11 లక్షల 85 వేలకు పైగా మరణాలు సంభవించాయి. భారతదేశంలో జనవరి – 2021కల్లా 1.4కోట్ల కేసులు నమోదమవుతాయని ఐ.ఐ.టీ. కాన్పూర్ బృందం అంచనా వేసింది. ఈ బృందానికి ఈ విద్యాలయానికే చెందిన భౌతికశాస్త్రం ప్రొఫెసర్ మహేంద్ర వర్మ నాయకత్వం వహించారు. భారతదేశంలో సెప్టెంబర్ 22వ తేదీ వరకూ నమోదైన కేసులను వీరు ప్రామాణికంగా తీసుకున్నారు. నిజంగా, ప్రస్తుతం భారత్ లో కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య, రోజుకు 36వేలకు పడిపోయాయి. గడచిన 24 గంటల్లో 48వేల కేసులు నమోదయ్యాయి. మన దేశంలో ఇప్పటి వరకూ 80.88లక్షల కేసులు నమోదైనా, అందులో చాలా కేసులలో రోగులు కోలుకున్నారు. రికార్డు స్థాయిలో 91.15% రికవరీ రేటు సాధించాం. 73.73 లక్షల మంది ఈ వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
భారత్ లో మరణాల సంఖ్య తగ్గుముఖం
ప్రస్తుతం భారతదేశంలో యాక్టీవ్ గా ఉన్న కేసులు కేవలం ఆరు లక్షల లోపే కావడం విశేషం. మరణాల సంఖ్య: 1.21లక్షలు. సాధారణ మరణాల గ్రాఫ్ ను పరిశీలిస్తే, గత 70 ఏళ్ళల్లో క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా 2010 నుండి 2020 వరకూ ఈ గ్రాఫ్ ఒకే విధంగా సాగుతోంది. 139కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో కరోనా వ్యాప్తి, మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. దేశంలో ఇప్పటి వరకూ 10కోట్ల మందికి పైగా కోవిడ్ పరీక్షలు జరిపారు. పరీక్షలు ఇంకా వేగవంతం చెయ్యాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం డిసెంబర్ నుండి 2021జులై మధ్య కాలంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని వార్తలు వింటున్నాం.
జాగ్రత్తలు పాటించడమే శరణ్యం
అప్పటిదాకా, జాగ్రత్తలు పాటించడం ఒక్కటే శరణ్యం. పండుగ సీజన్ దగ్గర పడింది. రాబోయేది చలికాలం కాబట్టి, కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉందని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి.సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వివిధ దశల్లో లాక్ డౌన్ నిబంధనలను భారీగా సడలించారు. ఈ నేపథ్యంలో, కేసుల సంఖ్య ఉధృతమైంది. గత నెల రోజులుగా తగ్గుముఖం పట్టడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నాం. భారతదేశంతో పాటు ప్రపంచంలోనూ రానున్న రోజుల్లో కేసులు పెరుగుతాయని తాజా నివేదికలు చెప్పడంతో, మళ్ళీ మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడుతోంది.
వైరస్ లో రకరకాల మార్పులు
ప్రభుత్వాల చర్యలతో పాటు, ప్రతి ఒక్కరూ స్వయం క్రమశిక్షణ పాటించడం ఒక్కటే ప్రధానమైన రక్షణ కవచం. గత డిసెంబర్ లో పుట్టిన ఈ వైరస్ ఈ 11నెలల్లో వివిధ మార్పులకు (మ్యుటేషన్స్) గురిఅయ్యింది. ఈ మార్పులు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మొదట్లో వైద్యులు, శాస్త్రవేత్తలకు కూడా అర్థంకాక ఈ వైరస్ ముప్పుతిప్పలు పెట్టింది. క్రమంగా దీన్ని అర్థం చేసుకొనే శక్తి వారిలో పెరిగింది. ప్రజల్లోనూ అవగాహన పెరుగుతోంది. అదే సమయంలో, ప్రజల్లో ఆరోగ్య స్పృహ కూడా పెరుగుతోంది. కరోనాకు భయపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. పైగా, నష్టం జరుగుతుంది. మానసిక ఒత్తిడి, శారీరక బలహీనత పెరిగి, నిరోధక శక్తి తగ్గుతుంది. కరోనాకు భయపడకుండా, జాగ్రత్తలు పాటించండి, సరియైన చికిత్స పొందండి, అని మానసిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జీవిక, జీవించడం రెండూ ముఖ్యమే. సమాంతరంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, ఆరోగ్యస్పృహతో ఉండడమే మనకున్న ఏకైక మార్గం.