- కరోనాని ఫ్లూ అనుకొని అలక్ష్యం చేస్తే ప్రమాదం
- మూడు టీకాలు ముమ్మాటికీ అవసరం
కరోనా వైరస్ వేరియంట్లు నీడలా వెంటాడుతున్నాయి. ప్రస్తుతానికి 300కు పైగా సబ్ వేరియంట్లు ఉన్నట్టు సమాచారం. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చిందనుకుంటున్న సమయంలో ఎక్స్ బిబి పేరుతో ప్రచారంలో ఉన్న సబ్ వేరియంట్ ఆందోళన కలిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మరో వేవ్ కు దారితీయొచ్చని డబ్ల్యూ హెచ్ ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ హెచ్చరిస్తున్నారు. దీనికి రోగ నిరోధకశక్తిని ఏమార్చే గుణం ఉందని ఆమె అంటున్నారు. దీనిని ప్రమాదకర పరిణామంగా భావించాలి. కొన్ని దేశాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అధిక జనాభా కలిగివున్న భారతదేశం మరింత అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. వైరస్ పరిణామం చెందుతున్న కొద్దీ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కొత్త సబ్ వేరియంట్ వల్ల వ్యాధి తీవ్రత స్థాయిని ఇంకా గణించాల్సి వుంది.
Also read: వీరవిధేయుడు విజేత కాగలరా?
మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి
వైరస్ వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గతంలో వచ్చినవారికి కూడా సోకుతోంది. కోవిడ్ అనంతర దుష్ప్రభావాలను ఇంకా చాలామంది అనుభవిస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా నమోదవుతున్నాయి. గణాంకాలను గమనిస్తే కరోనా పూర్తిగా కట్టడిలోకి రాలేదని చెప్పవచ్చు. కరోనాను కేవలం ఫ్లూ అనే భావించేవారి సంఖ్య పెరిగిపోతోంది. శాస్త్రీయంగా ఈ భావన చాలా తప్పని వైద్య నిపుణులు అంటున్నారు. కరోనాను తేలికగా చూసేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ దృక్పథంతో జాగ్రత్తలు పాటించడం లేదు. గుంపులు గుంపులుగా గుమిగూడుతున్నారు. మాస్క్ లు ధరించడం చాలా వరకూ మానేశారు. భౌతిక దూరం అన్న ఊసేలేదు. వీటికి తోడు బూస్టర్ డోసులు వేయించుకొనేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. తీవ్ర వ్యాధి లక్షణాల నుంచి ఇప్పటికీ రక్షణ కవచాలుగా ఉపయోగపడేది వ్యాక్సిన్లు అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. జాగ్రత్తలు పాటించడంతో పాటు మూడు డోసుల వ్యాక్సినేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని డబ్ల్యూ హెచ్ ఓ సైతం హెచ్చరిస్తోంది. రెండు డోసులు వేయించుకున్న 4-6నెలల వ్యవధిలో బూస్టర్ డోసును వేయించుకోవాలి. దీనిపై ఈమధ్య కాలంలో ప్రచారం కూడా తగ్గిపోయింది. కరోనా విషయంలో అశ్రద్ధతో పాటు ప్రజలు విసిగిపోయారని వ్యాక్సిన్ నిర్మాణ సంస్థలు అంటున్నాయి. దీని వల్ల ఉదాసీనత కూడా పెరిగిపోయిందని భావించాలి. 2021డిసెంబర్ నాటికే కోవిషీల్డ్ ఉత్పత్తిని కూడా నిలిపివేసినట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ సీ ఈ ఓ అదర్ పూనావాలా మీడియాకు వివరించారు. వాళ్ళ దగ్గర స్టాక్ మిగిలిపోవడమే కాక డోసుల గడువు కూడా ముగిసిపోయిందని ఆయన చెప్పుకుంటూ వచ్చారు.
Also read: శేషేంద్ర కవీంద్రుడు
ఇప్పటికీ కరోనా గుప్పిటలో చైనా
ఈ వైఖరి వల్ల మళ్ళీ కరోనా విజృంభించడానికి అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర వంటి కొన్ని చోట్ల స్వల్పంగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు కూడా పెంచాల్సి వుంటుంది. ఇప్పటికీ చైనా కోవిడ్ గుప్పిట్లోనే ఉంది. కరోనా వైరస్ నుంచి అనేక పాఠాలు నేర్చుకోవాల్సి వుంది. అందులో పర్యావరణ సమతుల్యతను కలిగి ఉండడం ప్రధానమైంది. వాతావరణ మార్పులతో కలిగే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో కరోనా చూపించింది. వ్యాక్సిన్లు తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకే అవకాశం ఉన్నప్పటికీ, వ్యాధి తీవ్రతను తగ్గించడానికి, మరణాలను అరికట్టడానికి వ్యాక్సిన్లు తప్పక ఉపయోగపడతాయని డబ్ల్యూ హెచ్ ఓ కూడా బలంగా చెబుతోంది. అమెరికాలో వ్యాక్సినేషన్ కు దూరంగా ఉన్నవారిలోనే మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని డబ్ల్యూ హెచ్ ఓ అధికారులు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా పరిణామాలను గమనిస్తే కరోనా మనల్ని పూర్తిగా వీడలేదని అర్థం చేసుకోవాలి.అన్ని జాగ్రత్తలు పాటించాలని తెలుసుకోవాలి. బూస్టర్ డోసులు వేయించుకోవాలని గ్రహించాలి.
Also read: భారత్ కు ఐఎంఎఫ్ తీపి కబురు